Vande Bharat: ఐసీఎఫ్‏లో ‘వందే భారత్‌’ రైలు తయారీ

ABN , First Publish Date - 2022-08-13T13:18:22+05:30 IST

స్థానిక పెరంబూర్‌లోని ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో అత్యాధునిక వసతులతో ఒక్కొక్క ‘వందే భారత్‌’ రైలు రూ.110 కోట్లతో రూపుదిద్దుకుంటోందని

Vande Bharat: ఐసీఎఫ్‏లో ‘వందే భారత్‌’ రైలు తయారీ

                  - పరిశీలించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 12: స్థానిక పెరంబూర్‌లోని ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో అత్యాధునిక వసతులతో ఒక్కొక్క ‘వందే భారత్‌’ రైలు రూ.110 కోట్లతో రూపుదిద్దుకుంటోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌(Union Railway Minister Ashwin Vaishnav) పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఐసీఎఫ్‏లోని బోగీల తయారీ కర్మాగారాన్ని పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 102 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు ఐసీఎ్‌ఫలో తయారవుతున్నాయి. గంటకు 180 కి.మీ వేగంతో వెళ్లే ఈ రైల్లో 1,000 మంది ప్రయాణించవచ్చు. ట్రయల్‌ రన్‌ అనంతరం మొట్టమొదటి వందే భారత్‌ రైలు నెలాఖరు నాటికి రైల్వే బోర్డుకు అప్పగించేందుకు ఐసీఎఫ్‌ సన్నాహాలు చేపట్టింది. మెరుగైన వసతులతో కూడిన వందే భారత్‌ తొలి రైలును శుక్రవారం రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ పరిశీలించారు. రైలు బోగీల్లో కల్పించిన ఆధునిక అంశాలు, వసతులను అధికారుల వద్ద అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ సూచనల మేరకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సేవలందించేలా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడపనున్నామని ప్రకటించారు. దక్షిణ రైల్వే(Southern Railway) అధికారులు ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో మిగతా జోన్ల కంటే ముందున్నారని ప్రశంసించారు. ఐసీఎఫ్‏లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తయారుచేయడం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. ఐసీఎఫ్‌ కర్మాగారంలో ప్రయాణికులకు ఆధునిక వసతులతో బోగీలు తయారుచేస్తున్నారని ఉద్యోగులను మంత్రి అభినందించారు. మంత్రితో పాటు దక్షిణ రైల్వే జనరల్‌ మేనేజర్‌ బీజీ మాల్యా, ఐసీఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏకే అగర్వాల్‌, ఐసీఎఫ్‌ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ ఎస్‌. శ్రీనివాస్‌ తదితర అధికారులు కూడా రైల్వేమంత్రి వెంట వున్నారు. 

Updated Date - 2022-08-13T13:18:22+05:30 IST