వాన గండం

ABN , First Publish Date - 2020-11-22T08:38:34+05:30 IST

రాష్ట్రంలో వరి, పత్తి పంటలకు వానగండం పొంచి ఉంది. ప్రస్తుతం అనేకచోట్ల వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.

వాన గండం

బంగాళాఖాతంలో అల్పపీడనం


విశాఖపట్నం, అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరి, పత్తి పంటలకు వానగండం పొంచి ఉంది. ప్రస్తుతం అనేకచోట్ల వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ, వాయువ్య దిశలో కదులుతూ, శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరం వైపు ప్రయాణించి, ఈనెల 25న తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఈ నెల 24న రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. 25న రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


ఈ హెచ్చరికతో వరి, పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ నెల 23 నుంచి కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. గంటకు 55-65, అప్పుడప్పుడు 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి రావాలని సూచించింది.  కాగా, సముద్రం నుంచి వస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, శనివారం కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొంది. అనేకచోట్ల మంచు కురిసింది. ఉత్తరాది గాలులతో కొన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. 

Updated Date - 2020-11-22T08:38:34+05:30 IST