టీకా.. ఎంచక్కా!

ABN , First Publish Date - 2021-01-21T04:42:49+05:30 IST

కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన టీకా వేసే కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది.

టీకా.. ఎంచక్కా!
కరోనా టీకా వేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది (ఫైల్‌)

ఇప్పటికే 8వేలకు మందికిపైగా..

ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో ప్రజల్లోనూ ఆసక్తి

32 నుంచి 100 కేంద్రాల పెంపును శ్రీకారం

త్వరలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ టీకాకు శ్రీకారం


నెల్లూరు(వైద్యం) జనవరి 20 : కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన టీకా వేసే కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. మొదట్లో టీకాపై అనేక సందేహాలు  ఉత్పన్నమైనా టీకా వేయించుకున్నవారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన జిల్లాలో కరోనా టీకా వేసే కార్యక్రమం మొదలవగా, ముందుగా కరోనా సమయంలో బాధితులకు సేవలు అందించిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, సిబ్బందికి అవకాశం ఇచ్చారు. మొత్తం 29,500 మందికి టీకా వేయాలని నిర్ధారించగా, ఇందుకోసం ప్రభుత్వం జిల్లాకు 38,500 డోసుల వ్యాక్సిన్‌ను కేటాయించింది. అప్పటినుంచి ఇప్పటివరకు 8వేల మందికిపైగా టీకా వేశారు. ఇదిలా ఉంటే టీకా వేయించుకున్న వారిలో కేవలం ముగ్గురు మాత్రమే చిన్నపాటి జ్వరం, జలుబు వంటి లక్షణాలు వచ్చాయి. ప్రస్తుతం వారు కూడా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. 


100 కేంద్రాల ద్వారా..


జిల్లావ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాల ద్వారా కరోనా టీకా వేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  16వ తేదీ నుంచి 26 ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేయగా, 19న మరో ఆరు కేంద్రాలను పెంచారు. అయితే, దూర ప్రాంతవాసులకు అనువుగా ఉండాలన్న ఉద్దేశంతో కలెక్టర్‌ చక్రధర్‌బాబు కేంద్రాలను పెంచారు. బుధవారం జిల్లాలోని 46 మండలాల్లో కరోనా టీకా వేసేలా వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఆరోగ్య కేంద్రాలను పెంచారు. ఇదిలా ఉంటే కరోనా టీకా లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అధికారులు జిల్లావ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాలలో టీకా వేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు నెల్లూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రులలోనూ ఈ టీకా వేసేలా సంప్రదింపులు జరుగుతున్నాయి. 


జిల్లావ్యాప్తంగా టీకా కేంద్రాల పెంపు 


కరోనా టీకా వేసే కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా పెంచుతున్నాం. ఇందులో ప్రైవేట్‌ ఆసుపత్రులకు భాగస్వామ్యం కలిగిస్తున్నాం. ఆయా ఆసుపత్రులలో ప్రభుత్వ వైద్య సిబ్బంది ఉండి తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి కరోనా టీకా వేస్తారు. మొత్తం 100 ఆరోగ్య కేంద్రాలలో కరోనా టీకా వేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం.

- డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో


 4 కరోనా కేసుల నమోదు


నెల్లూరు (వైద్యం) : జిల్లాలో బుధవారం  4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో  మొత్తం కేసుల సంఖ్య 63,835లకు చేరుకున్నాయి. అలాగే  కరోనా నుంచి కోలుకున్న 14 మంది బాధితులను అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.

Updated Date - 2021-01-21T04:42:49+05:30 IST