వాటాల కోసమే కానీ.. వడ్డెరల సంక్షేమం కోసం కాదు

ABN , First Publish Date - 2022-08-20T05:56:31+05:30 IST

నారాయణపురం మైనింగ్‌క్వారీలో వైసీపీ నాయకుల మధ్య జరిగిన గొడవ వాటాలకోసం జరిగిందే తప్ప వడ్డెరుల సంక్షేమం కోసం కాదని దాచేపల్లి మండల వడ్డెర సంఘ నాయకులు, టీడీపీ నేతలు ఆరోపించారు.

వాటాల కోసమే కానీ.. వడ్డెరల సంక్షేమం కోసం కాదు
టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతున్న వడియరాజుల నాయకులు

టీడీపీ వడ్డెర సంఘ నాయకుల ఆరోపణ

దాచేపల్లి, ఆగస్టు 19: నారాయణపురం మైనింగ్‌క్వారీలో వైసీపీ నాయకుల మధ్య జరిగిన గొడవ వాటాలకోసం జరిగిందే తప్ప వడ్డెరుల సంక్షేమం కోసం కాదని దాచేపల్లి మండల  వడ్డెర సంఘ నాయకులు, టీడీపీ నేతలు ఆరోపించారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ క్వారీలో కష్టపడి పనిచేసిన వారిని బానిసలుగా చూస్తున్నారే కానీ కార్మికులుగా చూడటం లేదంటూ విమర్శించారు. క్వారీలకు వడ్డెర కార్మికులను యజమానులను చేస్తామని ఇచ్చిన హామీ తుంగలో తొక్కారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్వారీలో నుంచి వచ్చిన ప్రతి రూపాయిని వారి సంక్షేమం కోసం ఖర్చుచేస్తే... వైసీపీ ప్రభుత్వంలో ప్రతి రూపాయి నాయకుల జేబుల్లోకి వెళ్లిపోతుందని విమర్శించారు. గతంలో వడ్డెరులకు జరుగుతున్న అన్యాయం ప్రశ్నించిన వారిపై కత్తులతో దాడిచేసి ఒక వ్యక్తిని హత్యచేయగా, మరో నలుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారని వివరించారు. ఇప్పటికైనా వడ్డెర కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో డాక్టర్‌ వరలక్ష్మి, 5, 6వ వార్డు కౌన్సిలర్లు వేముల కృష్ణ, బొమ్మనబోయిన నాగరాజు, బండారు  పెదవీరయ్య, వేముల ఏడుకొండలు, ఓర్చు వెంకటేశ్వర్లు, అక్కినపల్లి బాలయ్య, నర్రా పుల్లయ్య, పగడాల భాస్కరరావు, రుద్రాల అచ్చారావు, తదితరులున్నారు. 


Updated Date - 2022-08-20T05:56:31+05:30 IST