శివారు భూములకు.. వంశ‘దారేదీ’?

ABN , First Publish Date - 2020-08-10T10:34:23+05:30 IST

జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు.. ‘వంశధార’ నుంచి శివారు భూములకు నీరందడం లేదు. ఎక్కడికక్కడ వంశధార కాలువల్లో పూడికలు పేరుకుపోయాయి.

శివారు భూములకు.. వంశ‘దారేదీ’?

 కాలువల్లో పేరుకుపోతున్న పూడికలు

సాగునీరందక అన్నదాతకు ఇక్కట్లు 


(పలాస): జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు.. ‘వంశధార’ నుంచి శివారు భూములకు నీరందడం లేదు. ఎక్కడికక్కడ వంశధార కాలువల్లో పూడికలు పేరుకుపోయాయి. మరికొన్ని చోట్ల షట్టర్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు.  ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమై.. అదను దాటిపోతున్నా, కొన్ని ప్రాంతాల్లో ఉబాలు పూర్తికాలేదు. మరోవైపు వర్షాలు కూడా ఆశించినస్థాయిలో కురవడం లేదు. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ సాగుపై అన్నదాతలు ఆందోళన  చెందుతున్నారు. అధికారులు స్పందించి శివారు భూములకు సాగునీరందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 


 వంశధార కాలువలో 15 ఏళ్లుగా పూడికలు తీయకపోవడంతో వచ్చిన నీరు వెనక్కి మళ్లిపోతోంది. శివారు భూములకు నీరందే పరిస్థితి  లేదు. పాలకుల నిర్లక్ష్యానికి వంశధార ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు సంబంధించి వంశధార కాలువ కింద 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది.  గొట్టాబ్యారేజి వద్ద పూర్తిస్థాయి సామర్థ్యంలో నీరు విడిచిపెడితే వజ్రపుకొత్తూరు మండలంలోని శివారు భూములకు సాగునీరు అందుతుంది. లేకుంటే ఆ నీరు వెనక్కి పోతుంది. ఏటా  రైతులు ఆందోళన చెందుతున్నా వంశధార అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులు  వర్షాధారంపైనే ఆధారపడి పంటలు పండించాల్సి వస్తోంది. 


పలాస నియోజకవర్గంలో వంశధార కాలువ ప్రారంభమై.. పలాస మండలం టెక్కలిపట్నం మీదుగా సుమారు 11 కిలోమీటర్లు పయనించి వజ్రపుకొత్తూరు మండలం వరకు  పిల్లకాలువల ద్వారా నీరు  చేరుతుంది.  మూడేళ్ల కిందట లైనింగ్‌, సిల్ట్‌ తీయడానికి రూ.50 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసినా కార్యరూపం దాల్చలేదు. తాజాగా వంశధార కాలువ పలాస మీదుగా అధికారులు లైనింగ్‌ చేశారు. అయితే.. పూడిక తీయకపోవడంతో పరిస్థితి మళ్లీ యథాస్థితికి చేరుకుంది. కాలువ మొత్తం చెత్తాచెదారాలతో కనిపిస్తోంది. 60టి వద్ద కాలువ మధ్యలో మదుం పూడుకుపోవడంతో నీరంతా వెనక్కి వెళ్లిపోతోంది. పలాసకు సమీపంలో దేశబట్టి ఛానెల్‌ వంశధారలో కలియడం వల్ల కొంతవరకూ నీరు అందుతోంది. అయితే... కాలువలో పూడిక కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో లైనింగ్‌ చేసినా, ఇటీవల మళ్లీ పూడికలు పేరుకుపోయాయి.


కాలువను లైనింగ్‌ చేయడం కంటే పూడికలు తీసి కాలువ లోతు చేస్తే నీరు ప్రవహించే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. వంశధార కాలువ కింద పలాస మండలం, మున్సిపాలిటి, వజ్రపుకొత్తూరు మండలాల్లో మొత్తం 12 వరకు చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లోనూ పూడిక పెరగడంతో వచ్చిన నీరు నిల్వ ఉండకుండా బెండిగెడ్డలో కలసి పోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై  స్థానిక మంత్రి డాక్టర్‌ అప్పలరాజు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.  

Updated Date - 2020-08-10T10:34:23+05:30 IST