మీటర్లతో రైతాంగానికి తీవ్ర నష్టం : వడ్డే

ABN , First Publish Date - 2020-10-17T21:19:00+05:30 IST

వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగింపు రైతాంగానికి.. మరీ ముఖ్యంగా బోరు సేద్యంతో వ్యవసాయం చేసే

మీటర్లతో రైతాంగానికి తీవ్ర నష్టం : వడ్డే

అనంతపురం : వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగింపు  రైతాంగానికి.. మరీ ముఖ్యంగా బోరు సేద్యంతో వ్యవసాయం చేసే వారికి తీవ్ర నష్టమని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇవాళ అనంతలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మీటర్ల బిగింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకానికి గండికోట్టే ప్రయత్నం చేయడం తగదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఈ విధంగా చేయడం సమంజసం కాదన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. 


రద్దు చేయాల్సిందే..

రాష్ట్రంలో ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా అప్రజాస్వామ్యికంగా చేయడం కరెక్టు కాదు. 300 రోజులుగా శాంతియుతంగా రాజధానికోసం ఆందోళన చేస్తున్నా వారితో చర్చించడం లేదు. రాయలసీమ ప్రాంతంలో కరోనా వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ ప్రభుత్వం ఆదుకోవడం లేదు. రాయలసీమ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఈ వైఖరిని విడనాడి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. స్మార్ట్ మీటర్లు పెట్టినట్లయితే రైతులు, కౌలు రైతులకు చెప్పలేనంత నష్టం జరుగుతుంది. రాష్ట్రంలో 18 లక్షల పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కలను హరిస్తూ అమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను తప్పనిసరిగా రద్దు చేయాల్సిందే. దేశ వ్యాప్తంగా 250 రైతు సంఘాలు కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. బీజేపీ అనుబంధ రైతు సంఘాలు మినహా అందరూ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు అని మాజీ మంత్రి వడ్డే చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-10-17T21:19:00+05:30 IST