Vangaveeti Radhaపై రెక్కీలో వైసీపీ లెక్క తప్పిందా.. అసలేం జరుగుతోంది..!?

ABN , First Publish Date - 2022-01-11T16:42:46+05:30 IST

వైసీపీలో ఇటీవల కాలంలో విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ ప్రాధాన్యత పెరుగుతోంది. ఆయన ప్రాధాన్యత తగ్గించేందుకు పార్టీలో కొంతమంది ఈ ఎత్తుగడలు వేశారని...

Vangaveeti Radhaపై రెక్కీలో వైసీపీ లెక్క తప్పిందా.. అసలేం జరుగుతోంది..!?

అగ్గి రాజేయాలని అనుకున్నారు... కానీ రగులుకోలేదు. ఉన్న పార్టీపై తిరుగుబాటు చేయించాలనుకున్నారు... అదీ సాధ్యపడలేదు. పార్టీలో ఉన్న వారిని తగ్గించాలనుకున్నారు... చివరకు అసలు విషయం తెలుసుకున్నాక, ఆ పన్నాగం కూడా విఫలమైంది. ఆఖరికి మొత్తం వ్యవహారం బూమ్‌రాంగ్‌ అయింది. వైసీపీ ప్రభుత్వానికి మింగుడుపడని అంశంగా మారింది. వంగవీటి రాధా వ్యవహారంలో అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే.. ఏబీఎన్-ఇన్‌సైడ్ స్టోరీలో తెలుసుకుందాం...


రెక్కీ జరిగిందన్న రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం 

దివంగత నేత వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధాను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఆయన తండ్రి వర్ధంతి రోజునే వంగవీటి రాధా.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా తనను హతమార్చేందుకు రెక్కీ జరిగిందని, ఆ వివరాలు త్వరలోనే బయటపెడతానని, తనను పొట్టన పెట్టుకోవాలనుకున్నవారికి ఎవరూ మద్దతు ఇవ్వద్దని కోరారు. అదేరోజు ఉదయం అనూహ్యంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... రాధా ఇంటికి వెళ్లడం, ఆయనతో మంతనాలు జరపడం, ఆ తర్వాత రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మచిలీపట్నం, అటు నుంచి గుడ్లవల్లేరు వెళ్లారు. అక్కడ వీరిరువురికి మంత్రి కొడాలి నాని కూడా జత కలిశారు. వీరంతా ఒకే వేదికపై ఉన్న సమయంలో రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. అయితే ఈ మొత్తం గేమ్‌ ప్లాన్‌ వెనుక ఎవరున్నారనే అంశంపైనే ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. 


వైసీపీలో ఇటీవల కాలంలో విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ ప్రాధాన్యత పెరుగుతోంది. ఆయన ప్రాధాన్యత తగ్గించేందుకు పార్టీలో కొంతమంది ఈ ఎత్తుగడలు వేశారని వైసీపీలోని కొంతమంది నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. మరోవైపు అవినాష్‌ అనుచరుడు అరవ సత్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జరుగుతున్న ప్రచారం ఆ పార్టీకి సెట్‌ బ్యాక్‌గా మారింది. రాధా హత్యకు రెక్కీ చేశారని జరుగుతున్న ప్రచారాన్ని కొడాలి నాని ఆగమేఘాలపై ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి చెప్పడం, ఆయన వెంటనే రాధాకు భద్రత కల్పించాలని ఆదేశించడం, ఆ వెనువెంటనే రెక్కీ ఎవరు చేశారో దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు నానినే బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో వంగవీటి రాధా వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. రాధాను తమ వైపునకు తీసుకుని కాపుల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించేందుకు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. 


రాధాతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు

ఇక వంగవీటి రాధా తనకు భద్రత అవసరం లేదని తెగేసి చెప్పారు. ఆ తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాధాతో ఫోన్‌లో మాట్లాడటం, దర్యాప్తు చేయాలని డీజీపీకి లేఖ రాయడం, అనంతరం చంద్రబాబు వెళ్లి రాధాను పరామర్శించారు. దీంతో వైసీపీ నేతల స్వరం మారిపోయింది. రాధాపై ఎవరూ రెక్కీ చేయలేదని, రాధా రాజకీయాల్లో కనుమరుగైపోయారని మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు అధికార పార్టీలో అనేకమంది నేతలకు నచ్చలేదు. పైగా విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా మీడియా సమావేశంలో రాధాపై రెక్కీకి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని, ఇంకా దర్యాప్తు జరగుతోందని ప్రకటించారు. ఈ రెండు ప్రకటనలతో వైసీపీలోని కాపు నేతలు విభేదించారు. దర్యాప్తు పూర్తవకుండా వెల్లంపల్లి అలా ప్రకటించాల్సిన అవసరం ఏమిటని వైసీపీలోని కొంతమంది కాపు నేతలు ఏకంగా పార్టీ కీలక నేతల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రాధాపై రెక్కీ వ్యవహారం అంతా కూడా వైసీపీకి మైనస్‌గా మారిందని వారు పార్టీ హైకమాండ్‌ వద్ద ఏకరువు పెట్టారని చెబుతున్నారు. 


నిజానికి గుడ్లవల్లేరులో జరిగిన సభలో నాని ఉంటే తాను వేదికను పంచుకోనని రాధా ముందే చెప్పారని ఆయన వర్గీయులు అంటున్నారు. అయినప్పటికీ వంశీ దౌత్యంతో వేదిక పంచుకున్నప్పటికీ ఎడమొహం, పెడమొహంగా ఉన్నారని కూడా పార్టీ నేతలకు సమాచారం అందింది. ఈ మొత్తం వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది? దీని వెనుక ఎవరున్నారు? అనే అంశంపై కూడా వైసీపీ హైకమాండ్‌ ఆరా తీస్తోంది. వైసీపీకి బూమ్‌రాంగ్‌ అయిన ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులపై కూడా పార్టీ హైకమాండ్‌కు నివేదిక అందినట్టు చెబుతున్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ ప్లాన్‌లో భాగంగానే ఈ వ్యవహారం బయటకు వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. 


ప్రభుత్వ వైఖరి పట్ల వంగవీటి రాధా వర్గీయులు తీవ్ర అసంతృప్తి

అధికార పార్టీలోని కొంతమంది కీలక కాపు నేతలు మాత్రం జరుగుతున్న పరిణామాలను ఓసారి ముఖ్యమంత్రితోనే మాట్లాడాలని భావిస్తున్నట్టు తెలిసింది. వివిధ వర్గాల్లో వస్తున్న వ్యతిరేకత, ఇప్పటికే అన్ని వైపుల నుంచి చుట్టుముడుతున్న సమస్యలకు తోడు మరో సమస్యను స్వయంకృతాపరాధంతో కొనితెచ్చుకోవాల్సిన అవసరం ఏమిటని వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు ఆఫ్‌ ది రికార్డుగా ప్రశ్నించారు. రాధా వర్గీయులు మాత్రం రెక్కీపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపకుండా ప్రభుత్వం ఆధారాలు లభించలేదని ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వైఖరి పట్ల వంగవీటి రాధా వర్గీయులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. 

Updated Date - 2022-01-11T16:42:46+05:30 IST