ప్రైవేటులో టీకాలు బంద్‌!

ABN , First Publish Date - 2021-06-15T08:51:46+05:30 IST

ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ త్వరలో నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రైవేటులో టీకాలు బంద్‌!

  • వ్యాక్సిన్ల కొనుగోలుపై స్పష్టత లేనందున నిలిచిపోయే అవకాశం
  • 25% వ్యాక్సిన్లను ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేసుకోవచ్చన్న కేంద్ర ప్రభుత్వం
  • అన్ని ఆస్పత్రులకు సమాన పంపిణీకి ఆదేశం
  • ఈ బాధ్యత ఎవరిదన్న దానిపై లేని స్పష్టత
  • 21లోపు మరోసారి మార్గదర్శకాల విడుదల!


హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ త్వరలో నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ల కొనుగోలుకు సంబంధించి ఉత్పత్తి కంపెనీల నుంచి స్పష్టమైన హామీ రావడంలేదని, దీంతో మున్ముందు తాము టీకాలు వేసే అవకాశాలు ఉండకపోవచ్చని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. మరోవైపు కొత్త వ్యాక్సిన్‌ విధానం వల్ల ప్రైవేటు ఆస్పత్రులకు టీకా సరఫరాపై తమకు కూడా స్పష్టత లేదని ఉత్పత్తి కంపెనీలు అంటున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల కొత్త వ్యాక్సిన్‌ విఽధానాన్ని ప్రకటించడం, ఉత్పత్తి కంపెనీల నుంచి 75 శాతం టీకాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుందని, 25 శాతం టీకాలను ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పడం తెలిసిందే.


అయితే ఇందుకోసం ముందుగా కేంద్రానికి డబ్బులు చెల్లించి, ఆ చెల్లింపుల మేరకు వ్యాక్సిన్లను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తమకు సూచించినట్లు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు ఇలా కొనుగోలు చేసే 25 శాతం టీకాలను చిన్న, పెద్ద ఆస్పత్రుల మధ్య సమానంగా పంపిణీ చేయాలని, అన్ని ప్రాంతాలను సమదృష్టిలో పెట్టుకుని సరఫరా జరగాలని కూడా కేంద్రం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే ఆ 25 శాతం టీకాల పంపిణీని అసమానతలు లేకుండా ఎవరు పంపిణీ చేయాలన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. వాస్తవానికి స్థానిక పరిస్థితుల ఆధారంగా ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాల్సివుంటుంది. దీనిపై ఈ నెల 21లోగా కేంద్రం మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పతుల కోటాను సమానంగా పంపిణీ చేసే విషయంలో స్పష్టత రానుందువల్లే కేంద్రం వారికి టీకాల సరఫరాను ఆపాల్సిందిగా ఉత్పత్తి కంపెనీలను ఆదేశించింది. 


ప్రైవేటుకు హామీనివ్వని ఉత్పత్తి కంపెనీలు

రాష్ట్రానికి చెందిన ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రులు వ్యాక్సిన్‌ను ఉత్పత్తి కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులు 15,01,063 మందికి వ్యాక్సిన్‌ వేశాయి. ప్రస్తుతం రోజుకు సగటున 50-60వేల మందికి టీకాలు వేస్తున్నాయి. కానీ, తాజాగా కేంద్రం ప్రకటించిన నూతన టీకా విధానం వల్ల ఆ వేగం కొనసాగే అవకాశం కనిపించడం లేదని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి ఎండీ ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. తాము చెల్లించిన మొత్తానికి నిష్పత్తి ఆధారంగా ఉత్పత్తి కంపెనీలు టీకాలు పంపాయని, కానీ.. ఇక నుంచి ఎన్ని డోసులు పంపుతారో చెప్పడం లేదన్నారు. ఇంకా చెప్పాలంటే ఉత్పత్తి కంపెనీలు  స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నాయని, టీకా సేకరణ కష్టంగా మారే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వాస్తవానికి దేశంలో పలుచోట్ల ప్రైవేటు ఆస్పత్రులు టీకా కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. వ్యాక్సిన్ల సరఫరాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉత్పత్తి సంస్థలు స్పష్టత ఇవ్వకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని అంటున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రైవేటుకు టీకా సరఫరాపై స్పష్టమైన మార్గదర్శకాలివ్వాలంటూ సీరం సంస్థ కేంద్రానికి లేఖ రాసింది. దీంతో వ్యాక్సిన్‌ కంపెనీలు కూడా కేంద్రం తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Updated Date - 2021-06-15T08:51:46+05:30 IST