వానొచ్చెనంటే వరదొస్తది!

ABN , First Publish Date - 2021-06-13T05:38:18+05:30 IST

వర్షాకాలం వచ్చిందంటే ఆ కాలనీవాసుల్లో గుబులు పుట్టుకుంటుంది. పట్టణం మధ్యలో ఉన్నా చిన్న వర్షానికే వరదలు పారుతుండటంతో ఇక్కట్లు తప్పడంలేదు. నర్సాపూర్‌ పట్టణంలోని 9వ వార్డు పరిధిలోని విజ్ఞేశ్వర కాలనీవాసులకు వర్షం పడిందంటే తిప్పలుతప్పవు. బస్టాండు సమీపంలో ఉన్న ఈ కాలనీకి అధికారులు,

వానొచ్చెనంటే వరదొస్తది!
విజ్ఞేశ్వర కాలనీలో వరద ప్రవాహం (ఫైల్‌)

ముంపు ముప్పులో కాలనీ.. చిన్న వర్షానికే తిప్పలు

నర్సాపూర్‌, జూన్‌ 12: వర్షాకాలం వచ్చిందంటే ఆ కాలనీవాసుల్లో గుబులు పుట్టుకుంటుంది. పట్టణం మధ్యలో ఉన్నా చిన్న వర్షానికే వరదలు పారుతుండటంతో ఇక్కట్లు తప్పడంలేదు. నర్సాపూర్‌ పట్టణంలోని 9వ వార్డు పరిధిలోని విజ్ఞేశ్వర కాలనీవాసులకు వర్షం పడిందంటే తిప్పలుతప్పవు. బస్టాండు సమీపంలో ఉన్న ఈ కాలనీకి అధికారులు, ప్రజాప్రతినిధుల అనాలోచిత నిర్ణయంతో ముంపు ప్రమాదం ఏర్పడింది. బస్టాండు సమీపంలో ఉన్న కుంటను ముందస్తు ప్రణాళికలు లేకుండా అనాలోచితంగా పూడ్చివేయడంతో ఈ కాలనీకి ముంపు ముప్పు ఏర్పడింది. ఏడాది క్రితం పట్టణ ప్రగతిలో భాగంగా బస్టాండు సమీపంలోని కుంటను పూడ్చివేశారు. ఈ కుంటలోకి వచ్చే మురుగు, వరద నీరు బయటకు వెళ్లేందుకు  ప్రత్యేకంగా కాలువలు ఏర్పాటు చేస్తామని కాలనీవాసులకు అప్పట్లో  ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు. కుంట పూడ్చిన తరువాత హమీని మరిచిపోవడంతో వర్షం చాలు నీరంతా కాలనీలోని ఇళ్ల మధ్య నుంచే ప్రవహిస్తున్నది. ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం రావడంతో మరోసారి ముంపు తప్పేలా లేదని వారు వాపోతున్నారు. దీనిపై వార్డు కౌన్సిలర్‌ సునీతాబాల్‌రెడ్డి స్పందిస్తూ కొన్ని కారణాలతో కాలువలను ఏర్పాటుచేసేపని ఆలస్యమైందని, వాసులు ఇబ్బంది పడకుండా త్వరలోనే పైపులైన్‌ పనులు చేపడుతామని పేర్కొన్నారు. ఇందుకోసం నిధలు మంజూరయ్యాయని, సాంకేతికపరమైన పనులు పూర్తికాగానే ఎమ్మెల్యేచే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

Updated Date - 2021-06-13T05:38:18+05:30 IST