Abn logo
Apr 16 2021 @ 23:50PM

ఆ భారమంతా వలంటీర్లదే!

ఓట్లు వేయించే బాధ్యత వారిదే!

వైసీపీ కరపత్రాలతో ఇంటింటికీ పంపిణీ

తేడావస్తే ఉద్యోగానికి ఎసరు అని హెచ్చరికలు

ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.5వేలు

అధికార పార్టీ నేతల తీరుపై విమర్శల వెల్లువ


వారంతా ప్రజాసేవ కోసం ప్రజాధనంతో నియమింపబడ్డ వలంటీర్లు. కానీ ఈ వ్యవస్థ ఇప్పుడు అబాసుపాలవుతోంది. తమ పార్టీ కార్యకర్తలుగా మార్చేసిన అధికార పార్టీ నేతలు పోలింగ్‌కు ఓటర్లను తరలించడం, ఫ్యాను గుర్తుకు ఓటు వేయించడం వంటి బాధ్యతలను అప్పగించింది.  వారిలో మరింత హుషారు నింపడం కోసం ఒక్కొక్కరికి రూ.ఐదు వేలు చొప్పున నగదు ఇస్తున్నట్టు సమాచారం. ఇంకేముంది... శుక్రవారం ఉదయం నుంచే వలంటీర్లు రంగంలోకి దిగారు. తమ పరిధిలోని 50 లేదా 100 కుటుంబాలకు ఫోన్లు చేసి ఓటు గురించి అధికార పార్టీ అదేశాలను తెలియజేస్తున్నారు. ఓటుకు రాకున్నా.. మరో గుర్తుపై మీట నొక్కినా మీ పథకాలు కట్‌ అవుతాయని హెచ్చరిస్తున్నారు. 


నెల్లూరు, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) :  ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ ప్రస్తుతం పూర్తిగా రాజకీయ వ్యవస్థగా మారిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వలంటీర్ల సేవలు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉన్నా తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం వీరిని బలవంతంగా రంగంలోకి దించేశారు. ఈ ఎన్నికల్లో ఐదు లక్షల మెజారిటీ లక్ష్యంగా ప్రకటించిన వైసీపీ, స్థానిక నాయకులెవరూ ఓటర్ల వద్దకు వెళ్లి ఓటు అభ్యర్థించలేదు. మంత్రులు రోడ్‌ షోలో హడావిడి చేశారే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారం కనిపించలేదు. మెజారిటీపై భారీ లక్ష్యాన్ని పెట్టిన వైసీపీ ఎందుకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయలేదనే అనుమానం అన్ని రాజకీయ పార్టీల్లోనూ కలిగింది. ఇప్పుడు ఆ అనుమానాలకు సమాధానం దొరికింది. ప్రజలతో నిత్యం అందుబాటులో ఉన్న వలంటీర్లను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు తలెత్తుతున్నాయి. తమ పార్టీకి ఓటు వేయకపోతే ఏం జరుగుతుందో వారి ద్వారా వారి పరిధిలోని కుటుంబాలను హెచ్చరిస్తున్నారు. వలంటీర్లను పూర్తిస్థాయిలో రాజకీయాలకు వాడుకొంటున్నారని, వారిని అడ్డుపెట్టుకొని ఓటర్లను బెదిరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తూనే వచ్చాయి. గత రెండు రోజుల్లో ఆ ఆరోపణలన్నీ నిజమని నిరూపించే సంఘటనలు పలుచోట్ల వెలుగుచూశాయి. 


ఓటరు చేతికి కరపత్రం..


ఓటర్ల చేతికి కరెన్సీ నోటుకు బదులు అధికార పార్టీ కరపత్రాలు అందుతున్నాయి. ప్రలోభాల స్థానంలో బెదిరింపులు వినిపిస్తున్నాయి. ‘‘మీ ఇంట్లో ప్రభుత్వం నుంచి ఇన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అవి ఉండాలంటే మేము చెప్పిన గుర్తుకు ఓటు వేయండి. లేదంటే మీ ఇష్టం.’’ అంటూ వలంటీర్ల ద్వారా సున్నితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓటర్లకు సంక్షేమ పథకాల వల్ల కలిగిన మేళ్లకు సంబంధించి లెక్కలు చూపిస్తూ, ఆ పని చేసిపెట్టిన వలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున జేబులో పెడుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 


పోలింగ్‌ శాతం పెంచే బాధ్యత..


రకరకాల ప్రతికూల పరిస్థితుల క్రమంలో ఉప ఎన్నిక పోలింగ్‌ శాతం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. పరిషత్‌ ఎన్నికల్లోనే ఆ విషయం రుజువయింది. సర్పంచ్‌ ఎన్నికల్లో పోలింగ్‌ 80 శాతం కన్నా ఎక్కువ ఉండగా పరిషత్‌ ఎన్నికల్లో 53 శాతానికే పరిమితం అయ్యింది. ఇప్పుడు పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉన్నాయి. ఒకవైపు కరోనా వణికిస్తోంది. పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజల్లో మళ్లీ భయం మొదలయ్యింది. ఇక ఎండల తీవ్రరూపం దాల్చాయి. ఎండలో గంటల తరబడి నిలబడి ఓటు వేయడానికి ప్రజల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇక మూడవది.. ముఖ్యమైనది ప్రజలకు ఇష్టమైనది ఈ ఎన్నికల్లో అందడం లేదు. అక్కడక్కడా ఓటుకు రూ.200 పంచుతున్నట్లు ప్రచారం జరిగింది. అది కూడా ఎంపిక చేసుకున్న గ్రామాల్లో మాత్రమే. ఈ క్రమంలో ఓటింగ్‌ శాతం తగ్గే సూచనలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే జరిగితే అధికార పార్టీకి ఇబ్బంది. దానిని అధిగమించే బాధ్యతను కూడా వలంటీర్లకు అప్పగించినట్లు సమాచారం. వారి పరిధిలోని 50 కుటుంబాలకు చెందిన ఓట్లు వేయించే బాధ్యతను వారికే అప్పగించినట్టు సమాచారం.

Advertisement
Advertisement
Advertisement