Abn logo
Sep 26 2021 @ 23:53PM

వామ్మో జ్వరం!

చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న జ్వరపీడితులు

వణికిస్తున్న డెంగ్యూ

భారీగా టైఫాయిడ్‌ కేసులు

అక్కడక్కడా మరణాలు 

కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

ఒంగోలు రిమ్స్‌లోనే 200మంది బాధితులు

ప్రైవేటు వైద్యశాలల్లోనూ 

వందల మంది ఇన్‌పేషెంట్లు

మూడు రోజులు మించి జ్వరం ఉంటే 

అప్రమత్తత అవసరమంటున్న వైద్యులు

పారిశుధ్య లోపం, దోమల ఉధృతి కారణం

కొనసాగుతున్న కరోనా తీవ్రత.

నిత్యం వందకుపైగానే కేసులు

(ఒంగోలు, ఆంధ్రజ్యోతి) 


బల్లికురవ మండలం కొప్పెరపాడులో విష జ్వరాలు విజృంభించాయి. వారం నుంచి అవి అదుపులోకి రావడం లేదు. గ్రామానికి చెందిన బండారు రమాదేవి (32) డెంగ్యూ లక్షణాలతో నరసరావుపేట వైద్యశాలలో చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో జ్వరాలు ప్రబలినా వైద్య శిబిరం ఏర్పాటు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.

టంగుటూరు మండలం అనంతవరం పంచాయతీ పరిధిలోని తేటుపురం మంచం పట్టింది. విషజ్వరాలతో ఊరంతా గజగజలాడుతోంది. అత్యఽధికులకు డెంగ్యూ లక్షణాలు కనిపిస్తుండటంతో హడలిపోతున్నారు. ప్రస్తుతం 15మంది వరకూ ఒంగోలులోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. స్థానిక ఆర్‌ఎంపీల వద్ద 70మంది వరకూ వైద్యం చేయించుకుంటున్నారు. ఊరిలో జ్వరం బారినపడిన పిట్టు వెంకటేశ్వర్లు ఇటీవల మృతి చెందాడు.

చీరాల నియోజకవర్గంలో విష జ్వరాలు విజృంభించాయి. మున్సిపాలిటీ  పరిధిలో జ్వరపీడితులు సంఖ్య ఎక్కువగా ఉంది. పట్టణంలోని 11వార్డుల్లో ప్రతి ఇంటిలో జ్వరపీడితులు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏరియా వైద్యశాలలో రోజుకు 300 నుంచి 400 ఓపీలు వస్తున్నాయి. పీహెచ్‌సీలు, ప్రైవేటు వైద్యశాలల్లో, ఆర్‌ఎంపీలు, పీఎంపీల వద్ద కలిపి మరో 1500  ఓపీలు ఉంటున్నాయి. వీరిలో సగం మంది జ్వరబాధితులే.

ఇదీ జిల్లాలో పరిస్థితి. ప్రజలను విష జ్వరాలు వణికిస్తున్నాయి. కరోనా తీవ్రత ఇప్పటికీ అధికంగానే కనిపిస్తుండగా గతపక్షం రోజులుగా సీజనల్‌ వ్యాధులు చుట్టేస్తున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా ఎక్కడ చూసినా వందల సంఖ్యలో జ్వరపీడితులు కనిపిస్తున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్‌ బారిన పడుతున్న వారు అధికంగా ఉంటున్నారు. ఇటీవల వర్షాలకు అన్ని చోట్లా పారిశుధ్యం అధ్వానంగా మారింది. దీంతో దోమల ఉధృతి పెరిగింది. వ్యాధుల వ్యాప్తికి ఇదే కారణమవుతున్నప్పటికీ యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. 


జిల్లాను జ్వరాలు వదలడం లేదు. ఎక్కడ చూసినా బాధితులు కనిపిస్తున్నారు. గ్రామాలకు గ్రామాలే మంచం పడుతున్నాయి. జిల్లాలో డెంగ్యూ, టైపాయిడ్‌, విష జ్వరాల ఉధృతి అధికంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ 91 డెంగ్యూ కేసులు నమోదు కాగా వాటిలో ఈ నెలలోనే 50 ఉన్నాయి. అధికారిక లెక్కల్లో లేనప్పటికీ పలు ప్రాంతాల్లో డెంగ్యూ మరణాలు కూడా సంభవిస్తున్నాయి. జిల్లాలో గత నెలరోజులుగా ముసురు పట్టి జల్లులు కురిసిన ప్రాంతాల్లో జ్వరపీడితులు అధికంగా ఉంటున్నారు. ఒంగోలులోని రిమ్స్‌లో ఏకంగా 200 మంది డెంగ్యూ లక్షణాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. చీరాల, పర్చూరు, అద్దంకి, చీమకుర్తి, కొండపి ప్రాంతాల్లో తీవ్రత అధికంగానే ఉంది. రోజువారీ ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలకు వైద్యం కోసం వస్తున్న వారిలో ఇంచుమించు సగం మంది జ్వర పీడితులే ఉంటుండగా వారిలో డెంగ్యూ, టైఫాయిడ్‌ సోకిన వారు అధికంగా ఉంటున్నారు. 


వైద్యశాలలు కిటకిట

ఒంగోలులోని పలు ప్రైవేటు వైద్యశాలలు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి.  చీరాల ఏరియా ఆసుపత్రిలో రోజువారీ  ఓపీల సంఖ్య 350కి చేరగా సగంమంది జ్వరపీడితులే ఉంటున్నారు. ప్రస్తుతం అక్కడ 30మంది వరకూ డెంగ్యూ చికిత్స పొందుతున్నారు. అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీల సంఖ్య 150 నుంచి 200కు పెరగ్గా అధికులు జ్వరపీడితులే. బల్లికురవ మండలం వి.కొప్పెరపాడు మంచం పట్టింది. దర్శి వైద్యశాలకు నిత్యం 40 నుంచి 50 మంది వరకు జ్వరపీడితులు వస్తుండగా కొండపిలోనూ అలాగే ఉంది. 


పడకేసిన ప్రభుత్వ వైద్యం 

సీజనల్‌ వ్యాధుల బారిన పడిన వారు ప్రభుత్వ వైద్యశాలలకు పరుగులు తీస్తున్నారు. కానీ అక్కడ సరైన వైద్యం అందడం లేదు. పలు ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ జ్వరం మాత్రలు తప్ప కనీస రక్త పరీక్షలు, కూడా కరువయ్యాయి. యాంటీబయాటిక్‌ మందులు ఇవ్వడం లేదు. దీనికితోడు కరోనా ఉధృతి కొనసాగుతుండటంతో జ్వరం వస్తే అది కరోనానా లేక సాధారణ జ్వరమా, డెంగ్యూనా అన్నది అర్థంకాక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. చికిత్సకోసం ప్రైవేటు వైద్యశాలకు వెళ్లిన వారికి సాధారణ రక్త పరీక్షలతోపాటు, కరోనా టెస్ట్‌లు, ప్లేట్‌లెట్స్‌ ఇతరత్రా పరీక్షలు చేస్తుండటంతో ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. దీంతో అత్యధికశాతం మంది ఈతరహా లక్షణాలు ఉన్న వారు దగ్గరలోని ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులను ఆశ్రయించి మందులు వాడుతూ తీవ్రత అధికమైతే ఆస్పత్రులకు వెళ్తున్నారు. అలా వస్తున్న వారితోనే ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు కిటకిటలాడుతుండగా మరో రెండు మాసాలపాటు వాటి తీవ్రత ఉంటుందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా జిల్లాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. నిత్యం వందకుపైగానే కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్వరం వచ్చిందంటే కరోనా అన్న అనుమానంతో ప్రజలు వణికిపోతున్నారు. 


మా వార్డులో డెంగ్యూతో ఇద్దరు చనిపోయారు 

పాపిశెట్టి సురేష్‌నాయుడు, 25వ వార్డు కౌన్సిలర్‌, చీరాల

మా వార్డులో థామస్‌, శ్రీహరి అనే ఇద్దరు డెంగ్యూతో చనిపోయారు.  జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మున్సిపల్‌ అధికారులు సక్రమంగా స్పందించటం లేదు. పారిశుధ్య చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. వైద్యారోగ్యశాఖ, మున్సిపల్‌ అధికారులు సంయుక్తంగా స్పందించి విష జ్వరాలు, డెంగ్యూ నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. 

 

విశ్రాంతి అవసరం

డాక్టర్‌ శ్రావణ్‌బాబు, చీరాల ఏరియా ఆస్పత్రి వైద్యుడు  

ప్రస్తుతం డెంగ్యూ, టైఫాయిడ్‌ జ్వరాలు అధికంగా ఉన్నాయి. జ్వరం వచ్చిన వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డెంగ్యూ అయితే మూడు దశలు ఉంటాయి. మొదటి రెండు, మూడు రోజుల నుంచి ప్లేట్‌లెట్స్‌ తగ్గుతాయి. ఈలోపు డాక్టర్‌ సూచన మేరకు మందులు వాడాలి. ఆహారంలో ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడంతోపాటు విశ్రాంతి అవసరం. కొందరికి ప్లేట్‌లెట్స్‌ 40వేలకు కూడా పడిపోతాయి. అలాంటి వారు కచ్ఛితంగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాలి. అవసరమైతే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సి వస్తుంది. 


డెంగ్యూ తగ్గాక కూడా జాగ్రత్తగా ఉండాలి

డాక్టర్‌ కె.చంద్రశేఖర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, రిమ్స్‌

ఇటీవల విష జ్వరాలు బాగా పెరిగాయి. ఒక్క రిమ్స్‌లోనే ప్రస్తుతం దాదాపు 200 మంది వరకూ డెంగ్యూ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. పగటివేళ నిల్వ ఉన్న మంచినీటిలో ఉండే దోమకుడితే డెంగ్యూ వస్తుంది. అందువల్ల ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటినిల్వ ఉండకుండా చూసుకోవాలి. డెంగ్యూ పాజిటివ్‌ వస్తే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. జ్వరం తగ్గాక ప్లేట్‌లెట్స్‌ పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల జ్వరం తగ్గాక కూడా అప్రమత్తంగా ఉండాలి.  

ఐదేళ్లుగా జిల్లాలో నమోదైన డెంగ్యూ కేసుల వివరాలు 

సంవత్సరం కేసులు 

2017 : 751

2018: 60

2019: 337

2020 : 84

2021 (ఇప్పటి వరకు) : 91

ఒంగోలు రిమ్స్‌లో ఓ వార్డులో జ్వరాలతో చికిత్స పొందుతున్న రోగులు