వృక్ష సంపదలోనే అర్థశాస్త్రం దాగి ఉంది

ABN , First Publish Date - 2021-04-16T06:20:32+05:30 IST

వృక్ష సంపదలోనే అర్థశాస్త్రం దాగి ఉందని, వృక్ష సంపద చరిత్రగా నిల్చిపోతుందని పద్మశ్రీ వనజీవి రామయ్య పేర్కొన్నారు.

వృక్ష సంపదలోనే అర్థశాస్త్రం దాగి ఉంది
వనజీవి రామయ్యను సన్మానిస్తున్న వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌

పద్మశ్రీ వనజీవి రామయ్య

వైరా, ఏప్రిల్‌ 15: వృక్ష సంపదలోనే అర్థశాస్త్రం దాగి ఉందని, వృక్ష సంపద చరిత్రగా నిల్చిపోతుందని పద్మశ్రీ వనజీవి రామయ్య పేర్కొన్నారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తో కలిసి మండలంలోని విప్పలమడక ప్రాథమిక పాఠశాలలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో రామయ్య పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసరి వెంకటేశ్వర్లు తమ సొంతఖర్చులతో పాఠశాల విద్యార్థులకు సమకూర్చిన వాటర్‌ బాటిళ్లు, స్టీల్‌ప్లేట్లు ఇతర వస్తువులను ఎమ్మెల్యే రాములునాయక్‌, వనజీవి రామయ్య విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ చెట్ల పెంపకం భగవంతుడికి సేవ చేయటంతో సమానమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పండ్లు, ఫలాలతోపాటు వాటి విలువను తెలియజేయాల్సిన అవసరముందన్నారు. తమ పిల్లలు చిన్ననాటి నుంచే మొక్కల పెంపకంపై దృష్టిసారించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఫలితంగా వారిలో శ్రమశక్తి పెరుగుతుందని, భవిష్యత్‌లో కొన్నితరాల వారికి వారి చరిత్రగా ఉంటారని పేర్కొన్నారు. చెట్ల పెంపకం ద్వారా పర్యావరణం మెరుగవుతుందని, వర్షాలు సంమృద్ధిగా కురుస్తాయని, ప్రజల వైద్యం, ఆరోగ్యం మెరుగవుతుందని ఇవన్నీ కూడా ఆర్థికమూలాలతో ముడిపడి ఉన్నాయని, వీటన్నింటికీ అర్థశాస్త్రం ఇమిడిఉందని వివరించారు. తాను ఐదోఏటా నుంచే బీర విత్తనాల ద్వారా మొక్కల పెంపకంపై శ్రద్ధ ఏర్పడిందని తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఇంకా అనేక విషయాలను ఆయన వివరించారు. ఎమ్మెల్యే రాములునాయక్‌ మాట్లాడుతూ ధ్యేయం, సంకల్పంతో ఏదైనా సాధించవచ్చునని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య నిరూపించారని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే విద్యతోపాటు సేవాగుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు దాసరి వెంకటేశ్వర్లు ఇక్కడ విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లును గ్రామస్థులతో కలిసి ఎమ్మెల్యే రాములునాయక్‌, వనజీవి రామయ్య సన్మానించారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, విప్పలమడక సర్పంచ్‌ తుమ్మల జాన్‌పాపయ్య, ఎంపీటీసీ బూర్గు సంజీవరావు, ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు సాదం రామారావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు, యూత్‌ నియోజకవర్గ, మండల అధ్యక్షులు చల్లా సతీష్‌, జవ్వాజి నాగరాజు, పీఆర్టీయూ నాయకులు వెలిశెట్టి నర్సింహారావు, దొంతెబోయిన సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయుడు దాసరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T06:20:32+05:30 IST