డేంజర్‌ జోన్‌గా వన్‌టౌన్‌

ABN , First Publish Date - 2021-04-21T06:12:17+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపధ్యంలో వన్‌టౌన్‌ డేంజర్‌ జోన్‌గా మారింది. దీంతో స్ధానికులు ఆందోళన చెందుతున్నారు.

డేంజర్‌ జోన్‌గా వన్‌టౌన్‌

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 20 : కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపధ్యంలో వన్‌టౌన్‌ డేంజర్‌ జోన్‌గా మారింది. దీంతో స్ధానికులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపార సంస్థల కేంద్రమైన వన్‌టౌన్‌కు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో అన్ని దుకాణాల వద్ద జనాలు రద్దీగా ఉంటున్నారు. కరోనా నిబంధనలు గాలికి వదిలేశారు. రోడ్లుపై జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. రంజాన్‌ పండుగ పురస్కరించుకుని నగర పోలీసు శాఖ, నగర పాలక సంస్థల అధికారులు అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లకు ఓ గల్లీ నాయకుడికి అడ్డగోలుగా పంజా సెంటర్‌ వద్ద హలీం సెంటర్లకు అనుమతి ఇచ్చారు. సాయంత్రానికి స్థానికులతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు ఆ హలీం సెంటర్లు వద్దకు చేరుకుంటున్నారు. వన్‌టౌన్‌లోని ఒకే ప్రాంతంలో 45 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి అంటే వన్‌టౌన్‌లో కరోనా ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. కరోనా కట్టడిలో భాగంగా విజయవాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పిలుపు మేరకు ఈ నెల 19 నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల వరకే వ్యాపారాలు నిర్వహించాలని సూచించినా వ్యాపారస్తులందరు విజయవాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పిలుపును తుంగలో తొక్కి రాత్రి 9.30 గంటల వరకు వ్యాపారాలు జోరుగా నిర్వహిస్తున్నారు. వన్‌టౌన్‌ సమ్మెట వారి వీధిలో రెండు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో కరోనాకు నలుగురు చనిపోవడంతో ఆ ప్రాంతంలో స్థానికులు భయభ్రాంతులు చెందుతున్నారు. అధికార పార్టీలోని ఓ ముఖ్య నాయకుడు సూచనల మేరకు వన్‌టౌన్‌లో వ్యాపారాలు యథావిధిగా కొనసాగుతున్నాయని పలువురు స్థానికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. 


Updated Date - 2021-04-21T06:12:17+05:30 IST