పర్యాటకంతో ప్రయోగాలు చేస్తోంది!

ABN , First Publish Date - 2020-03-08T05:54:11+05:30 IST

ఇంప్యాక్ట్‌ బేస్డ్‌ టూరిజం చేపట్టి పర్యాటక రంగంలో కొత్త ఒరవడితో ముందుకు సాగుతున్నారు వందనా విజయ్‌. విద్యుత్‌, నీటి సమస్య ఉన్న లదాఖ్‌లో విద్యుద్దీకరణ చేపట్టారు. నీటి సమస్యను పరిష్కరిస్తున్నారు. ఎకో

పర్యాటకంతో ప్రయోగాలు చేస్తోంది!

ఇంప్యాక్ట్‌ బేస్డ్‌ టూరిజం చేపట్టి పర్యాటక రంగంలో కొత్త ఒరవడితో ముందుకు సాగుతున్నారు వందనా విజయ్‌. విద్యుత్‌, నీటి సమస్య ఉన్న లదాఖ్‌లో విద్యుద్దీకరణ చేపట్టారు. నీటి సమస్యను పరిష్కరిస్తున్నారు. ఎకో-టూరిజం, దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తూ, పురుషులకు దీటుగా నిలుస్తున్నారు.


 ‘‘మా నాన్న సైన్యంలో ఉండడంతో విధుల్లో భాగంగా మేము దేశం మొత్తం చుట్టాం. మా మూలాలు మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. నా స్కూలింగ్‌ ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము-కాశ్మీర్‌లో సాగింది. బిఎ, ఎంఎస్‌సి మైక్రోబయోలజీ ఉస్మానియా యూనివర్సిటీలో చేశా. మా ఇంట్లోని ఆర్మీ వాతావరణం వల్ల చిన్నతనం నుంచీ డిఫెన్స్‌ సర్వీసెస్‌ చేరాలని కలలు కన్నా.  2009లో యుపిఎస్‌సి కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ప్రవేశపరీక్ష  రాసి ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించా. కానీ చివరకు అందులో చేరలేకపోయా. 2014లో ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి లదాఖ్‌ వెళ్లా. అక్కడి స్థానిక ప్రజల నిత్య జీవితం ఎంత కష్టంగా ఉంటుందో గమనించా. వారి గ్రామాలలో కరెంటు లేదు. నీటి సమస్య ఉంది. అంతేకాదు అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లేవు. ఏడాదిలో సగం రోజులు గడ్డకట్టుకుపోయే వాతావరణం వాళ్లది! వారి సమస్యలు నాలో ఆలోచన రేపాయి. హిమాలయాల మీద బాల్యం నుంచీ నాకున్న ఇష్టం, అలాగే నాలోని సాహస స్వభావం కూడా నన్ను టూరిజం వైపు  మళ్లేలా చేశాయి. టూరిజం ద్వారా దేశంలోని ఇలాంటి ఎన్నో ప్రాంతాలను అభివృద్ధి చేయొచ్చనిపించింది. అందుకే ‘ఇంప్యాక్ట్‌ బేస్డ్‌ టూరిజా’న్ని చేపట్టాలనుకున్నా. అలా ‘ఆఫ్‌-బీట్‌ ట్రాక్స్‌’  ట్రావెల్‌ స్టార్టప్‌ని 2016లో ప్రారంభించా. దీనికి నిధులను స్వయంగానే సమకూర్చుకున్నా. 


ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊపునిస్తున్నది టూరిజమే. మా  కంపెనీ ‘ఆఫ్‌-బీట్‌ ట్రాక్స్‌’ పర్యటనలమీద, సుస్థిరమైన ప్రాజక్టుల మీదా దృష్టిసారించాం. ప్రత్యేకించి సరికొత్త, ఎవరికీ తెలియని డెస్టినేషన్స్‌పై పనిచేస్తున్నాం. మా సంస్థ ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా ఎక్స్‌పీరియన్షియల్‌ ట్రావెల్‌ స్టార్టప్‌. హిమాలయ ప్రాంతాలలో, ఈశాన్య రాష్ట్రాలలో మేము గుర్తించిన సమస్యలపై సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెడుతున్నాం.  కాలిఫోర్నియా నుంచి వచ్చిన 14 మందితో, లదాక్‌లోని  షామ్‌ ప్రాంతంలో  తక్మాచిక్‌ గ్రామంలో సోలార్‌ ఎలక్ట్రిఫికేషన్‌ ప్రాజెక్టు చేపట్టారు. ఈ స్ఫూర్తిని రేకెత్తించే  సస్టైనబుల్‌ ట్రావల్‌ని దేశమంతా వ్యాప్తిచేయాలన్నదే మా కోరిక. భారతదేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలతో మమేకమై అభివృద్ధి పరంగా మూలాల నుంచీ మార్పు తేవాలని అనుకుంటున్నాం.’’

Updated Date - 2020-03-08T05:54:11+05:30 IST