వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలి

ABN , First Publish Date - 2021-11-28T05:27:30+05:30 IST

కేంద్ర ప్రభుత్వం వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలి

కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమం

నేడు అనంతలో అఖిల భారత వాల్మీకి సమ్మేళనం

హాజరుకానున్న ఎనిమిది వాల్మీకి పీఠాల జగద్గురువులు... 

14 రాషా్ట్రల ప్రతినిధులు : మాజీ మంత్రి కాలవ వెల్లడి

అనంతపురం వైద్యం, నవంబరు 27: కేంద్ర ప్రభుత్వం వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా అనంతపురంలో అఖిల భారత వాల్మీకుల సమ్మేళనాన్ని ఆదివారం స్థానిక ఎంవైఆర్‌ ఫంక్షన హాల్‌లో నిర్వహిస్తున్నామన్నారు. శనివారం ఆ ఏర్పాట్లను ఎంపీ తలారి రంగయ్య, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, ఏడీసీసీ బ్యాంక్‌ చైర్మన లిఖితతో కలిసి పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. దశాబ్దాలుగా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని రాష్ట్రంలోని పోరాటం సాగిస్తూనే ఉన్నామన్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వాలపై ఒత్తిడి పెడుతున్నామన్నారు. టీడీపీ హయాంలో నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు కేబినెట్‌తో పాటు శాసనసభలోనూ ఈ ఆంశానికి ఆమోదం తెలిపి.. కేంద్ర ప్రభుత్వానికి ఫైల్‌ పంపించారన్నారు. మూడేళ్లయినా కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాజకీయాలకు అతీతంగా ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో దేశంలోని ఎనిమిది వాల్మీకి పీఠాల జగద్గురువులు, 14 రాషా్ట్రలకు చెందిన 40 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. పెద్దఎత్తున వాల్మీకులు హాజరై, ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీరి వెంట పామిడి వీరాంజనేయులు, తలారి ఆదినారాయణ, పూల నాగరాజు, రామచంద్ర, బ్రహ్మయ్య, పీవీ పార్థసారథి ఉన్నారు.

Updated Date - 2021-11-28T05:27:30+05:30 IST