‘టీకా’లం వీరులు..!

ABN , First Publish Date - 2021-01-17T06:28:17+05:30 IST

గ్రేటర్‌లో తొలిరోజు వాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతమైంది.

‘టీకా’లం వీరులు..!
గాంధీ ఆసుపత్రిలో మొదటి టీకా తీసుకున్న సఫాయి కార్మికురాలు కిష్టమ్మతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి ఈటల, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తదితరులు

కదిలిన కరోనా సైన్యం

కరోనా వ్యాధి పీడితులకు సేవలందించిది వారే..

ఇప్పుడు టీకాలు తీసుకోవడంలో ముందుందీ వారే..

ప్రభుత్వ ఆసుపత్రులలో పండగలా ‘వాక్సినేషన్‌’

అనేక ఆస్పత్రులలో తొలి టీకా సఫాయి కార్మికులకే..

కొన్ని చోట్ల సూపరింటెండెంట్లే ‘ఫస్ట్‌’

మరికొన్ని చోట్ల ఆయమ్మల చొరవ

భయాన్ని పక్కనబెట్టి.. బాధ్యతను చేపట్టిన వ్యాక్సిన్‌ వీరులు 

 వైద్య చరిత్రలో నగరం రాసిన సువర్ణాక్షరాలు ఇవి. ప్రభుత్వాసుప్రతులు, సిబ్బంది వేసిన వ్యాక్సినేషన్‌ ‘తొలి’ అడుగు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోనుంది. చాలా మంది నిత్యం చులకనగా, చీదరించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది వ్యాక్సినేషన్‌ ఘట్టాన్ని విజయవంతంగా ప్రారంభించారు. కరోనాపై పోరాడుతున్న సైనికుల ఖాతాలో మరో ఘన విజయం నమోదు అయింది. 

అడ్డగుట్ట/బర్కత్‌పుర/బాలానగర్‌/మలక్‌పేట/రాజేంద్రనగర్‌/ మంగళ్‌హాట్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో తొలిరోజు వాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతమైంది. మొదటి రోజు మొత్తం 1,020 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ధారించుకోగా, వివిధ కారణాలతో 71 మంది దూరంగా ఉ న్నారు. జాబితాలో గర్భిణులు, బాలింతలు ఉండటంతో వారికి టీకాలు వేయలేదు. గాంధీ ఆసుపత్రిలో వాక్సినేషన్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు.  ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు, కలెక్టర్‌ శ్వేతా మహంతి, ప్రిన్సిపల్‌ కార్యదర్శి రిజ్వీ, నగర కమిషనర్‌ అంజనీకుమార్‌, ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. గాంధీ ఆసుపత్రిలోని అజిల్‌ గ్రూప్‌నకు చెందిన సఫాయి కార్మికురాలు కిష్టమ్మకు మొదటి టీకా వేశారు. ఒకరికి టీకా ఇచ్చిన 8 నిమిషాల తర్వాత మరొకటి చొప్పున మధ్యాహ్నం 2గంటలలోపు 30మందికి టీకా ఇచ్చి నట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తెలిపారు. ఆసుపత్రిలో మొదటి దఫాలో మూడు వేల మందికి సరిపడా వ్యాక్సిన్‌ సిద్ధంగా ఉందన్నారు. టీకా నిల్వ ఉంచేందుకు ఎక్కడా లేనటు వంటి ఫ్రీజర్‌ బాక్స్‌లు గాంధీ ఆసుపత్రిలో రెండు ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గాంధీ ఆసుపత్రి వైద్యులతో సుమారు 40 నిమిషాల పాటు ఇంట్రాక్ట్‌ అయ్యారని, దేశంలో అన్ని కేంద్రాల్లో ప్రధాని మోదీ కొద్దిసేపే మాట్లాడితే, గాంధీ వైద్యులతో చాలా సేపు మాట్లాడారని వివరించారు.  

కింగ్‌కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. టీకా తీసుకునేవారు సకాలంలో వచ్చినా, ఎమ్మెల్యే రాజాసింగ్‌ వచ్చిన తర్వాత 11.43 గంటలకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేందర్‌నాథ్‌ తొలి టీకా ఇచ్చారు. 

మలక్‌పేట ప్రభుత్వ  ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే బలాల రాక ఆలస్యం కారణంగా 12 గంటలకు వాక్సినేషన్‌ ప్రారంభమైంది. 

మొదటి టీకా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వేసే సమయంలో నర్స్‌ తడబాటుతో వేయలేకపోయారు. దీంతో మరొకరు వేయాల్సి వచ్చింది. 

ఉస్మానియా ఆసుపత్రికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ వచ్చి, వాక్సిన్‌ తీసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. 

ఉస్మానియా ఆసుపత్రిలో వాక్సినేషన్‌ చేయించుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని క్లినికల్‌ ఫార్మకాలజిస్ట్‌ డాక్టర్‌ జి శ్రీనివాస్‌ తెలిపారు.  

కొవిడ్‌ వచ్చిపోయింది...

 గత నవంబర్‌ 24న కొవిడ్‌ బారిన పడ్డాను. డిసెంబర్‌ 15న నెగెటివ్‌ వచ్చింది. నెల రోజుల తర్వాత వాక్సిన్‌ తీసుకున్నాను. ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. 

 - డాక్టర్‌ మల్లికార్జున్‌, కొవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌, కింగ్‌కోఠి ఆస్పత్రి

కొద్దిగా నొప్పి అనిపించింది... 

వ్యాక్సిన్‌ వేసిన తర్వాత కుడి చేయి కొద్దిగా నొప్పి అనిపించింది. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవు. ఆశావర్కర్లందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలి. 

స్వాతి, ఆశావర్కర్‌(కింగ్‌ కోఠి ఆస్పత్రిలో టీకా తీసుకున్నారు)

జయహో భారత్‌

మన దేశంలో రూపొందించిన వ్యాక్సిన్‌ తీసుకోవడం నాకెంతో గర్వంగా, ఆనందంగా ఉంది. వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు, ధైర్యంగా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. వ్యాక్సిన్‌ సక్సెస్‌ అయ్యింది. జయహో భారత్‌.  

ఎంవీ రాణి, సీనియర్‌ సిస్టర్‌, బాలనగర్‌ పీహెచ్‌సీ 

ఆందోళన అవసరం లేదు

వాక్సిన్‌ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. టీకా తీసుకున్న అనంతరం అరగంట పాటు అబ్జర్వేషన్‌లో ఉన్నాను. ఆ సమయంలో  ఏ విధమైన ఇబ్బంది కలుగలేదు. ప్రభుత్వ సూచనల మేరకు దశల వారీగా వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేస్తాం. మొత్తం 2,700 మందికి ఉస్మానియాలో వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. అందరూ వ్యాక్సినేషన్‌కు ముందుకు రావాలి. 

- డాక్టర్‌ నాగేందర్‌, ఉస్మానియా సూపరింటెండెంట్‌

రంగారెడ్డి జిల్లాలో 26వేల మందికి టీకా వేస్తాం 

రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సుమారు 26వేల ఆరోగ్య సిబ్బంది ఉన్నట్లు గుర్తించాం. వారందరికి టీకా వేస్తాం. శనివారం  23మందికి టీకా ఇచ్చాం. సోమవారం నుంచి ఒక్కో కేంద్రంలో వంద మంది చొప్పున టీకా వేస్తాం. రెండో టీకా బూస్టర్‌ డోస్‌ 28 రోజుల తర్వాత ఇస్తాం. ముందుగా వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది తర్వాత జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌, పోలీస్‌ సిబ్బందికి టీకాను వేస్తాం. ఆ తర్వాత 50 ఏళ్లు పై బడిన వారందరికి టీకా వేయాలని ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. 

డాక్టర్‌ సుభాష్‌ చంద్ర బోస్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ

కరోనా తరిమేయడానికి వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గం

 కరోనాను తరిమివేయడానికి వ్యాక్సిన్‌ ఒకటే ప్రధానమైన మార్గం. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మొదట ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కి తర్వాత అందరికీ వ్యాక్సిన్‌ అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రపంచం మొత్తం సంవత్సరకాలంపాటు పడ్డ ఇబ్బందులకు ఈ వ్యాక్సిన్‌తో తెరపడనుంది. 

డాక్టర్‌ మహబూబ్‌ ఖాన్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌, ఎర్రగడ్డ 



Updated Date - 2021-01-17T06:28:17+05:30 IST