May 17 2021 @ 23:54PM

‘ఐకాన్’ ఎఫెక్ట్: వేణు శ్రీరామ్ సంచలన నిర్ణయం

‘వకీల్ సాబ్’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్.. తన తదుపరి చిత్రంగా అల్లు అర్జున్‌తో ‘ఐకాన్’ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రంపై అల్లు అర్జున్ ఇంత వరకు ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. వాస్తవానికి ఎప్పుడో తెరకెక్కాల్సిన ఈ చిత్రం.. అల్లు అర్జున్ అంగీకరించకపోవడంతో.. మీనమేషాలు లెక్కిస్తోంది. ఇక ‘వకీల్ సాబ్’ హిట్ తర్వాత ‘ఐకాన్’కు ఇక ఢోకా ఉండదని దిల్ రాజు, వేణు శ్రీరామ్ భావించారు. ఖచ్చితంగా ఈ సినిమా ఉంటుందని వీరిద్దరూ ప్రతి ప్రెస్ మీట్‌లో చెబుతూనే ఉన్నారు. కానీ అల్లు అర్జున్ సైడ్ నుంచి ఈ సినిమాకు సరైన క్లియరెన్స్ రాకపోవడంతో.. దర్శకుడు వేణు శ్రీరామ్ ఆ ప్రాజెక్ట్ పక్కనెట్టి.. మరో హీరోతో సినిమా చేయడానికి రెడీ అయినట్లుగా టాలీవుడ్‌లో వార్తలు మొదలయ్యాయి. 


అంతేకాదు.. ఇప్పటి వరకు దిల్ రాజు క్యాంప్‌లోనే ఉన్న వేణు శ్రీరామ్.. ఇప్పుడా క్యాంప్‌కు కూడా గుడ్ బై చెప్పేస్తున్నారనేలా కూడా వార్తలు వినవస్తున్నాయి. ఇదే నిజమైతే వేణు శ్రీరామ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లే. ప్రస్తుతం వేణు శ్రీరామ్.. ఓ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు అన్నీ సమకూర్చుకున్నాడని, బ్యానర్ కూడా రెడీ అయిందని, పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత.. మూవీ ప్రకటన చేయనున్నారనేలా వార్తలు వినబడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. వేణు శ్రీరామ్ వైపు నుంచి క్లారిటీ రావాల్సిందే.