దాగుడుమూతలు...?

ABN , First Publish Date - 2020-07-03T11:16:39+05:30 IST

కరోనా కేసులకు సంబంధించి వనపర్తి జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేస్తున్న హెల్త్‌ బులిటెన్‌ ప్రజలను గందరగోళానికి గురి చేస్తోంది.

దాగుడుమూతలు...?

స్టేట్‌ కరోనా హెల్త్‌ బులిటెన్‌లో కనిపించని వనపర్తి కేసులు

జిల్లా బులిటెన్‌లోనూ లోకల్‌ పాజిటివ్‌గా చూపించని వైనం

ఇటీవల కరోనా సోకిన వారికి ఎలా వచ్చిందో తెలియని స్థితి

ఉమ్మడి జిల్లాలో కొత్తగా పది పాజిటివ్‌ కేసులు నమోదు


ఆంధ్రజ్యోతి, వనపర్తి : కరోనా కేసులకు సంబంధించి వనపర్తి జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేస్తున్న హెల్త్‌ బులిటెన్‌ ప్రజలను గందరగోళానికి గురి చేస్తోంది. కొన్ని కేసులను ప్రకటించకపోవడం, కొన్ని కేసులు ఎక్కడ నమోదయ్యాయో చూపకపోవడం ఆందోళన కల్గిస్తోంది. జిల్లాలో ఈ నెల 28వ తేదీ వరకు ఒక పాజిటివ్‌ కేసు మాత్రమే నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు. కానీ మంగళవారం రెండు కేసులు నమోదు అయినట్లు బులిటెన్‌లో పేర్కొన్న అధికారులు, మొత్తం కేసుల సంఖ్యను 16గా చూపించారు. మిగతా కేసులు ఎప్పుడు, ఎక్కడ నమోదయ్యాయో పేర్కొనలేదు. జిల్లాలోని అమరచింత, మదనాపూర్‌, కొత్తకోటలలో బుధవారం ఒక్కో కేసు నమోదయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19కి చేరాలి. కానీ బులిటెన్‌లో మాత్రం 20 కేసులున్నట్లు పేర్కొన్నారు. అదనంగా నమోదైన కేసు ఎక్కడ నమోదు అయ్యిందో తెల్పలేదు. అయితే రెండు రోజులుగా జిల్లా బులిటెన్‌లో కేసుల వివరాలు పేర్కొంటుండగా, స్టేట్‌ బులిటెన్‌లో మాత్రం చూపించడం లేదు. బులిటెన్‌ విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ప్రజలకు ఎన్ని కేసులు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. 


రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

లాక్‌డౌన్‌ సమయంలో ఒక్క కేసు కూడా నమోదు కాని వనపర్తి జిల్లాలో, సడలింపుల తర్వాత మెల్లమెల్లగా కేసుల సంఖ్య పెరుగుతోంది. జనాల్లో కూడా రోజురోజుకూ భయాందోళనలు పెరుగుతున్నాయి. అయినా ప్రజలు నిర్లక్ష్యం మాత్రం వీడటం లేదు. కనీసం ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాల వద్ద కూడా నిబంధనలను పాటించడం లేదు. ఇప్పటివరకు గోపాల్‌పేట, రేవల్లి, ఖిల్లాఘణపురం, పాన్‌గల్‌, ఆత్మకూరు, అమరచింత, మదనాపూర్‌, పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి మండలాల్లో 21 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి లేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, చాలా మందిలో ఆ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వనపర్తిలో ఇద్దరు మహిళలకు పాజిటివ్‌ అని తేల్చగా, వారిద్దరికీ కరోనా ఎలా సోకిందనే విషయం అంతుపట్టడం లేదని సమాచారం. ఎక్కువగా హైదరాబాద్‌కు వెళ్లి వచ్చిన వారికి, వారి ద్వారా వేరే వారికి కరోనా సోకుతోంది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప హైదరాబాద్‌కు వెళ్లొద్దని ఎంత చెప్తున్నా, పలువురు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు.


పెరుగుతున్న కేసుల సంఖ్య

మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం) నాగర్‌కర్నూల్‌ (ఆంధ్రజ్యోతి)/ అడ్డాకుల/మూసాపేట/గద్వాల క్రైం/ ఎర్రవల్లి చౌరస్తా : ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో గురువారం ఒకే రోజే ఐదు కేసులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మూడు, గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో ఒకటి, నారాయణపేట జిల్లా కోస్గీలో ఒక కేసు నమోదయ్యాయి. 

  • జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. ఈయన ఆంధ్రబ్యాంకు మెయిన్‌ బ్రాంచిలో పని చేస్తున్నాడు. 
  • క్రిస్టియన్‌ కాలనీకి చెందిన ఓ మహిళ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేస్తోంది. ఆమెకు కూడా పాజిటివ్‌ వచ్చింది. 
  • డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో కొవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఓ అధికారి భార్యకు కరోనా నిర్ధారణ అయ్యింది. 
  • మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల సబ్‌సెంటర్లో పని చేస్తున్న ఏఎన్‌ఎంకు కరోనా సోకింది. ఆమెను జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్‌కు తరలించారు. 
  • మూసాపేటకు చెందిన ఓ జర్నలిస్టుకు పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి శ్వేతరెడ్డి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లు ఉండాలని అధికారులు సూచించారు.
  • నారాయణపేట జిల్లా కోస్గి మండలానికి చెందిన ఓ హోం గార్డుకు కరోనా సోకింది. అతడి కాటాక్ట్‌లను గుర్తించి హోంక్వారంటైన్‌ హెల్త్‌ సూపర్‌వైజర్‌ రాంచందర్‌ తెలిపారు.
  • ఇటిక్యాల మండలం తిమ్మాపుర్‌ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల బాలికల కరోనా బారిన పడింది. ఈ అమ్మాయి కొంత కాలంగా అస్తమాతో బాధ పడుతోంది. జిల్లా వైద్యాధికారి భీమానాయక్‌ సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబసభ్యులను హోంక్వారంటైన్‌లో ఉంచారు.
  • నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్‌ నర్సుకు కరోనా పాజిటివ్‌ రిపోర్టు వచ్చిందని జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్‌ తెలిపారు. బల్మూరు మండలం కొండనాగులకు చెందిన కారు డ్రైవర్‌, బిజినేపల్లి మండలం పాలెంకు చెందిన ఒక మహిళకు కూడా కరోనా సోకిందని ఆయన చెప్పారు. 

Updated Date - 2020-07-03T11:16:39+05:30 IST