Covid తీవ్రత నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే... వైకుంఠ ఏకాదశి దర్శనాలు

ABN , First Publish Date - 2022-01-12T17:26:20+05:30 IST

Covid తీవ్రత నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే... వైకుంఠ ఏకాదశి దర్శనాలు

Covid తీవ్రత నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే... వైకుంఠ ఏకాదశి దర్శనాలు

బెంగళూరు: రాజధాని బెంగళూరు నగరంలో రోజూ 10వేలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈనెల 13న వైకుంఠ ఏకాదశి వేడుకలను భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా తిలకించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని ఇస్కాన్‌, కలాసిపాళ్యలోని కోటె వెంకటేశ్వరస్వామి ఆలయం, జేపీ నగర్‌లోని దేవగిరి వెంకటేశ్వరస్వామి ఆలయాలలో కొవిడ్‌ నియమాలను కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు. సాధారణ రోజుల్లో అయితే వైకుంఠద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలలో నిలబడేవారు. ఈసారి పరిస్థితి అనుకూలించకపోవడం వల్ల ఆయా ఆలయాలలో ధార్మిక విధి విధానాలను ఎంపిక చేసిన కొద్దిమంది పాలకమండలి సభ్యులతో నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకునేందుకు నేరుగా అవకాశం కల్పిస్తే భక్తులరద్దీ పెరిగి అది వైరస్‌ ప్రబలేందుకు దారి తీస్తుందని దేవదాయశాఖ అధికారులు భావిస్తున్నారు. ముందు జాగ్రత్తగా వైకుంఠ ఏకాదశి వేడుకలను ఆన్‌లైన్‌లో తిలకించేందుకు సన్నాహాలు చేపట్టాలని భక్తులెవ్వరినీ అనుమతించవద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, పూజలు వంటివి యథావిధిగా జరిగినప్పటికీ భక్తులను అనుమతించరు. తెల్లవారుజామున 3.45 గంటలనుంచే ప్రక్రియ ప్రారంభమవుతుందని దేవదాయశాఖ వర్గాలు వెల్లడించాయి. రాజాజినగర్‌లోని ఇస్కాన్‌ ఆలయంలోనూ ఇదే విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోషల్‌మీడియా ద్వారా భక్తులు ఈ వేడుకలను తిలకించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇస్కాన్‌ వెల్లడించింది. భక్తుల రాకను నియంత్రించేందుకు అన్ని ప్రముఖ ఆలయాల వద్ద ముందస్తుగా బ్యారికేడ్‌లు నిర్మించి కట్టడి చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులెవ్వరూ ఆలయానికి రావద్దని ఆన్‌లైన్‌ ద్వారా వేడుకలను తిలకించాలని ఇస్కాన్‌, జేపీనగర్‌లోని దేవగిరి ఆలయం, కలాసిపాళ్యలోని కోటె వెంకటరమణస్వామి ఆలయ పాలకమండలులు వేర్వేరుగా భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ప్రకటనలు విడుదల చేశాయి. కాగా భక్తులు వేలసంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో వయ్యాలికావల్‌లోని టీటీడీ దేవస్థానం వైకుంఠ ఏకాదశి వేడుకలపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. భక్తులను అనుమతించే విషయమై ఉన్నతాధికారులతో చర్చించి బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - 2022-01-12T17:26:20+05:30 IST