వామ్మో.. డెంగ్యూ!

ABN , First Publish Date - 2022-07-16T05:00:02+05:30 IST

మూడేళ్ల క్రితం జిల్లావాసులను డెంగ్యూ జ్వరాలు కలవర పెట్టాయి. ఎంతోమంది ఆ మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు.

వామ్మో.. డెంగ్యూ!
డెంగ్యూ దోమ

సీజన ఆరంభంలోనే వణుకు

జ్వరం వచ్చిందంటే ఆసుపత్రులకు పరుగు

ఇప్పటికే 28 కేసులు.. అనధికారికంగా ఎన్నో

నెల్లూరు నగరంలోనే ఎక్కువ కేసులు

ఫలితాలివ్వని డెంగ్యూ నివారణ మసోత్సవాలు

గ్రామాల్లో తూతూమంత్రంగా అవగాహన


డెంగ్యూ.. జిల్లాను కలవరపెడుతోంది. చిన్నపాటి జ్వరం వచ్చినా ఆ మహమ్మారి బారిన పడ్డామేమోనని జనం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. సీజన ఆరంభంలోనే వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 28 కేసులు నమోదవగా, ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటాయని ప్రైవేటు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు డెంగ్యూ నివారణ మాసోత్సవాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. గ్రామస్థాయిలో తూతూమంత్రంగా జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. 


నెల్లూరు (వైద్యం), జూలై 15 : మూడేళ్ల క్రితం జిల్లావాసులను డెంగ్యూ జ్వరాలు కలవర పెట్టాయి. ఎంతోమంది ఆ మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు. తాజాగా ఈ ఏడాది కూడా డెంగ్యూ ప్రజలను వణికిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటి వరకు కేవలం 28 కేసులే నమోదయ్యాయని చెబుతుండగా వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుందని ప్రైవేట్‌ వైద్యులు చెబుతున్నారు. 


జూలై నుంచి అక్టోబరు వరకు డెంగ్యూ వ్యాధికి అనుకూల వాతావరణం. ఈ నాలుగు నెలలు అప్రమత్తంగా ఉండాని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది డెంగ్యూ కేసులు తక్కువగా నమోదయినట్లు అధికారులు చెబుతున్నా ఈ ఏడాది సీజన ఆరంభంలోనే కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. ఇందుకు కారణం జిల్లాలో అడపాదడపా కురుస్తున్న వర్షాలే. ఇప్పటికే జ్వరాల బారిన పడ్డ బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 54 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 10 సామాజిక ఆరోగ్యకేంద్రాలు, 400 వరకు ఉప ఆరోగ్యకేంద్రాలు, రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక జిల్లా ఆసుపత్రి, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి వంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. అయితే, ఈ వైద్యశాలల్లో సరైన వైద్యం అందక పేదలు ప్రైవేట్‌ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. నెల్లూరు నగరంలోనే డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. అలాగే కలువాయి, బుచ్చి, నెల్లూరు రూరల్‌, ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, బోగోలు, కలిగిరి, కావలిరూరల్‌, రాపూరు, ఆత్మకూరు, అల్లూరు తదితర మండలాల్లో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. సాధారణ జ్వరంగా భావించి చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్థులు నిర్ధారణ పరీక్షల్లో డెంగ్యూగా తేలడంతో ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. పల్లెల నుంచి నెల్లూరుకు.. ఇక్కడ నయం కాకుంటే మెరుగైన వైద్యం కోసం చెన్నైకు వెళుతున్నారు. జిల్లాలో వందకుపైగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నా  28 కేసులే ఉన్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు.  


కానరాని మార్గదర్శకాలు..


డెంగ్యూ నిర్ధారణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచవో) కొన్ని మార్గదర్శకాలను సూచించింది. ర్యాపిడ్‌ పరీక్ష ద్వారా డెంగ్యూ నిర్ధారణ అయితే వైద్య చికిత్సలు అందించాలి. అయితే వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ర్యాపిడ్‌ పరీక్షలో గుర్తించిన డెంగ్యూను పరిగణలోకి తీసుకోమంటూ తేల్చి చెబుతోంది. ఎలీషా పరీక్ష తప్పనిసరి అంటోంది. అందులోనూ ప్రెవేట్‌ ఆసుపత్రులలో చేసే పరీక్షలను పరిగణలోకి తీసుకోమంటూ కేవలం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రితోపాటు కావలి, గూడూరు, ఆత్మకూరు, నాయుడుపేట, వెంకటగిరి ప్రభుత్వం ఆసుపత్రులలో చేసే పరీక్షలను ప్రామాణికంగా తీసుకుంటామని అంటోంది. అయితే, ఎలీషా పరీక్షలు చేసేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎలాంటి ఏర్పాట్లు లేవు. 


అవగాహన అవసరం


ప్రజా వైద్యం కోసం వైద్య ఆరోగ్య శాఖ రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నా వ్యాధులపై మాత్రం అవగాహన కల్పించడంలో వైఫల్యం చెందుతోంది. ప్రస్తుతం వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు హెచ్చరికలు చేయాల్సిన వైద్య శాఖ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ సీజన్‌లో డెంగ్యూ వ్యాధికి కారకమైన టైగర్‌ దోమల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనిపై ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంది. ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు డెంగ్యూ మాసోత్సవాల పేరుతో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నా అవి గ్రామస్థాయిలో తూతూమంత్రంగా మారుతున్నాయి. ప్రత్యేకించి వైద్య ఆరోగ్య శాఖ మలేరియా విభాగం చేపట్టే ఇలాంటి ప్రచారంలో నెల్లూరు కార్పొరేషనతోపాటు ఇతర మున్సిపాలిటీలు భాగస్వామ్యం కావాల్సి ఉన్నా ఆ దిశగా మున్సిపల్‌ అధికారులు సహకరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు శానిటేషన, అనటైడ్‌ ఫండ్స్‌ ప్రభుత్వం విడుదల చేయకపోవటంతో పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. 



డెంగ్యూ నివారణకు పెద్ద ఎత్తున ప్రచారం


జిల్లావ్యాప్తంగా డెంగ్యూ నివారణకు ప్రత్యేకంగా ప్రచార జాతాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాలలో ప్రచారం చేస్తూ పంచాయతీ కార్యదర్శులను అప్రమత్తం చేస్తున్నాం. అలాగే డెంగ్యూ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులకు సూచనలు చేశాం.   అందరూ సహకరిస్తేనే డెంగ్యూ వ్యాధిని కలిగించే దోమలను నివారించవచ్చు. 

- హుస్సేనమ్మ, డెంగ్యూ నివారణ అధికారి

Updated Date - 2022-07-16T05:00:02+05:30 IST