Abn logo
Sep 21 2021 @ 01:13AM

వచ్చే నెల నుంచి విదేశాలకు టీకాలు

  • దేశ అవసరాలకు సరిపోగా మిగిలే డోసుల ఎగుమతి 
  • ‘వ్యాక్సిన్‌ మైత్రి’ పేరిట ఎగుమతుల డ్రైవ్‌ 
  • వచ్చే మూడు నెలల్లో 100 కోట్ల డోసుల ఉత్పత్తి: కేంద్రం
  • 24న క్వాడ్‌ సదస్సు నేపథ్యంలో భారత్‌ నిర్ణయం


 న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసిన భారత్‌.. విదేశాలకు టీకాల ఎగుమతిపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశ అవసరాలకు సరిపోగా మిగిలే టీకా డోసులను అక్టోబరు - డిసెంబరు త్రైమాసికం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన ఈవిషయాన్ని వెల్లడించారు.


‘వ్యాక్సిన్‌ మైత్రి’ పేరిట నిర్వహించనున్న ఎగుమతుల డ్రైవ్‌లో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ‘కోవ్యాక్స్‌’ కార్యక్రమానికి, పొరుగుదేశాలకు టీకా అందిస్తామని పేర్కొన్నారు. బయోలాజికల్‌-ఈతో పాటు పలు కంపెనీల టీకాలకు అనుమతులు మంజూరైన నేపథ్యంలో వచ్చే మూడు నెలల్లో మొత్తం 100 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ఈ నెల 24న అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరగనున్న ‘క్వాడ్‌’ కూటమి(భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా) సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు.


ఆ సదస్సు వేదికగా టీకా ఎగుమతుల నిలిపివేత అంశాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ లేవనెత్తే అవకాశాలున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ తాజా ప్రకటన చేసి ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37.78 లక్షల మందికి టీకాలివ్వడంతో.. ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌కు వినియోగించిన మొత్తం డోసుల సంఖ్య 81 కోట్లు దాటింది. 11 రోజుల్లో 10 కోట్ల డోసులతో వ్యాక్సినేషన్‌ జరిగింది. ఇందులోనూ 2.50 కోట్ల డోసులు ప్రధాని మోదీ పుట్టినరోజున (సెప్టెంబరు 17) ఇచ్చారు.