వామ్మో పులి

ABN , First Publish Date - 2021-10-18T04:09:41+05:30 IST

జిల్లాలోని బెజ్జూరు, పెంచికలపేట, దహెగాం అడవుల్లో తరుచూ పెద్దపులి కనిపిస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

వామ్మో పులి
లోగో

- తరుచూ పశువులపై దాడి

-  భయాందోళనలో గ్రామస్థులు

బెజ్జూరు, అక్టోబరు 17: జిల్లాలోని బెజ్జూరు, పెంచికలపేట, దహెగాం అడవుల్లో తరుచూ పెద్దపులి కనిపిస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ సంచరిస్తూ కనబడ్డ పశువులపై దాడులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాం తులకు గురి చేస్తోంది. వేసవి కాలంలో పంట పొలాలన్ని ఎండిపోయి ఉండడంతో ఇన్నాళ్లు  అడవుల్లో మకాం ఉన్న పులి ఇటీవల గత కొద్ది రోజులుగా గ్రామ పొలిమేరల్లో సంచరిస్తోంది. దీంతో సమీప అటవీ ప్రాంత గ్రామాల్లో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని  ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని బెజ్జూరు, పెంచికలపేట, దహెగాం మండలాల పరిధిలో పెద్దపులి సంచారం అధికంగా మారింది. వర్షాకాలంలో కురిసిన వర్షాలకు అటవీ ప్రాంతాలు గుబురుగా మారడంతో ఆహారం కోసం జనావాస ప్రాంతాలకు తరచూ వస్తోంది. ఇప్పటికే గత ఏడాది నవంబరులో దహెగాం, పెంచికలపేట మండలాల్లో పెద్దపులి దాడిలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. బెబ్బులి గర్జనలతో అటవీ ప్రాంత పల్లెవాసులు మళ్లీ వణికిపోతున్నారు. పులి పంథా మార్చుకొని గత ఏడాది పెంచికలపేట మండలంలోని గుండేపల్లి గ్రామాల్లో చొరబడి పశువులపై దాడి చేయడంతో భీతిల్లి పోయారు. అన్నదాతలకు ఆసరాగా ఉండి, వ్యవసాయ పనుల్లో సహాయపడే మూగజీవాలు పులి పంజాకు బలవుతుండటంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. 

పత్తి తీసే సమయం..

మరి కొద్ది రోజుల్లో రైతులు సాగు చేసిన పత్తి పంట చేతికందే సమయం రావడంతో రైతులంతా పత్తి ఏరేందుకు పంట చేలల్లోకి వెళ్తుంటారు. ఈ క్రమంలో  అటవీ ప్రాంత గ్రామాలకు చెందిన రైతుల వ్యవసాయ చేలు అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉండడంతో రోజు అటవీ ప్రాంతం వెంబడి రాకపోకలు చేస్తుంటారు. ఇదే క్రమంలో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులు పనులు ముగించుకొని చీకటి పడగానే ఇళ్లల్లోకి వెళ్తుంటారు. ఆ సమయంలో పశువులపై, మనుషులపై పులి దాడి చేసే అవకాశం ఉన్నందున భయాందోళన చెందుతున్నారు. బెజ్జూరు మండలంలోని చిన్నసిద్దాపూర్‌, ఎల్కపల్లి, హేటిగూడ, తలాయి, తిక్కపల్లి, బీమారం, గబ్బాయి పెంచికలపేట మండలంలోని ఆగర్‌గూడ, గుండేపల్లి, నందిగాం, కమ్మర్‌గాం, మొర్లిగూడ, దహెగాం మండలంలోని రాంపూర్‌, మొట్లగూడ, దిగిడ తదితర గ్రామాల్లో పెద్దపులి కదలికలు అధికంగా ఉన్నాయి. దీంతో నిత్యం ఆయా గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్దపులి దాడిలో సుమారుగా 200 పైగా పశువులు మృత్యువాత పడ్డాయి, మృతి చెందిన పశులు యజమా నులకు అటవీ శాఖ అధికారులు సైతం పరిహారం అందజేశారు. 

అధికారులకు చిక్కని పులి..

గత ఏడాది నుంచి అటవీ అధికారులను, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న పెద్దపులిని పట్టుకోవడానికి అటవీ శాఖకు పెను సవాలుగా మారింది. పెద్దపులి దాడిలో ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో జనవరి మాసంలో పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ముమ్మర ప్రయత్నాలు చేసింది. అయినా అటవీ శాఖకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతోంది. పులిని బంధించేందుకు అధికారులు ర్యాపిడ్‌ యాక్షన్‌ టీంలు, మత్తు మందు ప్రయోగం చేసే నిపుణులను సైతం రంగంలోకి దించినా చిక్కలేదు. ఆరు రోజుల పాటు మండలంలోని కంది బీమన్న అటవీ ప్రాంతంలో ఆపరేషన్‌ చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. పులి కదలికలను గుర్తించేందుకు అప్పట్లో అటవీ ప్రాంతంతో పాటు పులి సంచరించే ఎనిమిది కిలో మీటర్ల మేర ప్రాంతాన్ని గుర్తించి దాదాపు 150 సీసీ కెమేరాలను అమర్చి అన్వేషణ చేపట్టారు.  అయినప్పటికీ ఆచూకీ లభించలేదు.  అనంతరం వేసవి కాలం ప్రారంభం కావడంతో పులి జనావాసా ప్రాంతాలకు రాకపోవడం, అటవీ ప్రాంతంలోనే నీటి లభ్యత ఉన్న చోటే ఉండటంతో అటవీ శాఖ ప్రయత్నాలు మానుకొని టైగర్‌ ట్రాకర్ల ద్వారా అను నిత్యం దాని కదలికలను గుర్తించే పనిలో పడ్డారు. పులిని పట్టుకోవాలని గతంలో రైతులు ఆందోళన కార్యక్రమాలు సైతం చేపట్టారు. ఇటీవల కొద్ది రోజు లుగా పెద్దపులి తరచూ పఽశువులపై దాడి చేసి చంపడం ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభ విస్తుం దోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెంచికలపేట-బెజ్జూరు ప్రధా న రహదారిపై ప్రతి నిత్యం పులి కనిపిస్తుండడంతో ఆయా మార్గంలో వెళ్లే ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలి..

  - దయాకర్‌, అటవీరేంజ్‌ అధికారి, బెజ్జూరు

ప్రస్తుతం వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు పెద్దపులి కదలికలపై అప్రమత్తంగా ఉండాలి. రైతులు గుంపులు గుంపులుగా వెళ్లాలి.  తమ టైగర్‌ ట్రాకర్లు ఎప్పటికప్పుడు పెద్దపులి కదలికలను పసిగడుతు న్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.

Updated Date - 2021-10-18T04:09:41+05:30 IST