కథ మారిందా.. Vangaveeti Radha వ్యాఖ్యలు దేనికి సంకేతం!?

ABN , First Publish Date - 2021-12-27T06:42:46+05:30 IST

అధికార పార్టీ మంత్రి, అధికార పార్టీకి సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యే సమక్షంలో...

కథ మారిందా.. Vangaveeti Radha వ్యాఖ్యలు దేనికి సంకేతం!?

  • తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న రాధా
  • అదే వేదికపై మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ
  • 2019 ఎన్నికలకు ముందు టీడీపీలోకి రాధా
  • ఆ సమయంలో జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు


అధికార పార్టీ మంత్రి, అధికార పార్టీకి సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యే సమక్షంలో దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని, కొందరు వ్యక్తులు రెక్కీ కూడా నిర్వహించారంటూ రాధా చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆదివారం గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరులో రంగా వర్ధంతి జరిగింది. ఈ  కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. వారి సమక్షంలోనే రాధా సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాధా, నాని, వంశీ ముగ్గురూ మంచి మిత్రులన్న విషయం విదితమే. తొలి రోజుల్లో నాని, వంశీ టీడీపీలో ఉండగా, రాధా కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ తర్వాత రాధా, నాని వైసీపీలో చేరారు. వంశీ టీడీపీలో ఉండిపోయారు. 2019 ఎన్నికలకు ముందు రాధా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆ సమయంలో రాధా వైసీపీపైన.. ఆ పార్టీ అధినేత జగన్‌పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీలో తనకు ఎదురైన అవమానాలు ఇంకెవరికీ ఎదురు కాకూడదని కోరుకుంటున్నానని అప్పట్లో రాధా వ్యాఖ్యానించారు. తన తండ్రి  విగ్రహావిష్కరణకు వెళ్లిన తనను జగన్‌ నిలువరించారని అప్పట్లో ఆయన విమర్శించారు. ‘తండ్రి లేనివాడివని జాలి చూపిస్తూ గుప్పిట్లో పెట్టుకున్నాను. వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావు..’ అంటూ జగన్‌ బెదిరింపు ధోరణితో మాట్లాడిన విషయాన్నీ రాధా ప్రస్తావించారు. అప్పట్లో రాధా వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో కలకలం రేపాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొన్న రాధా ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా రాధా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.


లక్ష్యం ఎవరు..?

రాధా ఎవరిని లక్ష్యంగా చేసుకుని తాజా వ్యాఖ్యలు చేశారనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమక్షంలో రాధా ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయన టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారా? అనే సందేహాన్ని టీడీపీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయమే ఎమ్మెల్యే వంశీ, రాధా కలవడం.. వారిద్దరూ ఏకాంతంగా చర్చించుకోవడం తమ సందేహానికి కారణమని వారు చెబుతున్నారు. రాధాను తిరిగి వైసీపీ గూటికి తీసుకొచ్చేందుకు వంశీ, నాని ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే జగన్‌తో తీవ్రస్థాయిలో విభేదించి, వైసీపీలో తీవ్ర అవమానాలను ఎదుర్కొన్న రాధా, మళ్లీ ఆ పార్టీలో చేరతారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. రాధా వైసీపీలో చేరే ప్రశ్నే లేదని ఆయన అభిమానులు చెబుతున్నా, జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.


నాడు అడుగుడునా అవమానాలు

2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని రాధా భావించారు. కానీ ఆ సీటును రాధాకు కేటాయించడం ససేమిరా కుదరదని అప్పట్లో ఆ పార్టీ అధిష్ఠానం తేల్చి చెప్పింది. ఆ తర్వాత కూడా వైసీపీ అధిష్ఠానం ధోరణి.. ‘ఉంటే ఉండు లేదంటే పో’ అన్నట్టు సాగింది. 2014 ఎన్నికల వరకు వైసీపీ సెంట్రల్‌ ఇన్‌చార్జ్‌గా గౌతంరెడ్డి ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఆయన సెంట్రల్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి, ఓటమి పాలయ్యారు. 2015లో నగర అధ్యక్షుడిగా ఉన్న రాధాను సెంట్రల్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. 2014లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన రాధాను సెంట్రల్‌కు ఇన్‌చార్జ్‌గా నియమించడంతో 2019లో ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయనకు సీటు దక్కలేదు. కాంగ్రెస్‌లో ఉన్న మల్లాది విష్ణు ఆ ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీలో చేరడంతో క్రమంగా సీను మారుతూ వచ్చింది. తొలుత విష్ణును నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు.


నగర స్థాయిలో పదవి ఉన్నప్పటికీ, ఆయన ఎక్కువగా సెంట్రల్‌ నియోజకవర్గంపైనే దృష్టి సారిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. తనతోపాటు కాంగ్రెస్‌ నుంచి వచ్చిన నేతలకు రాష్ట్ర, నగర స్థాయిలో పదవులను ఇప్పించుకోవడంతోపాటు కాంగ్రెస్‌ పార్టీలో డివిజన్‌ అధ్యక్షులుగా పని చేసిన వారికి సెంట్రల్‌ నియోజకవర్గంలోని 20 డివిజన్లలో కో-ఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా తాను సమన్వకర్తగా ఉన్న సెంట్రల్‌లో తన ప్రమేయం లేకుండా కో-ఆర్డినేటర్లను నియమించడంపై రాధా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అధిష్ఠానం పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు పీకే టీమ్‌ సర్వే జరిపి, సెంట్రల్‌ నియోజకవర్గం మల్లాదికే అనుకూలంగా ఉన్నట్టు తేల్చడంతో అధిష్ఠానం పూర్తిగా మల్లాది వైపు మొగ్గుచూపింది. రాధా క్రమంగా వైసీపీకి దూరం అవుతూ, చివరికి ఆ పార్టీని వీడారు. కాగా ఇంత కాలం తరువాత ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలు రాధా భవిష్యత్తు రాజకీయ ప్రయాణంపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. 

Updated Date - 2021-12-27T06:42:46+05:30 IST