వందే గురుపరంపరామ్‌!

ABN , First Publish Date - 2020-03-30T08:46:53+05:30 IST

పవిత్రమైన సనాతన భారతీయ ధర్మాన్ని పరిరక్షించడం కోసం దేశంలోని నాలుగు మూలల్లో, నాలుగు వేదాలకు నాలుగు సింహాసనాలుగా... నాలుగు ఆమ్నాయ పీఠాలను ఆది శంకరాచార్యులు నెలకొల్పారు. నాలుగు పీఠాలకూ నలుగురు సన్న్యాస ...

వందే గురుపరంపరామ్‌!

పవిత్రమైన సనాతన భారతీయ ధర్మాన్ని పరిరక్షించడం కోసం దేశంలోని నాలుగు మూలల్లో, నాలుగు వేదాలకు నాలుగు సింహాసనాలుగా... నాలుగు ఆమ్నాయ పీఠాలను ఆది శంకరాచార్యులు నెలకొల్పారు. నాలుగు పీఠాలకూ నలుగురు సన్న్యాస శిష్యులను నియమించారు. అలా 1200 ఏళ్ళ పైచిలుకు క్రితం నెలకొన్న ఆ నాలుగు పీఠాలలో ప్రసిద్ధమైనది - దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠం. సాక్షాత్తూ ఋష్యశృంగుడు తపస్సు చేసుకొన్న ప్రాంతంలో, తుంగా నదీతీరంలో, ప్రసవవేదన పడుతున్న కప్పకు జాతివైరం మరచి సర్పం పడగ విప్పి గొడుగు పట్టినచోట నెలకొన్న పీఠం అది. ఆది శంకరులు నెలకొల్పిన తొలి పీఠం శృంగేరే! 


నేడు శ్రీభారతీతీర్థ స్వామి సప్తతి సందర్భంగా...

ఆది శంకరులు మొట్టమొదట నియమించిన తన ప్రధాన శిష్యుడు సురేశ్వరాచార్యులు మొదలు ఇప్పటి దాకా అవిచ్ఛిన్నంగా సాగుతున్న గురుపరంపర శృంగేరీ పీఠ భక్తులకు ఓ వరం. వేదాలకు వ్యాఖ్యానం, ఆది శంకరుల భాష్యాలకు వివరణలు అందించడంతో ఈ పీఠం ‘వ్యాఖ్యాన సింహాసనం’గా పేరొందింది. సాక్షాత్‌ శారదాదేవే అక్కడి పీఠాధిపతి రూపంలో కళ్ళ ముందు నడయాడుతుందని భక్తజన విశ్వాసం.


చరిత్రలో శృంగేరీ పీఠం

అద్వైత సిద్ధాంతానికి పట్టుగొమ్మగా దక్షిణ భారతదేశంలోని ఆస్తిక జనులు, అందులోనూ తెలుగువారు అత్యంత పవిత్రభూమిగా ఆరాధించే పీఠం అది. అక్కడి శారదాదేవి ఆలయం సాక్షాత్‌ సరస్వతీ స్వరూపం నెలకొన్న ఆరాధనా స్థలం. విజయనగర సామ్రాజ్య స్థాపనకు మార్గదర్శనం చేసిన శ్రీవిద్యారణ్యులు ఈ శృంగేరీ పీఠానికి 12వ గురువు. హైదర్‌ అలీ, టిప్పు సుల్తాన్‌ లాంటి మైసూరు పాలకులు, హైదరాబాద్‌ నిజామ్‌, పేష్వాలు, కేలడి పాలకులు, ట్రావన్కూర్‌ రాజులు సైతం ఈ పీఠాన్నీ, పీఠాధిపతిని గురువుగా గౌరవించినవారే. 


గురు శుశ్రూషలో...

అలాంటి ఘన సంప్రదాయ చరిత్ర ఉన్న శృంగేరీ శారదా పీఠానికి 36వ ఆచార్యులు, ప్రస్తుత పీఠాధిపతి శ్రీ భారతీతీర్థ మహాస్వామి. ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు ఎందరికో తన సాధనతో, ఉపదేశాలతో మనశ్శాంతిని అందిస్తున్న తపస్వులు. వేదాలు, ధర్మశాస్త్రాలలో అపారమైన పట్టున్న గురువులు. తెలుగువారైన స్వామి మాతృభాషతో పాటు చదువుకున్న సంస్కృతంలోనూ, శ్రీమఠంలో ఉన్నందువల్ల కన్నడంలోనూ పట్టున్న జ్ఞాని. అదే సమయంలో తమిళ, హిందీ భాషల్లో కూడా తాత్త్విక రహస్యాలను వివరించడంలోనూ ఆయనది ఆశ్చర్యపరిచే ప్రతిభ. ధర్మశాస్త్ర నిష్ఠులైన తంగిరాల వెంకటేశ్వర అవధాని, అనంతలక్ష్మమ్మ పుణ్యదంపతులకు 1951 ఏప్రిల్‌ 11న బందరులో జన్మించిన స్వామి పూర్వాశ్రమ నామం తంగిరాల సీతారామాంజనేయులు. స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. తండ్రి దగ్గర వేద, స్మార్తాలు అభ్యసించారు. హైస్కూలు చదువు పూర్తి అవుతూనే, పదిహేనో ఏటే అనంత వైరాగ్యంతో, ఉజ్జయిని వెళ్ళి, అక్కడ చాతుర్మాస్య దీక్షలో ఉన్న అప్పటి శృంగేరీ పీఠాధిపతి అభినవ విద్యాతీర్థులకు శిష్యులయ్యారు. ఎనిమిదేళ్ళు బ్రహ్మచారిగా, ఆ పైన పదిహేనేళ్ళు అంతేవాసి అయిన సన్న్యాసిగా వారి శిష్యరికంలో శాస్త్ర, వేదాంత అధ్యయనంలో, తపోనుష్ఠానాలలో, మఠనిర్వహణలో సుశిక్షితులయ్యారు. 


నమామి భగవత్పాదమ్‌...

ఉత్తరాన జమ్ము మొదలు దక్షిణాన నాగర్‌ కోయిల్‌ దాకా దాదాపు నూటయాభైకి పైగా దేశవ్యాప్త మఠశాఖలు, అమెరికా, కెనడా లాంటి చోట్ల విదేశీ శాఖలు, వందలాది ఉద్యోగులు, లక్షలాది భక్తులు శృంగేరీ శారదా పీఠానికి ఉన్నాయి. వారందరినీ ఏకతాటిపై ధర్మ చింతన మార్గంలో నడుపుతున్నారు భారతీతీర్థులు. సోమవారం ఆయన 70వ వర్ధంతి (సన్న్యసించిన సాధుపురుషుల పుట్టినరోజును ‘వర్ధంతి’ అని పేర్కొనడం సంప్రదాయం). సప్తతి వత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా శృంగేరిలో లోకకల్యాణం కోసం వారం రోజుల పైగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పరమాత్మను అంతర్‌ దృష్టితో కనుగొనాలి. బహిరింద్రియాలతో అది సాధ్యం కాదు. అంతః శుద్ధి లేని జ్ఞానం... అసలు జ్ఞానమే కాదు. ఇంద్రియాలతో, మనస్సుతో తెలుసుకొనలేనిది ఒకటి ఉన్నదని గ్రహించడమే గొప్ప వివేకం. ఇదే సర్వ మతాలకూ సారభూతమైన విషయం. ఈశ్వరుడు విశ్వరూపుడు, విశ్వవ్యాపి, గుణాతీతుడు, త్రికాలాతీతుడు అని శ్రీభారతీతీర్థ స్వామి చెబుతుంటారు. ఈ సమయంలో దాన్ని మరింత లోతుగా అర్థం చేసుకొందాం. ఇప్పుడు ప్రపంచంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో... దేహమనే దేవాలయంలో ఆత్మ అనే దేవుణ్ణి చూస్తూ, లోపలకు ప్రయాణిస్తూ, ధ్యానం చేద్దాం. ప్రపంచమంతా ఒకటే కుటుంబమనే ‘వసుధైవ కుటుంబక’ భావనతో కష్టాలలో ఉన్న సాటివారికి సాయపడదాం. విశ్వవ్యాపి అయిన ఆ ఈశ్వరుడిని సాటి మనిషిలో చూసి, సేవ చేయడాన్ని మించిన ఆరాధన ఏముంటుంది! శృంగేరీ శారదాపీఠాధిపతులు శ్రీభారతీతీర్థ స్వామికి ఈ వర్ధంతి వేళ ఇవ్వగలిగిన సుహృత్పూర్వక సవినయ నివేదన ఇదే!!

-రెంటాల


Updated Date - 2020-03-30T08:46:53+05:30 IST