వరదకు.. విరామం

ABN , First Publish Date - 2021-08-04T05:58:17+05:30 IST

కొల్లూరు, భట్టిప్రోలు, తాడేపల్లి టౌన్‌, ఈఆగస్టు 3 : నాగార్జున సాగర్‌ నుంచి నీటి విడుదల సోమవారం 22 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల చేయగా మంగళవారం అది నాలుగు గేట్లకే పరిమితమైంది.

వరదకు.. విరామం
పెదలంక: అరటితోటలోకి చేరిన వరదనీరు

కరకట్టను తాకిన కృష్ణమ్మ

నదిలో తగ్గుతోన్న వరద ప్రవాహం

సాగర్‌ నుంచి 4 గేట్ల ద్వారానే నీటి విడుదల

ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు 2.11 లక్షల క్యూసెక్కులు 

పోతార్లంక - దోనేపూడి చప్టాపై వరద నీటి ప్రవాహం

ఓలేరు వద్ద కరకట్టను పరిశీలించిన కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌

కరకట్ట లోపల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక



రెండు రోజులుగా గంటగంటకు పెరుగుతున్న ప్రవాహంతో పరుగులిడుతున్న కృష్ణమ్మ శాంతించింది. ప్రస్తుతానికి వరద ఉధృతి తగ్గింది. నాగార్జున సాగర్‌ నుంచి కేవలం నాలుగు క్రస్ట్‌గేట్ల ద్వారానే మంగళవారం నీటిని విడుదల చేశారు. దీంతో నదిలో వరద ప్రవాహ ఉధృతి చాలావరకు తగ్గింది. అయితే ప్రకాశం బ్యారేజి వద్ద మాత్రం అదే ఉధృతి కొనసాగుతుంది. మంగళవారం 2 లక్షల 11 వేల 7 వేల క్యూసెక్కులనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో వరద ప్రవాహం కరకట్టను తాకింది. లంక గ్రామవాసులు, రైతులు ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. ఓలేరు వద్ద కరకట్టను కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ పరిశీలించారు. కరకట్ట వెంబడి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడికక్కడ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.    ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున కరకట్టపై భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు.  

 

కొల్లూరు, భట్టిప్రోలు, తాడేపల్లి టౌన్‌, ఆగస్టు 3 : కొల్లూరు, భట్టిప్రోలు, తాడేపల్లి టౌన్‌,  ఈఆగస్టు 3 : నాగార్జున సాగర్‌ నుంచి నీటి విడుదల సోమవారం 22 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల చేయగా మంగళవారం అది నాలుగు గేట్లకే పరిమితమైంది. దీంతో నదిలో నీటి ప్రవాహ ఉధృతి తగ్గింది. సాగర్‌ వద్ద ఉదయం 18 గేట్లు ద్వారా నీటి విడుదల జరగ్గా, సాయంత్రం 6 గంటలకు కేవలం 4 గేట్ల ద్వారా ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద పవర్‌ జనరేషన్‌ ద్వారా 13,200 క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు.    పులిచింతల, బ్యారేజి ఎగువున ఉన్న వాగుల నుంచి మంగళవారం 2 లక్షల 23 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజికి ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్లు జేఈ దినేష్‌ తెలిపారు. డెల్టా కాలువలకు 9700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం నమోదవుతుండగా 30 గేట్లను 5 అడుగులు, 40 గేట్లను 4 అడుగుల ఒంతున ఎత్తి 2 లక్షల 11 వేల 7 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి నీటి విడుదల తగ్గించడంతో వరద ఉధృతి క్రమేపీ తగ్గే అవకాశం ఉందని జేఈ తెలిపారు. ప్రకాశం బ్యారేజి నుంచి 2 లక్షల 11 వేల 7 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేయడంతో మంగళవారం వరద ప్రవాహం కరకట్టను తాకింది. దోనేపూడి-పోతార్లంక రహదారి చప్టాపై వరద నీరు ప్రవహించడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. పోతార్లంక, తిప్పలకట్ట, తోకలవానిపాలెం గ్రామాలకు వెళ్లాలంటే కొల్లూరు, గాజుల్లంక, వెల్లటూరు మీదుగా తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహానికే నది అంచులు గండ్ల నుంచి వరద నీరు చొచ్చుకుని వస్తుంది. 

వరద ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్‌

వరద ప్రవాహాన్ని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఎమ్మెల్యే మేరుగు నాగార్జునతో కలిసి మంగళవారం పరిశీలించారు. కొల్లూరు కరకట్ట వద్ద ఇటుక కోసం తీసిన గోతుల్లో వచ్చిన వరద నీటిని కలెక్టర్‌ పరిశీలించారు. వరద ప్రవాహం వల్ల లంక గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి సైతం దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని ఎమ్మెల్యే కలెక్టర్‌కు వివరించారు. అనంతరం అరవింద వారధి ఎగువన ఉన్న గండి ప్రదేశానికి చేరుకుని అక్కడ పరిస్థితులను పరిశీలించారు. గండి పూడ్చకపోవడం వల్ల సుమారు వెయ్యి ఎకరాలకు పైగా వేసిన పంటలు వరద నీటి ముంపునకు గురి కావడంతో పాటు పెసర్లంక గ్రామాన్ని వరద నీరు చుట్టు ముట్టి వేస్తుందని కలెక్టర్‌కు ఎమ్మెల్యే చెప్పారు. మండలంలోని గాజుల్లంక, పోతార్లంక, కిష్కిందపాలెం మీదుగా భట్టిప్రోలు మండలంలోని లంక గ్రామాలతో పాటు ఓలేరు వద్ద వరద ప్రవాహాన్ని కలెక్టర్‌ ఎమ్మెల్యే, సబ్‌ కలెక్టర్‌ నిధిమీనాతో కలిసి పరిశీలించారు. అనంతరం భట్టిప్రోలు మండలంలోని ఓలేరు పల్లెపాలెం వద్ద గతంలో కరకట్టకు గండిపడిన ప్రాంతాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కరకట్ట బలహీనంగా ప్రాంతాల్లో తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ప్రవాహాన్ని గమనిస్తూ లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఎమ్మెల్యే నాగార్జున కోరారు. పెనుమూడి కృష్ణానదికి వరద నీరు పోటెత్తింది. పుష్కర ఘాట్‌లోని 2 మెట్లు మునిగిపోయాయి. కరకట్ట వెంట ఉన్న గ్రామస్థులను తహసీల్దారు విజయశ్రీ అప్రమత్తం చేశారు. పల్లెపాలెం, తదితర గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచించారు. 


అరవింద వారధి వద్ద గండి

కొల్లూరు మండలంలోని అరవింద వారధి వద్ద  గండి పడింది. ఈ గండిలో నుంచి పల్లాలను ముంచెత్తుతూ కరకట్టను వరద నీరు తాకింది. కొల్లూరు, గాజుల్లంక, పెసర్లంక, ఆవులవారిపాలెం గ్రామాల పరిధిలో ఉన్న ఇటుక బట్టీలు వరద నీటి బారిన పడ్డాయి. పల్లాల్లో సాగు చేస్తున్న పశుగ్రాసం, కూరగాయ పంటలు మునిగిపోయాయి. పెసర్లంక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. గాజుల్లంక-దోనేపూడి రహదారి ఇరువైపులా వరద నీరు పొటెత్తింది. ఇటీవల ఇసుక తరలింపునకు తవ్విన ప్రాంతాల్లో నుంచి వరద నీరు చొచ్చుకు వచ్చి పంట భూముల్ని ముంచెత్తింది. గండి ప్రాంతాన్ని కలెక్టర్‌ పరిశీలించి వెంటనే పూడ్చివేతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గండిని వెంటనే పూడ్చకపోతే పెసర్లంక గ్రామాన్ని వరద నీరు చుట్టు ముట్టేస్తుందని కలెక్టర్‌కు ఎమ్మెల్యే నాగార్జున చెప్పారు. 



వరదొస్తుందంటే.. వామ్మో

గండ్లతో బలహీనంగా కరకట్ట

ఎన్నాళ్లుగానో తాత్కాలిక మరమ్మతులతో సరి 

నదికి వరద వస్తుందంటే కరకట్టవాసుల్లో భయం 

పెండింగ్‌లో శాశ్వత మరమ్మతుల ప్రతిపాదనలు

రూ.8.20 కోట్లు విడుదలపై ప్రభుత్వం తాత్సారం 


గుంటూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదికి వరద వస్తుందంటే కరకట్ట సమీప గ్రామీణులకు కంటిమీద కునుకు ఉండదు. ఓ మోస్తరు వరదకే లంకల్లోని పంట భూములు మునిగిపోతాయి. ఇసుక వాహనాల రాకపోకలకు చేపట్టిన తవ్వకాలతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కరకట్ట బలహీనంగా మారింది. దీంతో ఓ మోస్తరు వరద ప్రవాహానికే కరకట్టకు పలు ప్రాంతాల్లో గతంలో గండ్లు ఏర్పడి ఉన్నాయి. ఇలాంటి గండ్లకు శాశ్వత మరమ్మతులు చేపట్టకుండా ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో  ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కృష్ణానదికి వరద వస్తుందంటే కరకట్ట సమీప గ్రామాల వద్ద భయం భయంగా ఉండాల్సిందే. కరకట్ట శాశ్వత మరమ్మతుల కోసం పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దనే పెండింగ్‌లో ఉంటున్నాయి తప్ప వాటికి బడ్జెట్‌ని కేటాయించడం లేదు. దీంతో శాశ్వత మరమ్మతులు చేయలేని పరిస్థితి కొనసాగుతున్నది. తాజాగా కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు రూ.2.80 లక్షల క్యూసెక్కుల వరదనీరు విడుదల చేయడంతో అరవింద వారధి వద్ద కరకట్టకు మంగళవారం గండి పడింది. దీంతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2009లో వచ్చిన వరదని తలుచుకుంటే ఇప్పటికీ లంక గ్రామాలు, రేపల్లె పరిసర ప్రాంతాల ప్రజలు వణికిపోతుంటారు. అప్పట్లో తొలుత కొల్లిపర మండలం వద్ద వల్లభాపురం సమీపంలో అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ షట్టర్‌కి లీకు ఏర్పడింది. అప్పట్లో 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు బ్యారేజ్‌ దిగువకు ప్రవహించింది. అతికష్టం మీద వల్లభాపురం అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ షట్టర్‌ లీకేజీని అరికట్టగా రేపల్లెకు సమీపంలోని ఓలేరు వద్ద కరకట్టకు గండి పడింది. దాంతో సమీపంలోని గ్రామాలతో పాటు రేపల్లె పట్టణం మూడు, నాలుగు రోజుల పాటు జలమయమైంది. వరద తగ్గిన తర్వాత కరకట్టకు పడిన గండిని పూడ్చారు. ఆ సమయంలో ఏమ్రాతం ఏమరపాటుగా వ్యవహరించినా ప్రజల నిండు ప్రాణాలు జలసమాధి అయ్యేవే. అదే సందర్భంలో అరవింద వారధి వద్ద కరకట్ట కొట్టుకుపోయింది. అయితే ఇక్కడ తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేశారు. 2019, 2020లోనూ భారీగానే వరదనీరు దిగువకు విడుదల చేశారు. ఎప్పటిలానే ప్రస్తుతం కూడా అరవింద వారధి వద్ద సమస్యలు ఉత్పన్నం కాగా కరకట్టకు తాత్కాలికంగా మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించారు. ఇక్కడ శాశ్వత మరమ్మతులు చేయడానికి రూ.8.20 కోట్ల నిధులు అవసరమౌతాయని కృష్ణానది సంరక్షక విభాగం అఽధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఇంత వరకు ప్రభుత్వం నుంచి అతీగతి లేదు. ప్రస్తుతం 2.80 లక్షల అవుట్‌ఫ్లోకే అరవింద వారధి వద్ద మళ్లీ సమస్య ఉత్పన్నమైంది. వరద తగ్గిన తర్వాత తాత్కాలిక మరమ్మతులు చేపడతామని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా ఎన్నాళ్లు వరద వచ్చిన ప్రతీసారి బిక్కుబిక్కుమంటూ గడపాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-08-04T05:58:17+05:30 IST