వజ్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-11T06:05:42+05:30 IST

మెదక్‌ జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లాస్థాయి అధికారులు మొదలుకొని ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు.

వజ్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి

ఆయా శాఖల అధికారులను ఆదేశించిన కలెక్టర్లు

స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్ల పరిశీలన 

ఫ్రీడం పార్కులను ప్రారంభించిన నాయకులు, అధికారులు


మెదక్‌అర్బన్‌, ఆగస్టు 10: మెదక్‌ జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లాస్థాయి అధికారులు మొదలుకొని ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు. బుధవారం అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్‌, రమేష్‌, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, వివిధశాఖల అధికారులతో పాటు ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..ప్రభుత్వ సూచనల మేరకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమన్వయంతో పని చేసేలా ప్రణాళిక రూపొందించి అందుకనుగుణంగా చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. 


ఏర్పాట్లను పరిశీలించిన సిద్దిపేట కలెక్టర్‌, సీపీ 

 సిద్దిపేటక్రైం, ఆగస్టు 10: సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల నిర్వహణ ప్రాంగణాలను బుధవారం కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సీపీ శ్వేత పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. మొత్తం 4 వేల మంది   సౌకర్యవంతంగా కూర్చుని వేడుకలను చూసేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే కోమటిచెరువు వద్ద గల ఓపెన్‌ ఆడిటోరియాన్ని పరిశీలించారు. గురువారం ఉదయం 6.30 గంటలకు పాత బస్టాండ్‌ నుంచి సుమారు వెయ్యి మంది యువకులు, పోలీసులు అధికారులతో ఓపెన్‌ ఆడిటోరియం వరకు  ఫ్రీడం రన్‌ నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యఅతిథులు ప్రసంగించేందుకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ అధికారులు ఆదేశించారు. 14న సాయంత్రం కోమటిచెరువు నెక్లెస్‌ రోడ్డులో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, బాణసంచాను సిద్ధం చేయాలని మున్సిపల్‌, టూరిజంశాఖ అధికారులను ఆదేశించారు. వారి వెంట అదనపు కలెక్టర్లు, ముజామిల్‌ఖాన్‌, డీఆర్వో చెన్నయ్య ఏఎస్పీ మహేందర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌, మినిస్టర్‌ ఓఎస్టీ బాలరాజు, తహసీల్దార్‌ విజయ్‌సాగర్‌, డీపీఆర్వో రవికుమార్‌, ఈవెంట్‌ ఆర్గనైజర్‌  భాస్కర్‌, టూరిజం ఇంజనీర్‌ సోహైల్‌ పాల్గొన్నారు.


ఫ్రీడం పార్కు ప్రారంభం

 సంగారెడ్డిరూరల్‌: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సంగారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం జడ్పీచైర్‌పర్సన్‌ మంజుశ్రీ ఫ్రీడం పార్కును ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో కలెక్టర్‌ శరత్‌, అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, వీరారెడ్డి, అధికారులు, పాల్గొన్నారు.

 జహీరాబాద్‌ : జహీరాబాద్‌ మున్సిపాలిటీ ఆవరణంలో ఎమ్మెల్యే మాణిక్‌ రావు, కలెక్టర్‌ శరత్‌ ఫ్రీడం పార్కును ప్రారంభించారు. అనంతరం పార్కులో మొక్కలు నాటి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అలాగే మొగుడంపల్లి మండలం మాడ్గిలోని ఫ్రీడం పార్కులో ఎమ్మెల్యే మాణిక్‌రావు మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషా, జిల్లా పరిషత్‌ సీఈవో ఎల్లయ్య, ఆర్డీవో రమేశ్‌బాబు, తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ సుభాష్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మోహీయోద్దీన్‌, నాయకులు పాల్గొన్నారు.


  1.20 లక్షల మొక్కలు నాటనున్నాం : అటవీశాఖ సీసీఎఫ్‌  శర్వానన్‌ 

నర్సాపూర్‌, ఆగస్టు 10: మెదక్‌ జిల్లాలో వజ్రోత్సవాల సందర్భంగా ఇతర శాఖల సహకారంతో 1.20 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు అటవీశాఖ సీసీఎఫ్‌ శర్వానన్‌ తెలిపారు. బుధవారం నర్సాపూర్‌ అర్బన్‌పార్కులో మొక్కలు నాటిన సందర్భంగా డీఎ్‌ఫవో రవిప్రసాద్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. మెదక్‌లో 1.20 లక్షలు మొక్కలు, సంగారెడ్డి జిల్లాలో 2 లక్షలు, సిద్దిపేటలో 60 వేల మొక్కలు వజ్రోత్సవాల సందర్భంగా నాటనున్నట్లు ఆయన తెలిపారు. హరితహారంలో మెదక్‌ జిల్లాలో 34.4 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 98 శాతం అటవీశాఖ తరపున పూర్తి చేశామని మిగతావి కూడా ఈ వజ్రోత్సవాల్లో పూర్తవుతుందన్నారు. స్వాతంత్య్ర సంబురాల్లో భాగంగా ఇతర శాఖల సమన్వయంతో జిల్లాలో 19 ఫ్రీడం పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు సీసీఎఫ్‌ శర్వానన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-08-11T06:05:42+05:30 IST