కార్పొరేట్ల సంపద పెంచేందుకే మోదీ ప్రయత్నాలు

ABN , First Publish Date - 2021-04-13T06:00:14+05:30 IST

రైతాంగం బాసటగా నిలవాలని మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు.

కార్పొరేట్ల సంపద పెంచేందుకే మోదీ ప్రయత్నాలు

వ్యవసాయ రంగానికి తీవ్రనష్టాన్ని కలిగించే చట్టాలు రద్దు కావాలి

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

చల్లపల్లి, ఏప్రిల్‌ 12 : బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు దేశంలోని వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయనీ, ఆ చట్టాల రద్దుకోసం ఉవ్వెత్తున జరుగుతున్న పోరాటానికి రైతాంగం బాసటగా నిలవాలని మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. ఈనెల 19వ తేదీన విజయవాడ సిద్దార్థ కళాశాల ఆడిటోరియంలో జరుగనున్న కర్షక-కార్మిక శంఖారావ సదస్సు విజయవంతం కోరుతూ సోమవారం సాయంత్రం చల్లపల్లి చండ్ర రాజేశ్వరరావు వికాసకేంద్రంలో రైతు సదస్సు జరిగింది. ముఖ్యవక్తగా పాల్గొన్న వడ్డే మాట్లాడుతూ దేశంలోని రైతులను అవమానపరిచేలా ప్రధాని వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయం గిట్టుబాటు కావటంలేదని ఓవైపు రైతులు ఆందోళన చెందుతుంటే ఎరువుల ధరలు ఎన్నడూలేని విధంగా పెంచటం దుర్మార్గమని మండిపడ్డారు. రైతులు కోరినా రుణమాఫీ చేయని మోదీ ప్రభుత్వం రూ.2.35 లక్షల కోట్లు కార్పొరేట్లకు రుణమాఫీ చేసిందని విమర్శించారు.

 దేశంలో ఆదానీ ఆస్తులు రూ.7 లక్షల కోట్లకు పెరిగాయనీ, రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారిందని దుయ్యబట్టారు. రైతాంగ పోరాటంలో రైతులంతా భాగస్వాములు కావాలనీ, విజయవాడ శంఖారావ సదస్సును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ రైతుసంఘం అధ్యక్షుడు వై.కేశవరావు మాట్లాడుతూ నవంబరు నుంచి ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న పోరాటాలను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కుయుక్తులు పన్నిందన్నారు. విజయవాడలో జరిగే శంఖారావ సదస్సుకు ఢిల్లీ రైతుల పోరాట నాయకుడు రాకేష్‌ సింగ్‌ తికాయత్‌ హాజరవుతారనీ, ఆ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ గొర్రెపాటి వెంకట రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సదస్సులో రైతు సంఘాల నాయకులు కెవివి.ప్రసాద్‌, డి.హరినాథ్‌, వంగల సుబ్బారావు, మాగంటి హరిబాబు, మల్నీడి యలమందరావు, జన్ను జగన్‌, నాగేంద్రం మాట్లాడారు. 


Updated Date - 2021-04-13T06:00:14+05:30 IST