మబ్బులతో మద్దతుకు చెల్లు

ABN , First Publish Date - 2021-11-13T06:35:40+05:30 IST

వాతావరణంలో మబ్బుల కారణంగా వరికోతలు కోసిన రైతులు ఆందోళన చెందుతుండగా, ఇదే అదునుగా మిల్లర్లు దోచుకోవడం ప్రారంభించారు. మిల్లుల వద్దకు ధాన్యం తీసుకొచ్చి తమ వంతుకోసం ఎదురుచూస్తున్న రైతులను కమ్ముకుంటున్న మబ్బులు భయపెడుతున్నాయి.

మబ్బులతో మద్దతుకు చెల్లు
మిర్యాలగూడలోని ఓ మిల్లు వద్ద బారులుతీరిన ధాన్యంలోడు ట్రాక్టర్లు

మిల్లర్ల ఇష్టారాజ్యం

చింట్లకూ ధర తగ్గించారు

పలుచోట్ల చిరుజల్లులు


మిర్యాలగూడ: వాతావరణంలో మబ్బుల కారణంగా వరికోతలు కోసిన రైతులు ఆందోళన చెందుతుండగా, ఇదే అదునుగా మిల్లర్లు దోచుకోవడం ప్రారంభించారు. మిల్లుల వద్దకు ధాన్యం తీసుకొచ్చి తమ వంతుకోసం ఎదురుచూస్తున్న రైతులను కమ్ముకుంటున్న మబ్బులు భయపెడుతున్నాయి. వర్షం కురిస్తే ధాన్యం తడుస్తుందని, తద్వారా ధర తగ్గుతుందని రైతులు త్వరగా దిగుబడిని విక్రయించాలని మిల్లలుకు తరలిస్తే ఇదే అవకాశంగా మిల్లర్లు ధర తగ్గించారు. చేసేది లేక రైతులు వారి చెప్పిన ధరకే ధాన్యం విక్రయించి నష్టపోతున్నారు. ఇదిలా ఉండగా, జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు రాశులపై పట్టాలు కప్పి కొనుగోళ్లకోసం పడిగాపులు కాస్తున్నారు.


తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరికలు, ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్న నేపథ్యంలో మిల్లర్లు సిం డికేట్‌గా మారారు. ధాన్యంలో పచ్చిగింజలు, తాలు ఉందం టూ కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. క్వింటాకు రూ.1800తగ్గకుండా చూస్తామన్న అధికారులు, నేతలు చెబుతున్నా, వాటిని పట్టించుకోని మిల్లర్లు ఆడిందే ఆటగా మారింది. సన్నటి జల్లులు, తుంపర్లతో ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు కప్పినా, ఎక్కువ రోజులు ధాన్యం రంగు మారకుండా కాపాడలేమని రైతులు వాపోతున్నారు. మిల్లర్లు హెచ్‌ఎంటీ, పూజలు లాంటి సన్నరకం ధాన్యానికి రూ.1750 చెల్లిస్తుండగా, విధిలేని పరిస్థితుల్లో ఆ ధరకే రైతులు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు.


ధర తగ్గించి సన్నాల కొనుగోలు

సన్నరకాల్లో మరింత సన్నగా ఉండే చింట్లకు మిల్లర్లు రూ.70కి పైగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. పూజ రకాలకంటే 15 రోజులు ఆలస్యంగా కోతకొచ్చే చింట్లరకం బియ్యానికి బహిరంగ మార్కెట్లో ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఇటీవలి కాలం వరకు ఈ రకం ధాన్యం ధర క్వింటా రూ.1920 నుంచి రూ.1950 వరకు మిల్లర్లు కొనుగోలు చేశారు. కాగా, వారం రోజులుగా ఈ రకం ధాన్యం మార్కెట్లోకి ఎక్కువగా వస్తోంది. వాతావరణంలో మార్పుల కారణంగా రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు తొందరపడుతుండటంతో మిల్లర్లకు కలిసొచ్చింది. చింట్లు రకం ధాన్యానికి క్వింటాకు రూ.1820 చెల్లిస్తామని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. పొరుగు జిల్లాల నుంచి వచ్చిన ధాన్యానికి ధర భారీగా తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఆయకట్టులో లక్ష ఎకరాల్లో..

సాగర్‌ ఆయకట్టు పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో చింట్లరకం వరిసాగైంది. ఇప్పటివరకు 40శాతం మేర కోతలు పూర్తయ్యాయి. చింట్లరకం వరి ఎత్తుగా పెరుగుతుంది. కోతదశలో ఈదురు గాలులు, వర్షాలు కురిస్తే తొం దరగా పంట నేలవాలుతుందని తెలిసికూడా ధర ఎక్కువగా వస్తుందన్న ఆశతో రైతులు ఈ రకం ధాన్యం సాగు కు మొగ్గుచూపారు. అయితే మిగితా సన్నాల మాదిరిగానే మిల్లర్లు చింట్లకు సైతం తక్కువ ధర చెల్లిస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో 57మిల్లులు సన్నధాన్యం కొనుగోలు చేస్తుండ గా, అందులో 30మిల్లులు మాత్రమే చింట్ల రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాయి. నూక ఎక్కువగా వస్తుందన్న సాకుతో మిల్లర్లు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నప్పటికీ ప్రత్యామ్నాయం లేక తెగనమ్ముకోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కురిసిన చిరుజల్లులు

జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచే మబ్బుపట్టి చిరుజల్లులు కురిశాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబోసిన రైతులు పట్టాలు కప్పి దిగుబడిని కాపాడుకునేందుకు ఉరుకులుపెట్టారు.


తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు : నాగిరెడ్డి ఉపేందర్‌, పొనుగోడు, సూర్యాపేట జిల్లా

చింట్లరకం ధాన్యం లోడుతో గురువారం సాయంత్రం యాద్గార్‌పల్లి రోడ్డులోని మిల్లుపాయింట్‌ వద్దకు వచ్చా. ధాన్యాన్ని శుక్రవారం పరిశీలించిన మిల్లర్‌ తాలు ఉందని రూ.1850 ధర చెల్లిస్తామన్నారు. వర్షం బెంగతో వ్యాపారి చెప్పిన రేటుకే ధాన్యం విక్రయించా. ఒక్కలోడు ధాన్యంపై రూ.3వేల వరకు నష్టం వచ్చింది.


రెండురోజులుగా కునుకులేదు : పోరెడ్డి ఉదయ్‌కుమార్‌రెడ్డి, రైతు, రాఘవపురం

ధాన్యం దిగుమతిలో జాప్యం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆకాశంలో మబ్బులు చూస్తుంటే ఎప్పుడు వర్షం కురుస్తుందో అనే భయం వెంటాడుతోంది. ఆకాశం వైపు చూస్తూ, మిల్లర్‌ కోసం నిరీక్షించాల్సి వచ్చింది. తీరా పూజ రకం ధాన్యాన్ని పరిశీలించిన వ్యాపారి ధర రూ.1750 నిర్ణయిస్తే అరగంట బతిమలాడితే మారో రూ.10 పెంచాడు.


Updated Date - 2021-11-13T06:35:40+05:30 IST