వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

ABN , First Publish Date - 2022-01-14T05:09:50+05:30 IST

సంకాంత్రి పండుగ వేళ.. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. జిల్లాలో వైకుంఠ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం వేకువజాము నుంచే అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
నారాయణ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో బారులుతీరిన భక్తులు

- భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి

- కిటకిటలాడిన ఆలయాలు

- భక్తులకు ఉత్తర ద్వార ప్రవేశం

గుజరాతీపేట/గార/అరసవల్లి, జనవరి 13: సంకాంత్రి పండుగ వేళ.. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. జిల్లాలో వైకుంఠ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం వేకువజాము నుంచే అన్ని ఆలయాలు భక్తులతో  కిటకిటలాడాయి. శ్రీకాకుళం పీఎన్‌ కాలనీలోని నారాయణ తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వారం గుండా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త జస్టిస్‌ గురుగుబెల్లి యతిరాజులు, ఈవో వి.రాధాకృష్ణల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డీసీసీబీ కాలనీలోని శ్రీభూసమేత వేంకటేశ్వరస్వామి, నానుబలవీధిలోని విజయ దుర్గమ్మ, తదితర ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, కిల్లి రామ్మోహన్‌రావు, నటుడు కిల్లి క్రాంతి, చౌదరి సతీష్‌, తదితరులు వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గారలోని శ్రీకూర్మనాథక్షేత్రంలో స్వామివారి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఊరేగించారు.  ఈవో ఎస్‌.విజయకుమార్‌, ప్రధాన అర్చకులు సీతారామనర్సింహాచార్యులు ఆధర్యంలో వైకుంఠ ఏకాదశి పూజలు నిర్వహించారు. అరసవల్లిలో ఉషాపద్మినీ చాయ సమేత  సూర్యనారాయణ స్వామివారిని గురువారం వేకువజామున అశ్వ వాహనంపై ఊరేగించారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో ఉత్సవ మూర్తుల కల్యాణం వైభవంగా  జరిపించారు. రాత్రి  థర్మపథం కార్యక్రమం నిర్వహించారు. 


 ఫిబ్రవరి 8న రథసప్తమి 

అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఫిబ్రవరి 8న రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు ఈవో హరిసూర్యప్రకాష్‌ ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు గురువారం సమావేశమయ్యారు. ఈ ఏడాది ఆలయానికి రంగులు వేయకూడదని  నిర్ణయిం చారు. స్వామివారి వార్షిక కల్యాణంలోపు స్తంభాలకు మాత్రమే రంగులు వేసేందుకు తీర్మానించారు. క్యూలైన్లలో షామియానాల ఏర్పాటుకు ఈ నెల 25లోగా టెండరు ప్రక్రియ పూర్తిచేయాలని సంకల్పించారు. శ్రీఘ్రదర్శనం టికెట్‌ రూ.500గా, ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.100గా, అలాగే ఉచిత దర్శనానికి ధరలను నిర్ణయించారు. కేశఖండనశాలను ఈదఫా నగరపాలక సంస్థ పాఠశాల మైదానంలో నిర్వహించేందుకు తీర్మానించారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలక మండలి సభ్యులు కింజరాపు ఉమారాణి, జన్ని గౌతమి, పైడి భవానీ, యామిజాల గాయత్రి, మండవల్లి రవి, మండల మన్మధరావు, అంధవరపు రఘురాం పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-14T05:09:50+05:30 IST