భారత జన హృదయ విజేత

ABN , First Publish Date - 2021-12-25T06:02:33+05:30 IST

క్లిష్ట సమయంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వాజపేయి తన ఆరేళ్ల పదవీకాలంలో అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించారు. భవిష్య భారత సమగ్రాభివృద్ధికి నాంది పలికారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో....

భారత జన హృదయ విజేత

క్లిష్ట సమయంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వాజపేయి తన ఆరేళ్ల పదవీకాలంలో అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించారు. భవిష్య భారత సమగ్రాభివృద్ధికి నాంది పలికారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ఒక స్థాయి కల్పించారు. ఆయన తీసుకున్న అనేక సాహస నిర్ణయాలతో దేశ ఆర్థికరంగం వెలుగులీనే దశకు చేరుకుంది. మహోన్నత విలువలకు ప్రతీకగా నిలిచిన వాజపేయి సనాతన భారతానికి ఆధునిక సారధి అనడంలో అతిశయోక్తి లేదు.


స్వతంత్ర భారతంలో 67 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపినప్పటికీ అజాతశత్రువుగా కీర్తి గడించడం; 50 ఏళ్ల పాటు పార్లమెంట్‌ సభ్యుడిగా, 5 ఏళ్ల పాటు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా, రెండున్నర ఏళ్ల పాటు విదేశాంగమంత్రిగా, 6 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ ఇసుమంత అహంకారం లేకపోవడం, అవినీతి మరక అంటకపోవడం; చనిపోవడానికి ముందు 12 ఏళ్ల పాటు బయటి ప్రపంచానికి కనిపించకపోయినా, తాను మరణించినప్పుడు కోట్లాది మంది చేత కన్నీరు పెట్టించిన గొప్ప వ్యక్తిత్వంతో భారతీయులందరి హృదయాలలో అమలిన స్థానం సంపాదించడం మహోన్నతుడైన మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి విశిష్టతలు. స్వతంత్ర భారతంలో నెహ్రూ, ఇందిరల తరువాత యావత్‌ దేశాన్ని అంతగా సమ్మోహన పరచిన మరో నాయకుడిగా, మొదటి కాంగ్రెసేతర వ్యక్తిగా కీర్తికిరీటాలు అందుకున్న జాతీయ నేత, జనహృదయ విజేత ఆయన.


1951లో 27 ఏళ్ల నవ యవ్వన ప్రాయంలో వాజపేయి రాజకీయరంగంలోకి అడుగుపెట్టారు. శత్రువును సైతం హృదయపూర్వకంగా పలకరించే ఆదరపూర్వక హృదయం కలవాడు కాబట్టే ఆయనను మొదట విదేశాంగ మంత్రి బాధ్యతలు వరించాయి. కలగూర గంప వంటి భారత రాజకీయక్షేత్రంలో మొదటిసారి వరుసగా 6 ఏళ్ల పాటు 24 పార్టీలను ఒకే తాటిపై నిలిపి, సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపారు. ఆయన సంకీర్ణంలో పని చేసిన నితీష్‌కుమార్‌, మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌ వంటి నాయకులు ఈ రోజు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వాజపేయి భావి నాయకులను తీర్చిదిద్దారే కాని ఎదగకుండా అడ్డుకోలేదనడానికి ఇదే నిదర్శనం. నెహ్రూ కాలంలో వాజపేయి పార్లమెంట్‌కు ఎన్నికైనప్పటి నుంచి స్వతంత్ర భారతం ఎలా ఉండాలని చెపుతూ వచ్చారో తాను ప్రధాని అయ్యాక అటువంటి భారతం కోసమే గట్టిగా కృషి చేశారు.


వాస్తవానికి వాజపేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి భారతం ఎన్నో అంతర్గత, బాహ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. రాజకీయ క్షేత్రం మలిన రాజకీయాలతో నిండిపోయి, ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ, అధికారమే పరమావధిగా హత్యా రాజకీయాలకు సైతం వెనుకాడని దీన హీన స్థితిలో కూరుకుపోయి ఉంది. అలాంటి క్లిష్ట సమయంలో 1998లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వాజపేయి తన ఆరేళ్ల పదవీకాలంలో అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించారు. భవిష్య భారత సమగ్రాభివృద్ధికి నాంది పలికారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ఒక స్థాయి కల్పించారు.


నిజానికి 1996లోనే వాజపేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ అధికారమే పరమావధిగా కుర్చీలాట ఆడే కాంగ్రెస్‌ కళాకారుల సంకుచిత ధోరణి, స్వార్ధం వల్ల అది 13 రోజులకే కూలిపోయింది. అయితే రెట్టించిన ఉత్సాహంతో 1998లో రెండవసారి వాజపేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి, పార్లమెంట్‌లో తన బలాన్ని నిరూపించుకున్నారు. అధికారానికి దూరంగా ఎన్నో రోజులు ఉండలేకపోయిన భారత వృద్ధ పార్టీ అనుయాయి బృందంతో కలిసి ఆ ప్రభుత్వాన్ని సైతం 13 నెలలకే కుప్పకూల్చింది. ఈ కొద్దికాలంలోనే వాజపేయి భవ్యభారత నిర్మాణంలో భాగంగా కొన్ని అడుగులు వేశారు. 1998లో పదవి చేపట్టిన కొన్ని వారాలకే మే నెలలో పోఖ్రాన్‌–2 అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించి, భారత్‌ను ప్రపంచంలోని అణు అగ్రదేశాల సరసన నిలిపారు.


కశ్మీర్‌ రాచపుండును మాన్పేందుకు వాజపేయి నేరుగా పాకిస్థాన్‌తోనే దౌత్య సంబంధాలు నెరపడానికి సిద్ధపడ్డారు. అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో చేయి కలిపి ఢిల్లీ–లాహోర్‌ మధ్య బస్సు సర్వీసు ప్రారంభించారు. పాక్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ‘వేరు వేరు దేశాలుగా విడిపోయినప్పటికీ మనందరం ఒకే సంస్కృతికి చెందినవారం, మనందరి ఉన్నతి కోసం మళ్లీ ఎప్పటికైనా ఒకటి కాక తప్పద’ని పిలుపునిచ్చి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇటువంటి స్ఫూర్తిదాయక సాహసం ఆయన తప్ప అంతకుముందు ఏ భారత ప్రధానీ చేయలేదు.


వాజపేయి ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న సమయంలో దానిని బలహీనతగా భావించి కార్గిల్‌ కొండలను ఆక్రమించిన పాకిస్థాన్‌ను ఆయన ఎదుర్కొన్న తీరును, పాక్‌ కుట్రలను సాక్ష్యాలతో సహా బట్టబయలు చేసి, ప్రపంచదేశాల ముందు దానిని దోషిగా నిలబెట్టి; అమెరికా, చైనాలతో సహా ఎవరి సహాయమూ అందకుండా ఒంటరిని చేసి, కార్గిల్‌లో ఏకపక్ష విజయం సాధించిన తీరును చూసి దేశమంతా ఆయనకు కనీవినీ ఎరుగని రీతిలో నీరాజనాలు పట్టింది. 1999 ఎన్నికలలో మళ్లీ ఆయన వెనుకే నిలబడి మరింత విజయాన్ని చేకూర్చిపెట్టింది. అది సంకీర్ణమే అయినప్పటికీ మళ్లీ 2004 వరకు ఎవరూ వాజపేయి ప్రభుత్వాన్ని కూల్చే సాహసాన్ని కలలో చేయడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు.


వాజపేయి తన హయాంలో ఆర్థికంగా ఎన్నో కఠిన నిర్ణయాలను తీసుకున్నారు. నష్టాలలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించడానికి, ప్రభుత్వరంగ సంస్థల గుత్తాధిపత్యం తగ్గించి, ప్రైవేటుకు అవకాశం కల్పించి ఆయా రంగాలలో నూతన ఒరవడులను సృష్టించి, 100 కోట్లకు పైగా ప్రజలకు సౌకర్యాలను అందుబాటులోకి తేవడానికి కృషి చేశారు. ముఖ్యంగా అభివృద్ధికి ఆలవాలమైన సమాచార, రవాణా రంగాల ప్రగతికి పెద్దపీట వేశారు.


స్వర్ణ చతుర్భుజి పేరుతో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించి, పరుగులెత్తించారు. దాంతోపాటు ‘ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజన’ పేరుతో దేశంలోని 6 లక్షల గ్రామాలను దగ్గరి పట్టణాలతో కలుపుతూ రహదారులను నిర్మించారు. దాంతో రవాణా రంగంలో పెనుమార్పులు సంభవించి ఆర్థికరంగానికి అది ఎంతగానో తోడ్పాటునందించింది. ముఖ్యంగా వ్యవసాయ, పాడి రంగాలలో ఎంతో అభివృద్ధికి తోడ్పడింది.


సమాచార రంగ అభివృద్ధిలో భాగంగా నూతన శాటిలైట్‌ ప్రయోగాలతో ఇంటింటికి టెలిఫోన్‌, అనంతరం సెల్‌ఫోన్‌లకు మార్గం ఏర్పడింది. తక్కువ ధరకే అందరికీ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ‘అందరికీ ఆరోగ్యం’ పథకంలో భాగంగా పొగ చిమ్మే పుల్లల పొయ్యిల స్థానంలో గ్యాస్‌ పొయ్యిలను పెంచాలనే లక్ష్యం ఏర్పరచి, ఇంటింటికి గ్యాస్‌ కనెక్షన్‌ అందించే పథకం వాజపేయి హయాంలో ప్రారంభమైనదే. దూరదర్శన్‌ ప్రైవేటీకరణ మరో విప్లవాత్మక మార్పు తెచ్చింది. ప్రైవేట్‌ రంగంలో అనేక చానళ్లు పుట్టుకొచ్చి, యువతకు ఉద్యోగవకాశాలూ ఎంతగానో మెరుగుపడ్డాయి.


అప్పులు కట్టలేక ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెట్టిన దీన స్థితి నుంచి అప్పులన్నీ తీరి, విదేశీ మారక నిల్వలు వేల కోట్ల డాలర్లకు చేరిన మెరుగైన స్థితి ఏర్పడింది. ఉదాహరణకు ఆంధ్రలోని ఒక్క విశాఖ ఉక్కు కర్మాగారంలోనే 1999 నాటికి వెయ్యి కోట్ల అప్పులు పేరుకుపోగా, వాజపేయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో లాభాల బాట పట్టిన కర్మాగారం 2004 నాటికి 1600 కోట్ల మిగులులో ఉంది. ఇలా అనేక రంగాలలో వాజపేయి అనేక సాహస నిర్ణయాలు తీసుకోవడంతో 2004 నాటికి భారత్‌ ఆర్థిక రంగంలో వెలుగులీనే దశకు చేరింది. వాజపేయిలో రాజనీతిజ్ఞత కవిత్వ రూపంలో దాగి ఉంది. కవిత్వం, భాష, ప్రసంగం ప్రజలను ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఆయన కవిత్వాలు, ప్రసంగాలు ఒక ఉదాహరణ.


ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్‌చేసే జంప్‌ జిలానీలు వాజపేయిని చూసి చాలా నేర్చుకోవాలి. దాదాపు 60 ఏళ్ళు ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉండడం సులభమైన విషయం కాదు. ప్రతిపక్షంలో ఉంటూ భారతదేశం తరపున ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడం ఆయన రాజనీతిజ్ఞతకు అద్దం పడుతుంది. అద్వాణీతో ఆయనకున్న స్నేహం భారత రాజకీయ స్నేహబంధాల్లో చాలా విలువైనది. బహుశా! ఏ జంటా ఇంత సుదీర్ఘ స్నేహబంధాన్ని రాజకీయాల్లో కొనసాగించలేదు. వారి సుదీర్ఘ ప్రయాణం అజరామరం. వాజపేయి అంతిమయాత్రలో ప్రధాని మోదీతో సహా మంత్రులందరూ ఆరు కిలోమీటర్లు నడచి ప్రజలతో పాటు వెళ్ళడం ఒక అద్భుత సంఘటనే. అటువంటి అద్భుతం అంతకుముందు ఏ ఇతర రాజకీయ నాయకుడి విషయంలోనూ జరగలేదు.


వాజపేయి మోదీల సమకాలీన రాజకీయం చాలా తక్కువ. అయితే దేశ వైభవమే తన జీవన లక్ష్యంగా ఎదిగిన ప్రఖర జాతీయవాది వాజపేయి బాటలోనే మోదీ కూడా నడుస్తున్నారు. భారత అభివృద్ధికి వాజపేయి నాంది పలకగా, మోదీ దానిని అన్ని రంగాలకు విస్తరింపచేశారు. పరుగులు పెట్టిస్తున్నారు. నాడు వాజపేయి రవాణా, సమాచార రంగాలను ఒక కుదుపు కుదపగా నేడు మోదీ సేవా సాంకేతిక రంగాలను పతాక స్థాయికి చేర్చారు. విదేశాంగ విధానంలో వాజపేయి వేసిన బాటలను మోదీ మరింత ముందుకు తీసుకెళుతున్నారు. నాడు వాజపేయి మొదటిసారి పాక్‌ను ఒంటరిని చేయగా నేడు మోదీ పాక్‌ ఉనికినే ప్రశ్నార్థకం చేశారు. వాజపేయి హయాంలో నాటి రక్షణ మంత్రిజార్జ్‌ ఫెర్నాండెజ్‌ చైనాను బూచిగా వర్ణించి, దాని కుట్రలను బయటపెట్టగా, నేడు మోదీ చైనా ఆర్థిక వ్యవస్థపైనే దెబ్బకొట్టేందుకు నాంది పలికి ప్రపంచ దేశాలను ఆ దిశలో నడిచేలా ప్రభావితం చేస్తున్నారు. అమెరికాతో వాజపేయి సత్సంబంధాలకు తెరలేపగా, వాటిని పతాకస్థాయికి చేర్చారు మోదీ. నేడు వాతావరణ రక్షణ విషయం గానీ, ఉగ్రవాద నిర్మూలన విషయం గానీ, కరోనా కట్టడి విషయంలో గానీ మోదీ మాటకే యావత్‌ ప్రపంచం విలువనిస్తున్న విషయం అందరూ గమనిస్తున్నదే. 


మహోన్నత విలువలకు ప్రతీకగా నిలిచిన వాజపేయి సనాతన భారతానికి ఆధునిక సారధి అనడంలో అతిశయోక్తి లేదు. ఆయనకు ‘భారతరత్న’ ప్రకటించడం కృతజ్ఞతలు తెలుపుకోవడం మాత్రమే. అంతకుమించి భారతీయులు ఆయనకెంతో ఋణపడి ఉన్నారు.


బండి సంజయ్‌ కుమార్‌

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతాపార్టీ

(నేడు వాజపేయి జయంతి)

Updated Date - 2021-12-25T06:02:33+05:30 IST