ఘనంగా వైశాఖ పౌర్ణమి పూజలు

ABN , First Publish Date - 2022-05-17T06:43:39+05:30 IST

వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా వైశాఖ పౌర్ణమి పూజలు
త్రిపురాంతకంలో మల్లెలార్చనతో భక్తులు


తిపురాంతకం, మే 16: వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వేదమంత్రాల నడుమ త్రిపురాంతకేశ్వరునికి లక్షబిల్వార్చన, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారికి లక్షమల్లెలార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయాల ప్రధానార్చకులు విశ్వన్నారాయణశాస్త్రి, పాలంక ప్రసాదశర్మలు భక్తులకు తీర్ధ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో ట్రస్టుబోర్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

నరసింహస్వామికి సామూహిక హారతి

గిద్దలూరు : పట్టణంలోని కొండపై వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా మూడవరోజు సోమవారం సామూహిక హారతి నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సమరసత సేవాఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సామూహిక హారతి, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు.

గాయత్రీ మహాయజ్ఞం

గిద్దలూరు : పట్టణంలోని గాయత్రిమాత దేవాలయంలో వైశాఖపౌర్ణమి సందర్భంగా గాయత్రి మహాయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత తెలుగు అధ్యాపకుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ భారతీయ ధర్మం సత్కర్మల జీవనంతో కూడినదని, తీర్ధయాత్రలు చేయడం కూడా సత్కర్మలలో భాగమని పేర్కొన్నారు. భారతీయ ధర్మం ప్రకారం స్వీయవిజ్ఞానం, స్వీయనియంత్రణ ఉంటే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సులభంగా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో రామక్రిష్ణ ధ్యానమందిరం అధ్యక్షుడు హనుమంతరెడ్డి, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ యోగా గురూజీ నారాయణరెడ్డి, గాయత్రి పరివార్‌ ప్రతినిధులు లక్ష్మీ, ప్రసూన, నిఖిత, భవాని పాల్గొన్నారు.

సుదర్శనయాగం

రాచర్ల : మండలంలోని అనంపల్లె గ్రామంలో జాతీయ రహదారికి సమీపంలోని ఆయుర్వేద కేన్సర్‌ వైద్యుడు ఆకుల నాగేశ్వరుడు ఆధ్వర్యంలో సుదర్శన యాగం నిర్వహించారు. సోమవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో వేదపండితుల మధ్య సుదర్శన యాగం నిర్వహించారు. అక్కపల్లి, చోళ్లవీడు, అనంపల్లె గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి సుదర్శన యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

మిల్లంపల్లి వేణుగోపాలస్వామి ఆలయం

ఎర్రగొండపాలెం : ఎర్రగొండపాలెం సమీపంలో మిల్లంపల్లిలో వెలసిన శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి మూలవిరాట్‌కు సోమవారం భక్తులు విశేష పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగం గా  వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాన్ని సోమవారం పగలు సూర్యవాహనంపై, రాత్రి సింహవాహనంపై మోత కాపులు ఊరేగించారు. ప్రతిరోజు వేణుగోపాలస్వామి ఉత్పవ విగ్రహాన్ని గ్రామసందర్శనకు తీసుకొచ్చి భక్తులు ఊరేగింపు నిర్వహిస్తారు. భక్తులు దేవుని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-05-17T06:43:39+05:30 IST