టీకా టెన్షన్‌

ABN , First Publish Date - 2021-07-21T06:45:18+05:30 IST

కరోనా మూడో ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భౌతికదూరాన్ని పాటించకపోవడంతో పాటు మాస్కులు ధరించకపోవడంతో, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఉమ్మడి జిల్లాలో నిత్యం 250కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

టీకా టెన్షన్‌
వ్యాక్సిన్‌ కోసం భువనగిరి ఆస్పత్రిలో బారులుతీరిన ప్రజలు

ఉమ్మడి జిల్లాలో 18ఏళ్లు పైబడినవారిలో 48శాతం మందికే టీకా

నిత్యం పీహెచ్‌సీల ఎదుట బారులు

రోజువారీ టార్గెట్‌తో సగం మందికే అందుతున్న వ్యాక్సిన్‌

ముగిసిన మూడో విడత జ్వర సర్వే

 ముంగిట మూడో ముప్పు

నల్లగొండ జిల్లాలో మూడు శాతానికి తగ్గని పాజిటివ్‌ రేటు


(ఆంధ్రజ్యోతి, నల్లగొండ ప్రతినిధి, సూర్యాపేట, యాదాద్రి)/ నల్లగొండ అర్బన్‌ : కరోనా మూడో ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భౌతికదూరాన్ని పాటించకపోవడంతో పాటు మాస్కులు ధరించకపోవడంతో, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఉమ్మడి జిల్లాలో నిత్యం 250కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా, థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో ముమ్మరంగా కొనసాగాల్సిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా, ఏడు నెలల కాలంలో ఇప్పటి వరకు .... శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్‌ పూర్తయింది. వారం రోజులు వ్యాక్సినేషన్‌ నడిస్తే స్టాక్‌ లేదంటూ రెండు రోజులు పూర్తిగా నిలిపివేస్తున్నారు. సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రి, అర్వపల్లి పీహెచ్‌సీలో టీకా కోసం ప్రజలు మంగళవారం గంటలకొద్దీ బారులు తీరగా, అధికారులు స్టాక్‌ లేదని చెప్పడంతో వారు నిరసన వ్యక్తం చేశారు.



ఉమ్మడి జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో 38,72,578  జనాభా ఉండగా, 18ఏళ్లకు పైబడినవారు 19లక్షల మందికిపైగా ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు 8.72లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో 18ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 10,80,660 వరకు ఉంది. జూన్‌ 13వ తేదీ నాటికి 1.44లక్షల మందికే వ్యాక్సిన్‌ ఇచ్చారు. అందులో మొదటి డోస్‌ 1.14లక్షల మంది తీసుకోగా, రెండు డోసులు పూర్తయినవారు 30,317మంది వరకు ఉన్నారు. ఇది 13.41శాతం మాత్రమే. ఇప్పటి వరకు వైద్యాధికారుల లెక్కల ప్రకారం 3,17, 395 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. అందులో 2,65,552 మంది మొదటి డోస్‌ తీసుకోగా, 47,790 మంది రెండో డోస్‌ తీసుకున్నారు. ఇది 29.35శాతం మాత్రమే. ఇక సూర్యాపేట జిల్లాలో 10,99, 560 మంది జనాభా ఉండగా, 5లక్షల మందికి పైగా 18 ఏళ్లకు పైబడినవారు ఉన్నారు. ఇప్పటి వరకు 2,53,561 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది. అందులో మొదటి డోస్‌ 2,03,489మంది, రెండు డోసులు 50072 మంది తీసుకున్నారు. యాదాద్రి జిల్లాలో 7.74లక్షల జనాభా ఉండగా, 18ఏళ్లకు పైబడినవారు 3.20లక్షల మంది వరకు ఉన్నారు. ఇప్పటి వరకు 3,02,576మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగా, 2,32,021 మంది తొలి డోస్‌, 70,555మంది రెండో డోస్‌ తీసుకున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 18ఏళ్లు పైబడినవారు 19లక్షల మందికి పైగా ఉండగా, ఏడు నెలల కాలంలో కేవలం 48శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్‌ అందింది. యాదాద్రి జిల్లా కేంద్ర ఆస్పత్రి, ఒక ఏరియా, మూడు సీహెచ్‌సీలు, 21 పీహెచ్‌సీల్లో నిత్యం 2వేల మందికి పైగా వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 31కేంద్రాల్లో నిత్యం 5వేల టీకాలు ఇస్తున్నారు. ఒక్కోసారి 2500 టీకాలు ఇస్తున్నారు. టీకాల కొరత కారణంగా ప్రజలు నిత్యం పీహెచ్‌సీల ఎదుట గంటలతరబడి బారులు తీరి చివరికి ఉసూరుమంటూ వెళ్లాల్సి వస్తోంది.


మళ్లీ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

ఉమ్మడి జిల్లాలో మళ్లీ కరోనాకేసులు పెరుగుతున్నాయి.ప్రస్తుతం నిత్యం 250కిపైగా కేసులు నమోదవుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో నిత్యం 70 నుంచి 80దాకా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన కొంతమంది కూలీలు ఇటీవల నిజామాబాద్‌ జిల్లాలో నా ట్లు వేసేందుకు వెళ్లగా, 16మందికి పాజిటివ్‌గా వచ్చిం ది. దీంతో వారంతా హోంక్వారంటైన్‌లో ఉన్నారు. కోదా డ, మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాల నుంచి నిత్యం ఆంధ్రా ప్రాంతానికి రాకపోకలు సాగుతుండటం తో చాలామంది కరోనా బారిన పడుతున్నారు. యాదా ద్రి జిల్లాలో రోజువారీగా 2వేల మందికి పరీక్షలు చేస్తుండ గా, 60వరకు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. పీహెచ్‌సీలతో పోలిస్తే ప్రధానంగా అర్బన్‌హెల్త్‌ సెంటర్లు, జిల్లా కేంద్ర ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రుల పరిధిలోని అధికంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. నాగార్జునసాగర్‌, నకిరేకల్‌, మిర్యాలగూడతో పాటు పరిసర గ్రామాలు, నల్లగొండతో పాటు పరిసర గ్రామాలు, సూర్యాపేట, పట్టణాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతం కావడంతో నాగార్జునసాగర్‌, పెద్దవూర, హాలియా, త్రిపురారం, మిర్యాలగూడ పట్టణంతో పాటు పరిసర గ్రామాలైన ఆళ్లగడప, వేములపల్లి, దామరచర్లలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. స్థానిక రైస్‌ మిల్లులతో పాటు దామరచర్లలోని పవర్‌ ప్రాజెక్టులో ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిగా రాకపోకలు సాగుతుండటంతో కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు గుర్తించారు. నల్లగొండ పట్టణం పరిధిలోని పానగల్‌తో పాటు రాములబండ, చర్లపల్లిలో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో వ్యాపార నిమిత్తం రాకపోకలు ఎక్కువగా కొనసాగుతుండటంతో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండగా, అందులో ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట కూడా ఉన్నాయి. దీంతో రాష్ట్రస్థాయి అధికారి స్థానికంగా కరోనా వ్యాప్తి నియంత్రణపై నిత్యం పరిశీలిస్తున్నారు.


మూడు శాతానికి తగ్గని పాజిటివ్‌ రేటు

నల్లగొండ జిల్లాలో రెండు వారాల నుంచి కరోనా పాజిటివ్‌ కేసులు నిలకడగా ఉన్నాయి. అయినా పాజిటివ్‌ రేటు 3శాతానికి తగ్గడం లేదు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 5,620 పరీక్షలు నిర్వహించగా, 132 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ డివిజన్‌లో 2.91శాతం, మిర్యాలగూడ డివిజన్‌లో 2.72శాతం, దేవరకొండ డివిజన్‌లో 1.83శాతం పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. నల్లగొండ డివిజన్‌లోనే అధికంగా పాజిటివ్‌ రేటు నమోదవుతోంది. రాష్ట్ర ఉన్నతాధికారులు పాజిటివ్‌ రేటును 1శాతం లోపు తీసుకురావాలని ఆదేశించినా ఫలితం కనిపించడంలేదు. కాగా, జిల్లాలో మూడో విడత చేపట్టిన ఇంటింటి సర్వే ముగిసింది. మొత్తం 4లక్షల కుటుంబాలను సర్వే చేయగా 3,782మంది దగ్గు, జ్వరం, జలుబు ఇతర సీజనల్‌ వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. అందులో అవసరమైన వారికి మెడికల్‌ కిట్లను ఇళ్ల వద్దే అందజేశారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 50 పడకలతో ఒక వార్డు ఏర్పాటు చేశారు. ముగ్గురు సీనియర్‌ ఈఎన్టీలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. కాగా, ఇప్పటి వరకు ఒక బ్లాక్‌ ఫంగస్‌ కేసు రాగా, విజయవంతంగా చికిత్స నిర్వహించారు.


వ్యాక్సిన్‌ లేదని నిరసన

సూర్యాపేట అర్బన్‌, అర్వపల్లి, జూలై 20: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, అర్వప ల్లి పీహెచ్‌సీలో మంగళవారం వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేట ఆస్పత్రిలో 8గంటలకే సుమారు 50మందికి పైగా క్యూలో నిల్చున్నారు. 12గంటలైనా అధికారులు వ్యాక్సిన్‌, సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. అర్వపల్లిలో సైతం సుమారు 100మంది వరకు క్యూలో నిల్చోగా వ్యాక్సిన్‌ లేదని చెప్పడంతో ప్రజలు అసహనం వ్యక్తంచేస్తూ వెనుతిరిగారు.


దశలవారీగా వ్యాక్సిన్‌ : జి.సాంబశివరావు, యాదాద్రి డీఎంహెచ్‌వో 

జిల్లాలోని ప్రజలందరికీ దశల వారీగా వ్యాక్సినేషన్‌కు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం రోజువారీగా అందుబాటులో ఉన్న మేరకు 2వేల వరకు టీకాలు ఇస్తు న్నాం. ఇప్పటివరకు 3లక్షల మందికిపైగా వ్యాక్సినేషన్‌ పూర్తయింది. కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్‌-19 నిబంధనలు కచ్చితంగా పాటించాలి. విధిగా మాస్క్‌ ధరించడంతోపాటు, శానిటైజేషన్‌, పరిసరాల పరిశుభ్రతపై దృష్టిపెట్టాలి. అప్పుడే కరోనాను అదుపుచేయవచ్చు.


Updated Date - 2021-07-21T06:45:18+05:30 IST