Jul 9 2021 @ 14:15PM

అజిత్‌ ‘వలిమై’ ఫస్ట్‌లుక్ డేట్‌ ఫిక్సయ్యిందా‌?

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతాకాదు. విపరీతమైన మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘వలిమై’. ఈ సినిమా అప్‌డేట్‌ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ నిర్మిస్తున్నారు. హ్యూమా ఖురేషీ హీరోయిన్‌. యోగిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. టాలీవుడ్‌ యువ హీరో కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చుతున్నారు. అయితే, ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నప్పటికీ.. ఒక్కటంటే ఒక్క అప్‌డేట్‌ కూడా చిత్ర యూనిట్‌ వెల్లడించలేదు. అందుకే ఈ చిత్రం అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ పదేపదే డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా యూరో ఫుట్‌బాల్‌ టోర్నీ జరుగుతున్న వేదికపై నుంచి కూడా ఓ వీరాభిమాని ఈ చిత్రం అప్‌డేట్‌ కోసం ప్లకార్డును ప్రదర్శించాడు. 

ఈ నేపథ్యంలో విసిగిపోయిన చిత్ర బృందం ఈనెల 15వ తేదీన చిత్రం ఫస్ట్‌లుక్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ టీజర్‌ను రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్టుగా కోలీవుడ్‌ వర్గాల సమాచారం.      మరోవైపు ఈ చిత్రాన్ని దీపావళికి ముందుగా అంటే దసరాకు విడుదల చేయాలన్న ఆలోచనలో నిర్మాత ఉన్నట్టు తెలుస్తోంది. దీపావళికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘అన్నాత్త’ చిత్రం విడుదల కానుంది. దీంతో దీపావళికి భారీ బడ్జెట్‌ చిత్రాల మధ్య పోటీ ఉండరాదన్న భావనతో ముందుగానే రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది.