ఆరు మెగా శిబిరాల్లో 1.32 కోట్ల మందికి Vaccines

ABN , First Publish Date - 2021-10-25T17:37:31+05:30 IST

ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు రాష్ట్రప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం పేర్కొన్నారు. నగరంలో పోలియో నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా

ఆరు మెగా శిబిరాల్లో 1.32 కోట్ల మందికి Vaccines

69 శాతం మందికి తొలిడోసులు: మంత్రి సుబ్రమణ్యం వెల్లడి

చెన్నై/అడయార్: ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు రాష్ట్రప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం పేర్కొన్నారు. నగరంలో పోలియో నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఆదివారం ఏర్పాటు చేసిన సైకిల్‌ ప్రచారప్రయాణాన్ని మంత్రి సుబ్రమణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రపంచ పోలియో దినం సందర్భంగా ఈ ప్రాణాంతక వ్యాధిని సంపూర్ణంగా నశింపజేసిన ఘనత రోటరీ సంఘాలదేనని కొనియాడారు. పోలియో నివారణ మందు కనుగొన్న జోనాస్‌ సాల్క్‌ జయంతిని ప్రతి ఏటా ప్రభుత్వం తరఫున ఘనంగా జరుపుకుంటున్నామని, ఈ వేడుకల్లో నగరంలో ఉన్న రోటరీ సంఘాలు, లయన్స్‌ క్లబ్‌లు పాల్గొని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆరు మెగా ప్రత్యేక శిబిరాల ద్వారా సుమారు 1.32 కోట్ల మందికి కొవిడ్‌-19 కరోనా టీకా అందజేశామన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచనల మేరకు రాష్ట్రంలో మూడు వేలకు పైగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌ టీకా అందజేస్తోందన్నారు. రాష్ట్రానికి అవసరమైన టీకాలు కేంద్రప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్నాయన్నారు. మొత్తం ఆరు మెగా శిబిరాలకు గాను.. గత సెప్టెంబరు 12వ తేదీ 40 వేల ప్రాంతాల్లో 28.91 లక్షల మందికి,  19న 20 వేల ప్రాంతాల్లో 16.43 లక్షల మందికి, 26వ తేదీ 23 వేల కేంద్రాల్లో 25.04 లక్షల మందికి, ఈ నెల 3వ తేదీ 20 వేల కేంద్రాల్లో 17.19 లక్షల మందికి, 10న 32 వేల ప్రాంతాల్లో 22.52 లక్షల మందికి టీకాలు అందజేసినట్టు తెలిపారు. తొలివిడత డోసు వేయించుకున్న 69 శాతం మందికి సోమవారం నుంచి రెండవ డోసు టీకాలు అందించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 43 లక్షల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-10-25T17:37:31+05:30 IST