ప్రణాళికాబద్ధంగా వజ్రోత్సవాలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-10T06:19:57+05:30 IST

జిల్లాలో ప్రణాళికాబద్ధంగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఆదేశించారు.

ప్రణాళికాబద్ధంగా వజ్రోత్సవాలు నిర్వహించాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

 - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌

సిరిసిల్ల కలెక్టరేట్‌, అగస్టు 9 :  జిల్లాలో ప్రణాళికాబద్ధంగా స్వాతంత్య్ర భారత  వజ్రోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఆదేశించారు.  కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన వీడియోకాన్ప రెన్స్‌లో హైదరాబాద్‌ నుంచి  వజ్రోత్స వాలపై కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి,  ఎస్పీ రాహుల్‌ హెగ్డేతో చర్చించారు.  ఆగస్టు 10న ప్రతీ గ్రామం, మున్సిపాల్టీల పరిధిలో వనమహోత్సవం కింద కనీసం 75 మొక్కలను నాటాలన్నారు. ఆగస్టు 11న ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు ప్రతీ మండల కేంద్రంలో ఫ్రీడం రన్‌ నిర్వహించాలని, ఆగస్టు 12న జాతీయ సమైక్యత కోసం రక్షాబంధన్‌, ఆగస్టు 13న ప్రతీ గ్రామంలో, మున్సిపాల్టీలో జాతీయ జెండాలు,  ఫకార్డులతో విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీ చేపట్టాలని అన్నారు. అనంతరం బెలూన్‌లను గాలిలోకి వదలాలని సూచించారు. ఆగస్టు 14న ప్రతీ నియోజకవర్గంలో జానపద కళారూపాల ప్రదర్శనకు ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు 16న ఉదయం 11 గంటలకు జిల్లా వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన  చేయాలని, 17న ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతీ గ్రామంలో క్రీడా పోటీలను  నిర్వహించాలన్నారు. 18న ఫ్రీడం చివరి పోటీలు నిర్వహించి విజేతలను నిర్ణయించాలన్నారు. 19న జిల్లాలో ఉన్న వృద్ధుల ఆశ్రమాలు, ఆస్పత్రులు, అనాథ శరణాలయంలో స్వీట్లు, పండ్లు పంపిణీ చేయాలన్నారు. 20న రంగోళీ పోటీలు, 21న పంచాయతీ, మండల , జిల్లా పరిషత్‌లలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.   ప్రతీ రోజు నిర్వహించే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని అదేశించారు. అనంతరం జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాలను తూచా తప్పకుండా చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్‌లు సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌, జడ్పీసీఈవో గౌతం రెడ్డి, డీఆర్డీవో మదన్‌మోహన్‌, డీపీవో రవీందర్‌, డీఈవో రాధాకిషన్‌, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజన్‌ ఉపేందర్‌రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T06:19:57+05:30 IST