వానొచ్చే.. నీళ్లొచ్చే!

ABN , First Publish Date - 2022-08-08T05:02:01+05:30 IST

భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా పాతాళ గంగ పైకి చేరింది. ఇటీవల కాలంలో కురుస్తున్న కుండపోత వానలతోపాటు రిజర్వాయర్లలో దుంకుతున్న గోదావరి నీళ్ల ఫలితంగా తాజా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే 3 మీటర్ల మేరకు భూఉపరితల జలాల శాతం పెరగడం విశేషం.

వానొచ్చే.. నీళ్లొచ్చే!
సిద్దిపేట శివారులోని ఓ వ్యవసాయ బావిలో పైకి చేరిన భూగర్భజలాలు

పైకెగిసిన పాతాళ జలాలు

భూగర్భంలో సమృద్ధిగా నీళ్ల శాతం

జిల్లాలో సగటున 7.38 మీటర్ల అడుగున జలం 

ఓ వైపు వానలు.. మరోవైపు రిజర్వాయర్ల ఫలితం

రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఆగస్టు 7 : భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా పాతాళ గంగ పైకి చేరింది. ఇటీవల కాలంలో కురుస్తున్న కుండపోత వానలతోపాటు రిజర్వాయర్లలో దుంకుతున్న గోదావరి నీళ్ల ఫలితంగా తాజా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే 3 మీటర్ల మేరకు భూఉపరితల జలాల శాతం పెరగడం విశేషం. 

ఒకనాడు కరువుకాటకాలతో కటకటలాడిన సిద్దిపేట జిల్లా ప్రస్తుతం ఓ వాటర్‌ హబ్‌గా మారుతోంది. దప్పిక తీర్చడానికే నీళ్ల కొరత ఉన్న పరిస్థితుల నుంచి రెండు సీజన్లకు సాగునీరు అందించే స్థితిలో జలసిరులు కనువిందు చేస్తున్నాయి. దీనికి తోడు గడిచిన నెలరోజులుగా ఆశించిన వర్షాలు ఉండడం కూడా లాభిస్తోంది. 


అడుగు లోతులోనే గలగలలు

వర్గల్‌ మండలం మాజీద్‌పల్లి గ్రామంలో 0.16 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నట్లు ఆ శాఖ రూపొందించిన నివేదికలో నమోదు చేశారు. అదే విధంగా బెజ్జంకి మండలం దాచారంలో 0.96 మీటర్లు, మద్దూరు మండలం బెక్కల్‌ 0.51, కొమురవెల్లి మండలం గురువన్నపేటలో 1.38, జగదేవపూర్‌ మండలం తీగుల్‌ నర్సాపూర్‌లో 1.02 మీటరు లోతున నీళ్లున్నాయి. ఇక అత్యధికంగా ములుగు మండల కేంద్రంలో 35.52 మీటర్లు,  సిద్దిపేట రూరల్‌ మండలం రాఘవాపూర్‌లో 14.52, దౌల్తాబాద్‌ మండలం ముబారస్‌పూర్‌లో 18.82, దొమ్మాటలో 16.02, దుబ్బాక మండలం గంబీర్‌పూర్‌లో 19.38 మీటర్ల అడుగున నీళ్లు ఉన్నట్లు గణాంకాల్లో పొందుపరిచారు. 


నెల వ్యవధిలోనే అనూహ్యంగా..

జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాల శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన మే నెలలో 11.36 మీటర్ల లోతున నీళ్లుండగా, జూన్‌లో 10.36 మీటర్ల అడుగు భాగాన ఉన్నాయి. ఇక జూలై నెలాఖరు వరకు 7.38 మీటర్లకు పెరిగాయి. ఈ లెక్కన ఒకే నెలలో 3 మీటర్లు పాతాళ జలాలుపైకి రావడం రికార్డుగా చెబుతున్నారు.  ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆగస్టు నెలాఖరు వరకు జిల్లావ్యాప్తంగా ఐదు మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇదే జరిగితే బావులు, బోర్లలో వచ్చే వేసవి సీజన్‌ వరకు పుష్కలంగా నీళ్లుండే అవకాశం ఉంటుంది. 


రికార్డు స్థాయిలో వర్షపాతం

జిల్లాలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదవుతున్నది. గడిచిన 15 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా వర్షాలు కురుస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్‌లో జిల్లా సగటున జూన్‌ నెలకు సంబంధించి 106 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 125సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. ఇక జూలై నెలలో 210 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి భిన్నంగా రికార్డుస్థాయిలో 469 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెల తొలి వారంలోనే 85.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ప్రస్తుతం జిల్లాలోని 24 మండలాల్లోనూ అధిక వర్షపాతమే కురిసింది. మొత్తంగా ఈ సీజన్‌లో జిల్లా అంతటా కలిపి 8520.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. 


రిజర్వాయర్లకు జలకళ

మిడ్‌ మానేరు నుంచి గోదావరి జలాల ఎత్తిపోత ప్రారంభం కావడంతో జిల్లాలోని రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. జిల్లా సరిహద్దులో ఉన్న 3.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన అన్నపూర్ణ రిజర్వాయర్‌, సిద్దిపేట పట్టణ శివారులోని 3 టీఎంసీల సామర్థ్యం గల రంగనాయకసాగర్‌, తొగుట మండలంలోని 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీకొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌, మర్కుక్‌ మండల కేంద్రంలోని 15 టీఎంసీల కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోత జోరుగా నడుస్తోంది. ఈ రిజర్వాయర్ల పరిమితి మేరకు నీటి నిల్వ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ లెక్కన 40 టీఎంసీల పైచిలుకు నీటిని ఈ సీజన్‌లో నింపుతారు. రిజర్వాయర్లలో నీటి నిల్వ ఫలితంగా ఆయా ప్రాంతాల భూగర్భజలాలు వృద్ధి చెందే అవకాశం ఉంటుందని సాగునీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-08-08T05:02:01+05:30 IST