హుజూరాబాద్‌కు మరో నజరానా

ABN , First Publish Date - 2021-08-24T05:28:36+05:30 IST

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి..

హుజూరాబాద్‌కు మరో నజరానా

బీసీ కమిషన్‌ చైర్మన్‌గా వకుళాభరణం

సీనియర్‌ నాయకుడికి సముచిత ప్రాధాన్యం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో నజనారా ప్రకటించారు. ఉప ఎన్నికలో పోటీ చేయడానికి టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించిన బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణ మోహన్‌రావు బీసీ కమిషన్‌ చైర్మన్‌గా నియమించారు. విద్యార్థి దశ నుంచి బీసీ సంక్షేమ రాజకీయాలకు శ్రీకారం చుట్టిన కృష్ణ మోహనరావు చిరకాల వాంఛ ఈ పదవితో నెరవేరినట్లయింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కేసీఆర్‌ నియోజకవర్గ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈటల రాజేందర్‌కు చెక్‌ పెట్టేందుకు సీఎం కేసీఆర్‌ ఇక్కడి నేతలకు పెద్ద పీట వేస్తున్నారు. 


బీసీ హక్కుల ఉద్యమంలో మూడు దశాబ్దాలుగా..

వకుళాభరణం కృష్ణమోహనరావు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా 2009 సాధారణ ఎన్నికలు, 2010 ఉప ఎన్నికలో హుజూరాబాద్‌ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. విద్యార్థి దశ నుంచే బీసీ రాజకీయాల్లో కృష్ణమోహన్‌రావు చురుకైన పాత్ర వహిస్తున్నారు. బీసీ విద్యార్థి యువజన, బీసీ ప్రజల హక్కుల పోరాట నాయకునిగా మూడు దశబ్దాలుగా ఆయన కృషి చేస్తున్నారు. 2004 నుంచి 2009 వరకు ఆయన ఉమ్మడి రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడిగా పని చేశారు. ఆ తర్వాత 2016 నుంచి 2019 నుంచి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడిగాడా పనిచేశారు. 2011 నుంచి 2013 వరకు కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారక మంత్రిత్వ శాఖకు చెందిన పరిశోధన సలహా సంఘం సభ్యుడిగా ఉన్నారు.


రాజకీయ జీవితంలో అత్యధిక భాగంగా బీసీ సంక్షేమం, హక్కుల కోసం పోరాడిన కృష్ణమోహన్‌రావుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో పోటీ చేసే అవకాశం ఇవ్వక పోయినా సముచిత స్థానమే ఇచ్చినట్లుగా  భావిస్తున్నారు. కృష్ణమోహన్‌రావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఈటల రాజేందర్‌ బీసీ సామాజిక వర్గంలోని ముదిరాజ్‌ వర్గంలోని చెదిన వారు కావడంతో బీసీ అభ్యర్థినే రంగంలోకి దింపి తలపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించారు. ఆ నేపథ్యంలోనే కృష్ణమోహన్‌రావు ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు. 


వర్గాల వారీగా ప్రాధాన్యం

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితుల ఓట్లు 46,700 ఉండడంతో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని బండ శ్రీనివాస్‌కు కట్టబెట్టారు. రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉండడంతో పాటు ఆ వర్గానికి 22,600 ఓట్లు ఉండడంతో, ఈ నియోజక వర్గంలో ఆ వర్గం ఓట్లను ఆకర్శించడంతో పాటు, కాంగ్రెస్‌ పార్టీకి దీటైన అభ్యర్థి లేకుండా చేసే వ్యూహంలో భాగంగా పాడి కౌశిక్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించారు. బీసీ విద్యార్థి, యువజన, రాజకీయాల్లో చురుకుగా ఉంటూ బీసీ కమిషన్‌ సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేసిన కృష్ణమోహన్‌రావుకు బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చారు. నియోజక వర్గంలో కాపు, గౌడ సామాజిక వర్గాలకు అత్యధిక ఓట్లు ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన పొనగంటి మల్లయ్య ప్రస్తుతం రాష్ట్ర కార్పొరేషన్‌ పదవిని ఆశిస్తున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగాఉండి హుజూరాబాద్‌ రాజకీయాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న గంగుల కమలాకర్‌ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ కులస్థుల బాధ్యతను ప్రస్తుతానికి ఆయనపైనే వదిలేశారు. 


ఉద్యోగ సంఘ నాయకుడు, మైనార్టీ వర్గానికి చెందిన మరో నాయకుడు ముజాహిద్‌ ఏదైనా రాష్ట్ర స్థాయి పదవిని ఇవ్వాలని కోరుతున్నారు. పదవులన్నీ హుజూరాబాద్‌కే కట్టబెడుతున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన పార్టీ నాయకుల్లో అసంతృప్టి రేకెత్తుతున్నదని అధిష్టానం దృష్టికి వచ్చినట్లు తెలిసింది. దీంతో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముగిసే వరకు నామినేటెడ్‌ పదవుల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు సమాచారం.

Updated Date - 2021-08-24T05:28:36+05:30 IST