వాడవాడలా భోగి సంబరం

ABN , First Publish Date - 2022-01-14T05:30:00+05:30 IST

భోగి పండుగ పల్లె లోగిళ్లలో కొత్త సందడి తెచ్చింది. పట్టణాలలో సైతం వేకువజామునే వీధి.. వీధిలో భోగి సందడి కనువిందు చేసింది. చలితీవ్రత ఉన్నప్పటికీ భోగి మంటను తనివితీరా ఆస్వాదించేందకు వీలుగా పిల్లలు, పెద్దలు ఉత్సాహం చూపారు.

వాడవాడలా భోగి సంబరం
కడపలోని విజయదుర్గమ్మ కాలనీలో ఆటపాటల ఉత్సాహం

కడప(మారుతీనగర్‌/సంబేపల్లె), జనవరి 14: భోగి పండుగ పల్లె లోగిళ్లలో కొత్త సందడి తెచ్చింది. పట్టణాలలో సైతం వేకువజామునే వీధి.. వీధిలో భోగి సందడి కనువిందు చేసింది. చలితీవ్రత ఉన్నప్పటికీ భోగి మంటను తనివితీరా ఆస్వాదించేందకు వీలుగా పిల్లలు, పెద్దలు ఉత్సాహం చూపారు. మూడు రోజుల పండుగను జరుపుకునేందుకు వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా పల్లెలకు చేరి బంధువులు, చిన్ననాటి స్నేహితులతో కలిసి భోగిమంటల వద్ద ఆనందంగా గడిపి గత స్మృతులు నెమరువేసుకున్నారు. సంక్రాంతి మహిళల్లో కొత్త జోష్‌ తెచ్చింది. తెల్లవారక ముందే వీధుల్లో మహిళలు కొత్తకొత్త రూపులతో రంగవల్లులు తీర్చిదిద్దారు. కాగా.. శనివారం పెద్దల పండుగ జరుపుకోనున్నారు. సంక్రాంతిలో ఇదే ప్రధాన పండుగ. తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముంగిట కల్లాపిచల్లి రంగవళ్లులను మహిళలు తీర్చిదిద్దుతారు. కొత్తబట్టలు ధరించి తమ పెద్దలకు స్మృతిగా వారికి ఇష్టమైన వాటిని వారి సమాధుల వద్ద ఉంచి అర్పిస్తారు. 

సంప్రదాయానికి నిలయం పల్లెటూళ్లు : రోజా

సంస్కృతి, సంప్రదాయాలకు పల్లెటూళ్లు నిలయమని, ఇక్కడ బంధుమిత్రుల మధ్య సంక్రాంతి పండుగ చేసుకోవడం ఆనందంగా ఉందని సినీనటి, నగిరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తెలిపారు. సంక్రాంతి సందర్భంగా కడప జిల్లా శెట్టిపల్లె గ్రామం తిమ్మక్కగారిపల్లెలో ఆమె సోదరుడు మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఉపేంద్రారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు కవిత, ఆమె భర్త రమే్‌షనాధరెడ్డి ఇంటికి రోజా కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రే చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే లేచి అందరితో కలసి భోగిమంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. 


భోగిమంటల్లో పీఆర్సీ, ఓటీఎస్‌ ప్రతులు 

కడప(ఎడ్యుకేషన) / పోరుమామిళ్ల, జనవరి 14: యూటీఎఫ్‌ కడప జిల్లా కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం సీఎస్‌ కమిటీ పీఆర్‌సీ నివేదికను భోగి మంటల్లో వేశారు. అనంతరం యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా మాట్లాడుతూ బకాయి డీఏలు, ఇచ్చి జీతాలు ఎవరికీ తగ్గవని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఉన్న హెచఆర్‌ఏ స్లాబులు మార్చి ఉద్యోగులను ఆర్థికంగా దెబ్బ తీయటమేనన్నారు. ఫ్యాప్టో పిలుపుమేరకు ఈ నెల 20వ తేదీన కలెక్టరేట్‌ల ముట్టడి, 28వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. అలాగే పోరుమామిళ్లలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయం ఎదుట సీఎస్‌ కమిటీ రిపోర్టు ప్రతులను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ అన్యాయమైన అశాస్త్రీయమైన 23 శాతం ఫిట్మెంట్‌ను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమన్నారు. 


కమలాపురం (రూరల్‌) / ఖాజీపేట, జనవరి 14: ఓటీఎస్‌ జీవో కాపీలను శుక్రవారం టీడీపీ నేతలు భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్యసాయినాథశర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేద ప్రజానీకానికి ఓటీఎస్‌ గుది బండలా మారిందన్నారు. ప్రజల నుంచి బలవంతపు వసూళ్లు లేవని, చెబుతూనే జిల్లా కలెక్టర్లు కిందిస్థాయి అధికారులకు లక్ష్యాలు నిర్దేశిస్తూ ప్రజ ల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం హేయమైన చర్య అన్నారు. అలాగే కడప అసెంబ్లీ టీడీపీ ఇన్చార్జి వీఎస్‌ అమీర్‌బాబు ఆధ్వర్యంలో ఓటీఎస్‌ కాపీలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు.  ఖాజీపేట మండలం దుంపలగట్టులో ఓటీఎస్‌ జీవో ప్రతులను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు.




Updated Date - 2022-01-14T05:30:00+05:30 IST