వద్దన్నా.. వరివైపే మొగ్గు!

ABN , First Publish Date - 2021-12-03T06:36:59+05:30 IST

ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనబోమని వరిసాగును తగ్గించాలని ప్రకటనలు చేస్తున్నా.. జిల్లాలో మాత్రం రైతులు వరి సాగుకే మొగ్గుచూపుతున్నారు. నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులతోపాటు చెరువులు, కుంటల్లో కూడా పుష్కలంగా నీరున్న పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దంటే ఎలా అని రైతులు వాపోతున్నారు.

వద్దన్నా..  వరివైపే మొగ్గు!

జిల్లాలో వరిసాగుకే ఆసక్తి చూపుతున్న అన్నదాతలు

ధాన్యం కొనుగోలు చేయబోమంటున్న రాష్ట్ర ప్రభుత్వం

జిల్లాలో నేలలు వరికి మాత్రమే అనుకూలంగా ఉన్నాయంటున్న రైతులు

ఇప్పటికే పలు ప్రాంతాల్లో నారుమళ్లు సిద్ధం చేసుకున్న అన్నదాతలు

నిజామాబాద్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనబోమని వరిసాగును తగ్గించాలని ప్రకటనలు చేస్తున్నా.. జిల్లాలో మాత్రం రైతులు వరి సాగుకే మొగ్గుచూపుతున్నారు. నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులతోపాటు చెరువులు, కుంటల్లో కూడా పుష్కలంగా నీరున్న పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దంటే ఎలా అని రైతులు వాపోతున్నారు. ఇప్ప టివరకు వరిసాగు చేసిన పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు ఏవిధంగా పండుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు సూచించిన ఏ ఆరుతడి పంట కూడా వరిపొలాల్లో పండే అవకాశం లేదంటున్నారు. పొలాలన్నీ జాలుపట్టి ఉన్న సమయంలో వరి ఒక్కటే తప్ప ఏ పంట పండదని వారంటున్నారు. నీళ్లు ఉన్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టింపులకు పొకుండా తమకు వరి వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే బోధన్‌ డివిజన్‌లో మాత్రం రైతులు ఇప్పటికే నారుమడులను సిద్ధం చేస్తున్నారు. అయితే వరి సాగుచేస్తే వ్యాపారులు, మిల్లర్లు కొనుగోలు చేస్తారని రైతులు భావిస్తున్నా పంటచేతికి వచ్చిన తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆరు తడి పంటలు కొంతమొత్తంలో సాగుచేస్తే తప్ప రైతులు బయటపడే పరిస్థితి కనిపించడంలేదు.

ఫ వ్యాపారులతో రైతుల ఒప్పందాలు..

జిల్లాలోని బోఽధన్‌ డివిజన్‌లో రైతులు సన్న రకాలను ప్రతి సీజన్‌లో క్వింటాలు 1500 లోపు వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు. యాసంగిలో కొనకుంటే మిల్లర్లు వ్యాపారులు ధరలు భారీగా తగ్గించే అవకాశం ఉంది. ముందే వ్యాపారులు, మిల్లర్‌లతో బైబ్యాక్‌ పద్ధతిలో ఒప్పందాలు చేసుకుంటే కొనుగోలుకు ఇబ్బందులు తప్పనున్నాయి. ఎర్రజొన్న, సజ్జ పండించే రైతులు ముందే వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వరిలోను విత్తనోత్పత్తిచేసే రైతులు కూడా బైబ్యాక్‌ పద్ధతిలో అదే రీతిలో ఒప్పందాలు చేసుకుని పంటలు వేస్తున్నారు. 

ఫ 3.75 లక్షల ఎకరాలకుపైగా సాగు..

జిల్లాలో ఏటా యాసంగిలో 3లక్షల 75వేల ఎకరాలకుపైగా సాగవుతోంది. శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండడం, గుత్ప అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లు అందించడం వల్ల వరిసాగు పెరుగుతోంది. వీటితో పాటు బోర్‌వెల్‌ కింద సాగు ఎక్కువగా చేయడం వల్ల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలో ప్రతీ సీజన్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఐదున్నర లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5లక్షల 87వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇవేకాకుండా వ్యాపారులు కూడా రెండున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేశారు. గంగా కావేరి, తెలంగాణ, ఇతర రకాలను రాష్ట్రంలోని ఇతర జిల్లాల వ్యాపారులతో పాటు కర్ణాటక, ఏపీ నుంచి వచ్చినవారు కొనుగోలు చేశారు. జిల్లాలో యాసంగిలోనూ వానాకాలంలాగానే 3లక్షల 85వేల ఎకరాలకుపైగా సాగవుతే ఇబ్బం ది ఏర్పడనుంది. ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే వ్యాపారులు, మిల్లర్‌లు అంతమొత్తంలో కొనే పరిస్థితి కనిపించడంలేదు. జిల్లాలో ప్రతీ సీజన్‌లో ఎనిమిదిన్నర లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుంది. యాసంగిలో కూడా 8లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

ఆరుతడి పంటలకు 

ప్రాధాన్యమివ్వాలి

నిజామాబాద్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఈ యాసంగిలో ఆరుతడి పంటలకు ప్రాధాన్యమివ్వాలని వరి తగ్గించి ఇతర పంటలను సాగుచేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని, వారికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాల ని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూ చించారు. కలెక్టరేట్‌లో గురువారం వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, వ్యవసాయశాస్త్రవేత్తలు, రైస్‌మిల్లర్‌లు, రైతుబంధు ప్రతినిధులు, విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. యాసంగిలో పండించే ధాన్యాన్ని ప్రభుత్వం కొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు.  శనివారం నుంచి అన్ని గ్రామాల పరిధిలో కా ర్యక్రమాలను ఏర్పాటు చేసి శాస్త్రవేత్తలు వ్యవసాయ అనుబంధశాఖల అధికారులు రైతులకు వివరించాలన్నారు. జిల్లా రైతులు ఇతర జిల్లాల రైతులకంటే చైతన్యవంతులని లాభాలు పంటలైన పసుపు, సోయా, ఎర్రజొన్న, ఇతర పంట లు సాగుచేస్తున్నారన్నారు. వానాకాలంలో 3.87లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారన్నారు. జిల్లాలో 7.87 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. యాసంగిలో బాయిల్డ్‌రైస్‌ అవకాశం లేదని చర్చ జరుగుతున్న నేపథ్యంలో రైతులు వరిపంట ఎక్కువగా వేసి ఇబ్బందులు పడవద్దని కలెక్టర్‌ అన్నారు. రైతులు ఒకే రకం పంట సాగుచేయడం వల్ల భూమిసారం కోల్పోతుందని ఏడీఏ వాజీద్‌హుస్సేన్‌ అన్నారు. పంటల మార్పిడీకి శాస్త్రీయ కారణాలు ఉన్నాయన్నారు. జిల్లాలో డిసెంబరు నుంచే యాసంగి ప్రారంభం అవుతుందని వ్యసాయశాఖ వేత్త డాక్టర్‌ నవీన్‌ అన్నారు. మొక్కజొన్న సాగుచేస్తే దిగుబడి బాగా వస్తుందన్నారు. రైతులు సన్నాలు వేసినా.. ఏప్రిల్‌ 15లోగా పంట వ స్తుందన్నా రు. కూరగాయ ల సాగుకు యా సంగి అనుకూలంగా ఉంటుందని ఉద్యానవనశాఖ అధికారి నర్సింగదాసు అన్నారు.

ఫ ఆయిల్‌పాంకు సబ్సిడీ..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పాం పంటలకు సబ్సిడీ ఇస్తు న్నాయన్నారు. జిల్లాలో 50వేల ఎకరాల్లో ఈ పంట సాగుచేసేందుకు అనుమతులు ఇచ్చారన్నారు. చెరువుల కింద చేపల పెంపకం లాభదాయకంగా ఉంటుందని మ త్స్యశాఖ జిల్లా అధికారి ఆంజనేయస్వామి అన్నారు. జిల్లాలో పండిస్తున్న వరిలో సగానికిపైగా ప్రజల అవసరాలకు వినియోగిస్తున్నామని రైస్‌ మిల్లర్‌ల సంఘం కార్యదర్శి మోహన్‌రెడ్డి అన్నారు. సమావేశంలో జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షురాలు మంజూల, జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవింద్‌, జిల్లా మార్క్‌ఫెడ్‌ డీఎం రంజిత్‌రెడ్డి, విత్తన కార్పొరేషన్‌ డీఎం విష్ణువర్ధన్‌రెడ్డి, షుగర్‌కేన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రవి, వ్యవసాయశాస్త్రవేత్త బాలా జీ తదితరులు పాల్గొన్నారు.

వర్నిలో నాట్లు షురూ

ఫ యాసంగికి సడలింపు ఇవ్వాలని డిమాండ్‌ 

వర్ని, డిసెంబరు2: యాసం గిలో వరి పంట సాగు చేయొ ద్దని అందుకు కొనుగోలు కేంద్రాలు ఉండవంటూ సీఎం కేసీఆర్‌ ప్రకటించినా అన్నదా తలు మాత్రం వరి పంటవైపే మొగ్గు చూపుతున్నారు. ధాన్యం విక్రయాల్లో తేడాలు వస్తే తాడోపేడో తేల్చుకుంటామని కర్షకు లు తేల్చిచెబుతున్నారు. వర్ని ఉమ్మడి మండలంలో వరి నాట్లను ముమ్మరంగా వేస్తున్నారు. వానాకాలంలో గులాబ్‌ తుఫా న్‌ కారణంగా ఎకరాకు 35 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 20 నుంచి 22 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. దిగుబడి కోల్పోవడంతో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఒక ఎకరానికి ఏడాది కౌలు సాగుపై 23 క్వింటాళ్ల చొప్పున ఒప్పంద సాగుచేశారు. దీంతో వానకాలం సాగుకు 70 కిలోల భర్తీపై 21 క్వింటాల్‌లు భూ యజమానికి నష్టమొచ్చినా కౌలు డబ్బులు చెల్లించారు. దీంతో యాసంగి సాగుకు ఎకరాకు తొమ్మిది క్వింటాళ్లు సాగు చేసినా, చేయకపోయినా భూ యజమానికి కౌలుదారు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో కౌలు రైతులు ఈ యాసంగిలో వరి సాగు చేయక తప్పడం లేదు. ప్రభుత్వ ప్రకటన దడ పుట్టిస్తున్నా ప్రత్యామ్నాయ పంటలు సాధ్యం కాదని అందుకు వేరుశనగ, పొద్దు తిరుగుడు వంటి విత్తనాలు అందు బాటులో లేవని రైతన్నలు వాపోతున్నారు. వరికోత యంత్రాల  గాట్లు, నీరు పుష్కలంగా ఉండటం వల్ల పంట దుక్కులు రావడం లేదని ఆందోళన చెందుతు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో పునరాలోచించి వానకాలం పంట నష్టం కారణంగా యాసంగిలో వరి సాగుకు అవకాశం కల్పించాలని కర్ష కులు కోరుతున్నారు. రైతులకు భరోసాగా ఉండాల్సిన అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తూ గందరగోళం సృష్టించడం పట్ల అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

18 ఎకరాలు కౌలు చేశాను : లకావత్‌ శ్రీను, సుద్దులం తండా, కౌలు రైతు 

మాది కోటగిరి మండలం సుద్దులం తండా. వర్ని శివారులో ఓ రైతుకు చెందిన 18 ఎకరాల భూమిని ఎకరానికి 32 బస్తాలు 70 కిలోల భర్తీపై ఒప్పంద మేరకు కౌలుకు సాగు చేశాను. వర్షాకాలంలో గులాబ్‌ తుఫాన్‌ను కారణంగా కోత దశలో కొంకి ఏర్పడి ఎకరానికి 25 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. దీంతో ఒక ఎకరంపై సుమారు 18 క్వింటాళ్లు నష్టమొచ్చింది. ఫలితంగా ఒప్పందం ప్రకారం భూ యజమాని వానాకాలం 14 క్వింటాలు చొప్పున డబ్బులు కట్టేశాను. యాసంగి సాగు 15 బస్తాలు 70 కిలోల భర్తీ బాకీపడి ఉన్నాను. ఉన్న ఫలంగా నాట్లు వద్దంటే ఆత్మహత్యలే శరణ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టింపులకు పోకుండా ఈ  యాసంగిలో పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.

వరి తప్ప.. మరో ప్రత్యామ్నాయం లేదు : నారాయణరావు,  వర్ని, రైతు

వరి అంటే వర్ని అనే పేరు ప్రఖ్యాతలు గల ప్రాంతం మాది. మా ప్రాంతమంతా వరి పంట సాగుకే అనుకూలంగా ఉంది. ప్రస్తుతం వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో వరి సాగు చేయాల్సి వస్తోంది. ఒకవేళ వేరుశనగ, పొద్దు తిరుగుడు పంట వేయాలన్నా అందుకు భూములు ఇప్పటికే నీరు పట్టి దుక్కిరాని దుస్థితి నెలకొంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు, చెరువుల్లో నీటి పుష్కలం కారణంగా ఇతర పంటల సాగు సాధ్యం కావడం లేదు. వరి సాగు వద్దనడంతో కౌలు రైతులు సాగుకు ముందుకు రాక చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఒక్కసారైనా వరి సాగుకోసం అవకాశం కల్పించాలి. 

Updated Date - 2021-12-03T06:36:59+05:30 IST