వదల బొమ్మాళీ.. వదల!’

ABN , First Publish Date - 2022-06-14T06:10:00+05:30 IST

పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ, ఈ ధోరణిని కొవిడ్‌ నాలుగో వేవ్‌కు సూచనగా భావించవలసిన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు.

వదల బొమ్మాళీ.. వదల!’

పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ, ఈ ధోరణిని కొవిడ్‌ నాలుగో వేవ్‌కు సూచనగా భావించవలసిన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. అప్రమత్తం కావలసినంత తీవ్రమైన కొత్త వేరియెంట్లు ఇప్పటివరకూ వెలుగులోకి రాకపోయినా, జీవితాంతం కొవిడ్‌తో కలిసి జీవించడాన్ని అలవాటు చేసుకోవాలనీ, ఇతరత్రా ఫ్లూ వైర్‌సల మాదిరిగానే కొవిడ్‌ను కూడా భావించాలనీ వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందడం కోసం కొవిడ్‌ నియమాలు కచ్చితంగా పాటించాలని కూడా వైద్యులు అంటున్నారు.


సహజీవనం తప్పదు

తరత్రా ఫ్లూ వైర్‌సల మాదిరిగానే కరోనా వైరస్‌ కూడా వాతావరణంలో తిష్ఠ వేసుకుని, అంతో ఇంతో ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతూనే ఉంటుంది. మరో పదేళ్ల తర్వాత ఈ వైరస్‌ తన రూపాన్నీ, తీవ్రతనూ మార్చుకునే అవకాశాలూ లేకపోలేదు. ఈ వైరస్‌ వ్యాప్తి పెరిగినప్పటికీ, తీవ్రత తక్కువగానే ఉంటుంది. ఇప్పటివరకూ వెలుగులోకి వస్తున్న వేరియెంట్లన్నీ ఒమైక్రాన్‌ బిఎ4, బిఎ5 సబ్‌ వేరియెంట్లే! కాబట్టే సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలే రోగుల్లో కనిపిస్తున్నాయి తప్ప 2021 నాటి డెల్టా వేవ్‌లోని తీవ్రమైన లక్షణాలు కనిపించడం లేదు. అయితే ఈ మైల్డ్‌ వేరియెంట్‌ కూడా వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండే కొ మార్బిడ్‌ (మధుమేహం, అధిక రక్తపోటు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు), పెద్దలకు రిస్క్‌గా పరిణమించే వీలుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండక తప్పదు. 


విజృంభణ అందుకే!

బస్‌ టర్మినళ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలలో నెలకొనే జనసమ్మర్థం వల్లే కొవిడ్‌ కేసులు విజృంభిస్తున్నాయి. స్కూళ్లు, ఆఫీసులు తిరిగి మొదలవడం మూలంగా ప్రయాణాలు తగ్గి, కొవిడ్‌ కేసులు తగ్గవచ్చు. లేదా లక్షణాలు కనిపించని ప్రయాణీకులు ఆఫీసులకూ, స్కూళ్లకూ వెళ్లడం మొదలుపెట్టడం వల్ల వైరస్‌ ఇతరులకు వ్యాపించి, కేసులు పెరగవచ్చు అని వైద్యులు అంటున్నారు. అయితే ప్రస్తుతం కొవిడ్‌ కేసులన్నీ చెదురు మదురుగా, స్వల్ప లక్షణాలతో వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి ఆస్పత్రిలో చేరడం, ఆక్సిజన్‌ అవసరం పడడం లాంటి పరిస్థితులు ఉండకపోవచ్చనీ, అయినప్పటికీ మాస్క్‌, శానిటైజర్‌ వాడకం, భౌతిక దూరం పాటించడం లాంటి కొవిడ్‌ నియమాలను కొనసాగించడం అవసరమనీ వైద్యులు చెప్తున్నారు. 

Updated Date - 2022-06-14T06:10:00+05:30 IST