వనమూలికల ఝరి.. మహేంద్రగిరి

ABN , First Publish Date - 2022-08-02T05:28:11+05:30 IST

పాండవులు వనవాసం చేసిన మహేంద్రగిరి.. అపార వనమూలికలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. చీడపీడలు, రోగాలు ప్రబలకుండా పాండవులు ఈ ప్రాంతాల్లో వనమూలికల మొక్కలు వేసినట్టు ప్రతీతి. ప్రస్తుతం మహేంద్రగిరి పర్వతాల్లో 300 రకాల వనమూలికలు లభ్యమవుతున్నాయి. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ వనమూలికలను ఆదాయ వనరులుగా మార్చుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వనమూలికల ఝరి.. మహేంద్రగిరి
మహేంద్రగిరుల్లో వనమూలికలు

ఆయుర్వేదానికి పెరుగుతున్న ఆదరణ
ప్రోత్సహిస్తే ప్రభుత్వానికి అదనపు ఆదాయం
(పలాస)

పాండవులు వనవాసం చేసిన మహేంద్రగిరి.. అపార వనమూలికలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. చీడపీడలు, రోగాలు ప్రబలకుండా పాండవులు ఈ ప్రాంతాల్లో వనమూలికల మొక్కలు వేసినట్టు ప్రతీతి. ప్రస్తుతం మహేంద్రగిరి పర్వతాల్లో 300 రకాల వనమూలికలు లభ్యమవుతున్నాయి. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ వనమూలికలను ఆదాయ వనరులుగా మార్చుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సముద్రమట్టానికి 1500 మీటర్ల ఎత్తులో ఇటు ఆంధ్రా ప్రాంతంలోని కళింగదళ్‌ నుంచి అటు ఒడిశా ప్రాంతమైన గొసాని, గజపతి జిల్లాల వరకూ మహేంద్రగిరులు వ్యాపించి ఉన్నాయి. అగ్నిమంద, అజుమోడ, అతినిష, అశ్వగంధ, అర్జున, అరగ్వద, అర్ర్థిక, అమలిక, ఇంద్రవాణి, విదుంబర, కపికచ్చూ, కంటకారి, కరంజ, కంచనార, కర్కటశృంగి, గుడుచీ, చందనం, చాంగేరి, జటామాంసీ, జీరక, తూరక, త్వక్‌, ద్రోణపుష్టి, తైలపర్ణి, దుర్వ, నాగదంతి, పద్మక, మఖన, భవ్య, పారిబద్ర, పాతాళగరిడి, పారిజాత, పుత్రజీవక, అర్జుర, కీతకి, కృష్ణబీజ, నాగదంతి, రక్తనిర్వాసం, రక్తచందనం, రోహిష, వనవలాండు, వికంకత, శతావరి, నేలమేవు, తిప్పతీగ(గుడుచి), నల్లేరు, విషముష్టి, లంకామొదం, సుగంధపాలు, జిల్లేడు, నెల్లఉప్పి, కోరింత, ఊడుగాం, సరస్వతి, తెల్లఈశ్వరి, నల్లఈశ్వరితో పాటు అనేక రకాల వనమూలికలు ఈ ప్రాంతంలో ఉండేవి. ప్రస్తుతం ఇందులో సుమారు 30 రకాల మూలికలు స్థానికులు పోల్చి ఆయుర్వేద నిపుణులకు ఇస్తున్నారు. వర్షాలు కురిస్తే చాలు.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆయుర్వేద పండితులు మహేంద్రగిరుల్లో సంచరిస్తూ వనమూలికలను సేకరిస్తారు. ప్రధానంగా మందస, పలాస, వజ్రపుకొత్తూరు,మెళియాపుట్టి, కంచిలి, పర్లాకిమిడి, నారాయణపురం ప్రాంతాల్లో ఉండే ఆయుర్వేద నిపుణులు వీటిని సేకరించి వైద్యాన్ని అందిస్తున్నారు. అల్లోపతి వైద్యం కన్నా ఆయుర్వేదం సత్ఫలితాలు ఇవ్వడమే కాకుండా దుష్ప్రభావాలు రాకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ ద్వారా వన సంరక్షణ సమితులను ప్రారంభించడమే కాకుండా వాటిని బలోపేతం చేసింది. కేవలం వనౌషిత మొక్కలను పెంచడానికి ప్రత్యేక కమిటీని నియమించింది. వాటి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చింది. ఈ మేరకు టెక్కలి డివిజన్‌లో అనేక ప్రాంతాల్లో ఉన్న వనసంరక్షణ సమితుల ద్వారా 20రకాల ఆయుర్వేద మొక్కలను పెంచినా.. సరైన మార్కెటింగ్‌ను కల్పించడంలో విఫలం కావడంతో అవన్నీ మట్టికొట్టుకుపోయాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వనౌషిత మొక్కలపై మక్కువ చూపిస్తున్న నేపథ్యంలో వీటి ప్రాధాన్యం పెరిగింది. మహేంద్రగిరుల్లో ప్రకృతి పరంగా లభ్యమయ్యే ఔషధ మొక్కలను సేకరించి వాటి కోసం గిరిజనులకు ప్రోత్సహిస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు గిరిజనులకు కూడా జీవనభృతి కలుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

అందుకే..... ఆ రుచి....
మహేంద్రగిరుల నుంచి నీరు మందస, మెళియాపుట్టి ప్రాంతాలకు చేరుతుంది. కొండదిగువ ప్రాంతమంతా పచ్చని చేలతో నిత్యం కళకళలాడుతుంటుంది. అపారమైన వనమూలికల నీటితో ఇక్కడ పండే గడ్డిని తినడం వలన పశువులు ఎక్కువగా పాలు ఇవ్వడంతో పాటు ఆ పాలలో అనేక పోషక విలువలు ఉంటాయని ఈ ప్రాంతీయుల నమ్మకం. కనుకనే మందసలో ప్రత్యేకంగా లభ్యమైన కోవాకు ఆ రుచి వస్తుందని స్థానికులు చెబుతారు. మరే ప్రాంతంలో ఉండని విధంగా మందస కోవా సువాసనలతో ఘుమఘుమలాడుతుంటుంది. ఈ ప్రాంతానికి ఏ అతిథి వచ్చినా మందస కోవాను రుచి చూడాల్సిందే.

మొక్కల ప్రాముఖ్యత... వాటి పనితీరు

అడ్డరసం(వాసా): అడ్డరసం చెట్ల ఆకులు, కొమ్మల రసం తాగితే శ్వాసకోశవ్యాధి, దగ్గు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అందుగు(శల్లకి): అందుగు చెట్ల మూలికలు గుండెపోటు, కీళ్లవాతకు ఇది బాగా పని చేస్తుంది.
ఇండుపగింజ(కతక): జెర్రీ, తేలు, పురుగులు కుట్టిన వెంటనే కతక కాయలను అరగదీసి రాస్తే తక్షణం ఉపశమనం కలుగుతుంది.
ఊడుగ (అంకోల): ఊడుగ చెట్ల బెరడు కషాయాన్ని కాచి.. ఆకులతో నీళ్లు కాచి స్నానం చేస్తే ఒంటినొప్పులు పోతాయి. కుక్క కరిచినప్పుడు వాటి కాట్లుపై వేరును గుజ్జు చేసి పూస్తే తక్షణం తగ్గుతుంది.  
ఆరెపువ్వు(ధాతకి): ఉదర సంబంధిత వ్యాఽధి నివారించే గుణం దీనికి ఉంది.
కొడిశపాల(కుటుజా): జిగట విరోచనాలతో బాధపడేవారికి ఈ చెట్లు ఎంతో వినియోగపడతాయి.
గాడిదగడపాకు(కీటమారి) : నులిపురుగులకు ఇది ఎంతో వినియోగపడుతుంది.
నులుకాయ(ఆవర్తనీ) : చిన్నపిల్లలకు కడుపునొప్పి వచ్చినప్పుడు వీటి కాయలను అరగదీసి పాలలో కలిపిపెడితే ఉపశమనం లభిస్తుంది.
నేలతాడి(తాలమూలి): నేలతాడి వేళ్ల రసం తాగితే.. ఉత్సాహంగా ఉంటారు.
పాతాళగరుడి (సర్పగంధా) : ఈ చెట్టు వేలు రసం తాగితే గుండెపోటు తగ్గి.. మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.
అశ్వగంధ : వీర్యవృద్ధి, నిద్రలేమి, హృదయానికి శక్తిని ఇవ్వడానికి దీనిని ఎక్కువగా వినియోగిస్తారు.
రామబాణం: తేజస్సును పెంచడానికి రామబాణం చెట్టు ఎంతో వినియోగపడతాయి. ప్రస్తుతం ఇవి మహేంద్రగిరుల్లో కనుమరుగైన జాబితాల్లో చేరింది.
సునాముఖి(స్వర్ణపత్రి): వీటి ఆకులను నీటిలో మరగపెట్టి తాగితే మలబద్ధకం పూర్తిగా నశిస్తుంది. ప్రస్తుతం మహేంద్రగిరుల్లో వీటి లభ్యత తక్కువగా ఉండడంతో చిత్తూరు,తిరుపతి ప్రాంతాల నుంచి ఆయుర్వేద నిపుణులు వీటి ఆకులను తెస్తున్నారు.
తిప్పతీగ: దీనిని అమృత, గుడుచి అని కూడా పిలుస్తారు. పచ్చకామెర్లు, జ్వరాలకు ఇది బాగా పని చేస్తుంది.  
సరస్వతి ఆకు: చిత్తడి నేలల్లో ఎక్కువగా ఇవి పెరుగుతాయి. ఎండపెట్టి దీనిని తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
నేలవేము : రక్తనాళమార్గంలో గడ్డలు కట్టినప్పుడు కరగపెట్టి దీనిని సేవిస్తే వెంటనే నయమవుతుంది. ఎయిడ్స్‌ వంటి మహమ్మారితో పాటు చలిజ్వరం, కేన్సర్‌లకు కూడా విరుగుడుగా పని చేస్తుంది.
నల్లేరు: ఎముకల కలతలకు, ఉబ్బసవ్యాధికి ఇది బాగా పనిచేస్తుంది. వీటి కషాయం తాగలేని వారు కూరగా వినియోగించి వ్యాధిని తగ్గించుకుంటారు.  


ఆయుర్వేదంలో ప్రతీ జబ్బుకు మందు ఉంది.
ఆయుర్వేదంలో ప్రతీ జబ్బుకు మందు ఉంది. మహేంద్రగిరుల్లో గతంలో అనేక వందల రకాల వనమూలికలు, చెట్లు లభ్యమయ్యేవి. కాలక్రమేణా అవి కనిపిస్తున్నా పోల్చుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా పేటెంట్‌ హక్కు కల్పించడంతో పాటు మూలికలను గుర్తించే నిపుణులను రప్పిస్తే ఆయుర్వేదం ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
- డాక్టర్‌ కె.వివేకానంద, ఆయుర్వేద నిపుణుడు, పలాస.  

Updated Date - 2022-08-02T05:28:11+05:30 IST