వ్యాక్సిన్‌ వర్రీ

ABN , First Publish Date - 2021-07-31T06:08:36+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి కొంత తగ్గుముఖం పట్టినా వ్యాక్సిన్‌ కోసం జనం పరుగులు పెడుతున్నారు. మొదట్లో అంతగా ఆసక్తి చూపించక పోయినా క్రమంగా వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన పెరగడంతో ముం దుకు వస్తున్నారు.

వ్యాక్సిన్‌ వర్రీ

జిల్లాలో రోజుల తరబడి తప్పని ఎదురు చూపులు

సెకండ్‌డోస్‌ వారికి కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌

థర్డ్‌వేవ్‌ భయంతో పెరిగిన డిమాండ్‌

అంతా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే అంటున్న వైద్య ఆరోగ్య శాఖ

ఆదిలాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి కొంత తగ్గుముఖం పట్టినా వ్యాక్సిన్‌ కోసం జనం పరుగులు పెడుతున్నారు. మొదట్లో అంతగా ఆసక్తి చూపించక పోయినా క్రమంగా వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన పెరగడంతో ముం దుకు వస్తున్నారు. కొవిడ్‌ సైట్‌లో వివరాలు నమోదు చేసుకుంటూ మొబైల్‌కు వచ్చిన సమాచారం ఆధారం గా వ్యాక్సిన్‌ సెంటర్లకు క్యూ కడుతున్నారు. కానీ ఫస్ట్‌డోసు మాత్రం ఇవ్వడం లేదంటూ అధికారులు తిప్పి పంపుతున్నారు. కేవలం వైరస్‌ ఉధృతి అధికంగా ఉన్న జిల్లాలోనే ఫస్ట్‌డోసును ఇస్తున్నా వైరస్‌ ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్న జిల్లాలో సెకండ్‌ డోసుతోనే సరిపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులతో ఫస్ట్‌డోస్‌కు ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లాలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 16,381 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వందకుపైగా మరణాలు సంభవించాయి. ఫస్ట్‌వేవ్‌లో కొంత భయం కనిపించినా సెకండ్‌వేవ్‌లో మా త్రం మరణాల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో థర్డ్‌వేవ్‌ వస్తుందన్న హెచ్చరికలతో జనం వ్యాక్సిన్‌ కోసం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అయితే ఫస్డ్‌ డోసు కావాలని అధికారులను ప్రశ్నిస్తే ప్రభుత్వ ఆదేశాలు లేవంటూ సమాధానమిస్తున్నారని పలువురు వాపోతున్నారు. 

కొందరికే వ్యాక్సిన్‌..

గడిచిన ఏడు మాసాల్లో జిల్లా వ్యాప్తంగా లక్షా 28వేల 276 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు. ఇందులో ఫస్ట్‌డోసు 96,717 మందికి, సెకండ్‌డోసు 31,559 మందికి వేశారు. ఈ లెక్కాన మరో రెండు మాసాల పాటు సెకండ్‌ డోసుకే సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో 29 వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు 150 మందికి వ్యాక్సిన్‌ వేయగా ఉట్నూర్‌, బోథ్‌, అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌, రిమ్స్‌లో 200 చొప్పున వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఇప్పటి వరకు ఫస్ట్‌డోసు 73 శాతం, సెకండ్‌ డోసు 59శాతం పూర్తయినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. జిల్లా జనాభా 7లక్షలకు పైగా ఉండగా ఇప్పటి వరకు లక్షా 50వేల లోపే వ్యా క్సిన్‌ అందించగలగారు. మి గతా 5లక్షలకు పైగా జనాభాకు వ్యాక్సిన్‌ వేసేందుకు మరో ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఈలోపు థర్డ్‌వేవ్‌ ముప్పు వస్తే ప్రమాదకరంగానే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మళ్లీ హెచ్చరికలు..

సెకండ్‌వేవ్‌ ముప్పు తప్పిందనుకుంటున్న సమయంలోనే మళ్లీ థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు రావడం చర్చనీయాంశంగా మారుతోంది. జిల్లాలోనూ క్రమంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం కొంత ఆందోళనకు దారి తీస్తోంది. గత నెలలో రోజుకు కేవలం ఒకటి రెండు పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదైన ప్రస్తుతం రోజుకు 3 నుంచి 5 పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. పొరుగు జిల్లా అయిన మంచిర్యాలలో భారీగా కేసులు పెరిగి పోవడం, ఆ జిల్లాకు నిత్యం రాకపోకలు కొనసాగడంతో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. అలాగే మహారాష్ట్రలో డెల్టా వైరస్‌ కేసులు వేగంగా పెరుగడంతో ముప్పు పొంచి ఉందన్న వార్తలు వస్తున్నాయి. థర్డ్‌వేవ్‌ వేగంగా విస్తరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం ఎన్‌ ఆర్‌ఐ, ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు మాత్ర మే ఫస్ట్‌డోసును ఇస్తూ ఇతరులకు నిరాకరిస్తున్నారు. మొదట అడిగిన వారందరికి వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రభుత్వ ం ప్రకటించినా క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఫస్ట్‌ డోసును నిలిపి వేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయంటూ అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి కొంత నిరాశనే కనిపిస్తోంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప ఫస్ట్‌డోసుకు ఇప్పట్లో అవ కాశం లేదన్న అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. సరిపడా వైల్స్‌ అందుబాటులో ఉన్నా సెకండ్‌ డోసుకు మాత్రమే పరిమితం చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు.

Updated Date - 2021-07-31T06:08:36+05:30 IST