పేదల రక్తంతో వ్యాపారం

ABN , First Publish Date - 2022-05-26T06:01:20+05:30 IST

జిల్లాలో వడ్డీ జలగల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పట్టణస్థాయి నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు వడ్డీ దందా కొనసాగుతోంది. వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి సామాన్య, మధ్యతరగతి, చిరుద్యోగులు ఊళ్లు వదులుతున్నారు.

పేదల రక్తంతో వ్యాపారం

మితిమీరుతున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలు

అధిక వడ్డీలకు అప్పులు

కట్టలేకపోతే వేధింపులు

ఇళ్లు, ఆస్తులు రాయించుకుంటున్న వైనం

ఊళ్లు వదిలి వెళ్తున్న పలువురు బాధితులు

ఆత్మహత్యలూ చేసుకుంటున్న దుస్థితి

కట్టడి పట్టని అధికారులు



పుట్టపర్తి, ఆంధ్రజ్యోతి

జిల్లాలో వడ్డీ జలగల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పట్టణస్థాయి నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు వడ్డీ దందా కొనసాగుతోంది. వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి సామాన్య, మధ్యతరగతి, చిరుద్యోగులు ఊళ్లు వదులుతున్నారు. తాజాగా కదిరి పట్టణంలో వడ్డీ వ్యాపారి రమణారెడ్డి ఇంటిపై ఐటీ శాఖాధికారుల దాడుల్లో పెద్దఎత్తున నగదుతోపాటు రూ.కోట్ల విలువైన ఆస్తులు బయటపడినట్లు తెలుస్తోంది. ఈలెక్కన జిల్లాలో వడ్డీ వ్యాపారం ఏ రేంజ్‌లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని, వడ్డీలపై వడ్డీలు వసూలు చేస్తూ వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. ప్రైవేటు, వడ్డీ వ్యాపారుల చేతికి చిక్కి పేదలతోపాటు సామాన్యులు, చిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. వడ్డీలు కట్టలేక విలవిల్లాడుతున్నారు.


వడ్డీ బాదుడు

జిల్లాలోని హిందూపురం, ధర్మవరం, కదిరి, పెనుకొండ, మడకశిర, పుట్టపర్తి, కొత్తచెరువు, ముదిగుబ్బ, గోరంట్ల, బత్తలపల్లి, చెన్నేకొత్తపల్లి, సోమందేపల్లితోపాటు మండల, గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం పెద్దఎత్తున చేస్తున్నట్లు సమాచారం. రోజు, వారం, నెలవారీ కలెక్షన్లతో పేదల రక్తం తాగేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. రెండేళ్లుగా కరోనా.. పేదలతోపాటు అన్నిరంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. అన్నివర్గాల వారిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. వాటి నుంచి బయటపడేందుకు ఇళ్లలోని బంగారం, ఆస్తులు.. బ్యాంకుల్లో తనఖా పెట్టారు. ఇంకా సమస్యలు తీరక అప్పుల కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించారు. దీనిని ఆసరాగా చేసుకుని, వ్యాపారులు వడ్డీలు విపరీతంగా పెంచేశారు. అధిక వడ్డీకే అప్పు ఇస్తామంటూ నిబంధనలు పెట్టారు. ఇబ్బందుల్లో ఉన్న సామాన్యులు.. వాటికి అంగీకరించి, అప్పులు తీసుకున్నారు. అప్పట్నుంచి వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పులకు వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నారు. ముందుగానే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నవారికి ఇది మరింత భారంగా మారింది. వడ్డీలు కట్టలేక చేతులెత్తేస్తున్నారు. వారిపై వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు మామూలుగా ఉండట్లేదు. ఇళ్ల వద్దకెళ్లి గొడవలకు దిగుతున్నారు. దీంతో ఎక్కడ ఇళ్ల వద్దకు వస్తారోనని ఊళ్లు వదిలి వెళ్లిపోతున్నారు. తనఖా పెట్టిన ఆస్తులను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటున్నారు. తనఖా పెట్టకపోయినా.. అప్పు కట్టలేదని ఆస్తులను తక్కువకే లాగేసుకుంటున్నారు. దీంతో అప్పులు తీసుకున్న కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.


బతుకు బండిపై కత్తి 

జిల్లాలో చిరు వ్యాపారులైన తోపుడుబండి, చాట్‌, చికెన, చిల్లర దుకాణాలు, ప్రైవేటు, ప్రభుత్వ చిరుద్యోగులే వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుంటున్నారు. చేనేత, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులతోపాటు ప్రైవేటు సెక్టార్‌లో పనిచేసే వేతన జీవులూ అవసరాలకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. హిందూపురం, ధర్మవరం, కదిరి, మడకశిర, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర, గోరంట్లలో పెద్దఎత్తున చిట్టీలు, ఫైనాన్స పేరుతో వడ్డీ వ్యాపారం సాగిస్తున్నారు. వ్యాపారులు తమ వద్దకు అప్పుకోసం వచ్చేవారి అవసరాలను బట్టి ఒక్కొక్కరితో ఒక్కోలా వడ్డీ వసూలు చేస్తున్నారు. చిన్నచిన్న వ్యాపారులు, తోపుడుబండ్ల నిర్వాహకులు ఏరోజుకారోజు జరిగే వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తుంటారు. అలాంటివారు పెట్టుబడి కోసం డెయిలీ ఫైనాన్స వారిని ఆశ్రయిస్తుంటారు. ఉదయం రూ.900 ఇస్తే సాయంత్రానికి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. తద్వారా రోజుకు ఒక్కొక్కరిపై రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మరికొందరైతే రూ.9వేలు ఇచ్చి, పదివారాల్లో రూ.10వేలు జమ చేసుకుంటారు. ఈ లెక్కన వడ్డీ వ్యాపారులు సాగిస్తున్న దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పట్టణాల్లో మైక్రో ఫైనాన్స సంస్థలు వెలుస్తూ ఇళ్లు, స్థలాలు, భూములు, వాహనాలను తనాఖా పెట్టుకుని అప్పులు ఇస్తున్నారు. సకాలంలో చెల్లించలేకపోతే తనాఖా పెట్టిన వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ద్విచక్రవాహనాలు, కార్లు, గూడ్స్‌ వాహనాలను తనఖా పెట్టుకుని, నూటికి నెలకు రూ.10 దాకా వడ్డీ గుంజుతున్నారు. హిందూపురం, కదిరి, ధర్మవరంలో ఇలాంటి వడ్డీ వ్యాపారులు భారీ సంఖ్యలో పుట్టుకొచ్చారు. కదిరిపై పులివెందుల వడ్డీ జలగలు వాలిపోతున్నాయి. ధర్మవరంలో చేనేతలు, హిందూపురంలో ఉద్యోగులు, కార్మికులు, లారీ యజమానులు, తోపుడుబండ్ల వ్యాపారులు, చిరు దుకాణాల నిర్వాహకులు.. వడ్డీ వ్యాపారుల చేతికి చిక్కి విలవిల్లాడుతున్నారు. సాయంత్రం అయిందంటే పుస్తకాలు పట్టుకుని, వడ్డీ జలగలు వసూళ్లకు వస్తున్నాయి.


చిట్టీల మాటున...

హిందూపురం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర, గోరంట్ల, బత్తలపల్లి, ముదిగుబ్బతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చిట్టీల మాటున వడ్డీ వ్యాపారం రూ.కోట్లలో సాగుతోంది. హిందూపురంలో రాయలసీమలోనే అత్యధికంగా ఫైనాన్సలు ఉన్నాయి. ప్రతి కాలనీలో చిట్టీల నిర్వహణ పేరుతో బడా వడ్డీ వ్యాపారులు 500మందికిపైగానే ఉంటారు. వీరంతా లక్షల నుంచి రూ.కోట్ల దాకా ఇచ్చేవారే. రియల్‌ వ్యాపారులకు సైతం రూ.కోట్లలో వడ్డీలకు ఇస్తున్నారు. ధర్మవరంలో చేనేత కార్మికులు.. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కదిరిలో వడ్డీ వ్యాపారం చేసేందుకే పులివెందుల, మదనపల్లి, రాయచోటి ప్రాంతాలవారు వస్తున్నారు. పుట్టపర్తిపై కొత్తచెరువు, బుక్కపట్నం వడ్డీ వ్యాపారుల చేతిలో సామాన్య, మధ్యతరగతి, చిరుద్యోగులు చిక్కుకుని, వడ్డీలు కట్టలేక విలవిలాడుతున్నారు. కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షభంతోపాటు ఆకాశాన్నంటిన ధరలు సామాన్యుల బతుకు బండిని కుదేలు చేశాయి. ఈనేపథ్యంలో అవసరాలు, వ్యాపారాల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక వడ్డీలు కట్టలేక ఇటీవల చాలామంది ఊళ్లు వదిపోతున్నారు.


కట్టడి ఏదీ..?

నాలుగేళ్ల కిందట కాల్‌మనీ పేరుతో వడ్డీ వ్యాపారుల వేధింపులు తగ్గుకోలేక పలువురు ఇళ్లు వదలగా కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడిన సంగంతి తెలిసిందే. అప్పట్లో వడ్డీ జలగలపై టీడీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చిన ఘటనలు కోకొల్లలు. అప్పట్లో వడ్డీ వ్యాపారులు వణికిపోయారు. వైసీపీ పాలనలో వారి ఆగడాలు శృతిమించాయి. జిల్లావ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల జాబితా అనధికారికంగా పోలీసులు వద్ద ఉన్నా.. చర్యలు చేపట్టట్లేదు. దీంతో వడ్డీ వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. వారిపై ఐటీ దాడులు చేసే స్థాయికి వచ్చిందంటే జిల్లాలో ఏమేరకు సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వడ్డీ జలగలపై పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.


వడ్డీ వ్యాపారుల ఆగడాలివీ..

ధర్మవరంలో కాలేజ్‌ సర్కిల్‌లో హోటల్‌, టీస్టాల్‌ వ్యాపారి పలువురు వడ్డీ వ్యాపారుల నుంచి దాదాపు రూ.20 లక్షలదాకా అప్పులు తీసుకుని, వడ్డీలు కట్టలేక ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆరు నెలల కిందట పట్టణం వదిలి, వెళ్లిపోయాడు.

ధర్మవరంలోని రాజేంద్రనగర్‌, శాంతినగర్‌, శివానగర్‌కు చెందిన చేనేత కార్మికులు.. వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. వారి ఒత్తిళ్లను భరించలేక ఆరు నెలల కాలంలో నలుగురు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు చేనేత కార్మిక వర్గాలే చెబుతున్నాయి.

హిందూపురంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో తోపుడుబండి పెట్టే చిరువ్యాపారి ముగ్గురు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.90 వేలు అప్పు తీసుకున్నాడు. కరోనాతో వ్యాపారంలేక వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు తట్టుకోలేక నాలుగు నెలల కిందట ఊరు వదలి, వెళ్లిపోయాడు.

హిందూపురం పట్టణంలోని సదాశివనగర్‌, మేళాపురంలో చిట్టీల పేరుతో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు రూ.20 కోట్లకుపైగా కుచ్చుటోపీ పెట్టి, పరారయ్యారు. తర్వాత వారిని పోలీసులు అరెస్టు చేశారు.

ముద్దిరెడ్డిపల్లిలో ఓ చేనేత, పవర్‌లూమ్స్‌ వ్యాపారి.. బడా వడ్డీ వ్యాపారుల నుంచి రూ.35 కోట్లదాకా అప్పు తీసుకున్నాడు. అతడు ఇటీవలే మృతిచెందాడు. పట్టణంలో ఆ కుటుంబానికి చెందిన ఆస్తులపై రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి, వ్యాపారులు రాయించుకున్నట్లు తెలుస్తోంది.

కదిరి మెయిన బజార్‌లోని ఓ బంగారుషాపు యజమాని ఇటీవల ఐటీ సోదాల్లో పట్టుబడిన వడ్డీ వ్యాపారి నుంచి రూ.30 లక్షలు అప్పు తీసుకున్నాడు. అసలు, వడ్డీ రూ.1.15 కోట్లకు చేరగా.. చివరకు ఇంటినే రాయించుకున్నాడు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ సీఐ జోక్యం చేసుకుని, అసలుతోపాటు రూ.60 లక్షలకు సెటిల్‌మెంట్‌ చేశాడు. 

ఓ ఉపాధ్యాయుడు.. వడ్డీ వ్యాపారి వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఏడు లక్షలు కట్టుకోవాల్సి వచ్చింది. డబ్బు చెల్లించడంలో ఆలస్యమవడంతో ఉపాఽధ్యాయుడి కుటుంబ సభ్యులను వడ్డీ వ్యాపారి తీసుకెళ్లి, సెంటిల్‌మెంట్‌ తరువాత వదిలి పెట్టినట్లు కదిరిలో ప్రచారం ఉంది.

కేరళకు చెందిన హోటల్‌ నిర్వాహకుడు.. పుట్టపర్తిలోని ఓ బడా వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తీసుకున్నాడు. కరోనా దెబ్బకు వ్యాపారాలు లేక అప్పు తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో పుట్టపర్తిలో గణేష్‌ గేట్‌ వద్ద ఉన్న హోటల్‌ నిర్వాహకుడి ఇంటిని వడ్డీ వ్యాపారి రాయించుకున్నాడు.

కొత్తచెరువులోని బుక్కపట్నం రహదారిలో పూలు, పండ్ల వ్యాపారం చేసుకునే యువకుడు.. స్థానికంగా పలువురు వడ్డీ వ్యాపారుల నుంచి రూ.25 లక్షలదాకా అప్పులు తీసుకున్నాడు. రోజువారీ వడ్డీలు కట్టలేక ఐదు నెలల కిందట ఊరు వదిలి, వెళ్లిపోయాడు.

Updated Date - 2022-05-26T06:01:20+05:30 IST