వన్నెల సంతకం

ABN , First Publish Date - 2022-07-29T05:53:16+05:30 IST

నిన్ను కన్న హన్మాజిపేట హఠం చేస్తుంది నువ్వే కావాలని ముచ్చట్లు మురిపాలతో నిన్ను...

వన్నెల సంతకం

నిన్ను కన్న హన్మాజిపేట

హఠం చేస్తుంది నువ్వే కావాలని

ముచ్చట్లు మురిపాలతో నిన్ను అలరించిన

మూలవాగు మూగ పోయింది నీ యాదిలో

తొలి పాఠాలు నేర్పిన

సిరిసిల్ల చిన్నబోయింది నీవు లేవని

భుజాన మోసిన

మానేరు కన్నీళ్లు పెట్టుకుంది నీవు రావని

సినారె! సినారె!

నిరంతర కవితా ప్రవాహ కినారే!!

నీ అక్షరం కస్తూరి

నీ మాటాపాట అసామాన్య దస్తూరి

‘నవ్వని పువ్వు’ నవ్వే సరికి

నీవు కనిపించక తల్లడిల్లి

తన్నుతాను నీకు సమర్పించుకుంటున్నది

నిన్ను నిలువెల్లా స్మరించుకుంటున్నది

సెలయేరు నడకకు నగిషీలు చెక్కినవాడు

నది ఆయనకు సహధ్యాయి

కదలాడే అలల కుచ్చిల్లను

సముద్రానికి సమకూర్చినవాడు

చీకటికి ప్రియంగా వెన్నెలను అద్దినవాడు

పగటికి రాత్రి ఒకటి వుందని

హెచ్చరించినవాడు

మల్లెల చెవిలో చిలిపి గుసగుసలాడినవాడు

శిశిరానికి బహుమతిగా

పచ్చదనాన్ని ప్రదానం చేసినవాడు

నీతో కవులది

ఒక్కొక్కరిది ఒక్కో అనుభవం

నీవు పాటలతో

ఆటలాడుకున్న తీరు అసంభవం

తెలుగు కవిత్వంలో

నీది ఒక వసంత

వన్నెల సంతకం

జూకంటి జగన్నాథం

Updated Date - 2022-07-29T05:53:16+05:30 IST