వ్యాక్సిన్‌ లేదు.. ఉత్సవ్‌ లేదు!

ABN , First Publish Date - 2021-04-12T04:49:41+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమేపీ పెరిగిపోతున్నా.. అందుకు సరిపడా టీకా నిల్వలు అందుబాటులో ఉండడం లేదు. ‘45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా అందించండి. ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో ఆదివారం ‘టీకా ఉత్సవ్‌’ను ప్రారంభించండి’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. కానీ జిల్లాలో మాత్రం కరోనా వ్యాక్సిన్‌ నిల్వలు పూర్తిగా నిండుకోవడంతో టీకా ఉత్సవ్‌ కార్యక్రమం ప్రారంభం కాలేదు.

వ్యాక్సిన్‌ లేదు.. ఉత్సవ్‌ లేదు!
దవిడిగాం వద్ద చెక్‌ పోస్టును ఏర్పాటు చేసిన దృశ్యం

జిల్లాలో నిండుకున్న టీకా నిల్వలు

ఇప్పటికి 2,00,186 మందికి మాత్రమే కరోనా వ్యాక్సిన్‌  

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 11 : 

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమేపీ పెరిగిపోతున్నా.. అందుకు సరిపడా టీకా నిల్వలు అందుబాటులో ఉండడం లేదు. ‘45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా అందించండి. ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో ఆదివారం  ‘టీకా ఉత్సవ్‌’ను ప్రారంభించండి’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. కానీ జిల్లాలో మాత్రం కరోనా వ్యాక్సిన్‌ నిల్వలు పూర్తిగా నిండుకోవడంతో టీకా ఉత్సవ్‌ కార్యక్రమం ప్రారంభం కాలేదు.  కేవలం శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 500 మాత్రమే ఉండడంతో ఆదివారం వాటిని మాత్రమే వినియోగించారు. జిల్లాలో ఏ పీహెచ్‌సీల్లోనూ వాక్సిన్‌ లేదు. ఒక్కడోసు కూడా మిగలలేదు. దీంతో ఎక్కడా ఉత్సవ్‌ కార్యక్రమం చేపట్టలేదు. వ్యాక్సిన్లు కావాలని సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇండెంట్‌ వెళ్లినా అందించలేకపోయారు. ఈ ఏడాది జనవరి 17 నుంచి ఇప్పటివరకూ 2,00,186 మందికి వ్యాక్సిన్‌ వేశారు. జిల్లాలో రెండో దశ వ్యాప్తిలో భాగంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఆదివారం 2,033 మందికి కరోనా పరీక్షలు చేయగా, 293 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనా బాధితుల సంఖ్య 48,334కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. ప్రస్తుతం ఐసోలేషన్‌ కేంద్రంలో 1,063 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 112 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 119 మంది చికిత్స పొందుతున్నారు. శని, ఆదివారాల్లో కరోనా లక్షణాలతో ముగ్గురు మృతిచెందారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే జిల్లావాసులంతా వ్యాక్సిన్‌ కోసం పరుగులు తీస్తున్నారు. ప్రధానంగా 45 ఏళ్లు దాటిన వారంతా ఆస్పత్రులకు వెళ్లి ఒత్తిడి తెస్తున్నారు. టీకా నిల్వలు లేవని ఆస్పత్రుల సిబ్బంది చెబుతుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. జిల్లాకు సరిపడా టీకాలు సరఫరా చేయాలని కోరుతున్నారు. 

 

మళ్లీ ‘కొవిడ్‌’ సేవలు!

కరోనా బాధితుల కోసం జిల్లా ఆస్పత్రిలో ఏర్పాట్లు

సంతబొమ్మాళిలో క్వారంటైన్‌ కేంద్రానికి సన్నాహాలు

(టెక్కలి రూరల్‌) 

జిల్లాలో కరోనా రెండో దశ వ్యాప్తి విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. టెక్కలిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చి సేవలను అందించేందుకు  వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న ఇన్‌పేషెంట్‌ వార్డులు, ట్రామా కేర్‌, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ తదితర విభాగాలను మార్చేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈనెల 15 నుంచి కరోనా వైద్య సేవలు అందించేందుకు సన్నద్ధమవుతున్నారు.  కొవిడ్‌ చికిత్సకు అవసరమైన ఐసియూ, 1కె.ఎల్‌ ఆక్సిజన్‌ తదితర ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌ వైద్యసేవలు ప్రారంభమైతే ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, కంచిలి, మందస, పలాస, టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం ప్రాంతాల నుంచి కరోనా బాధితులకు వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా సంతబొమ్మాళి మండలం లక్ష్మీ పురం సమీపంలోని టౌన్‌షిప్‌లో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈవిషయమై డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ లీలా వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కొవిడ్‌ ఆసుపత్రి, కొవిడ్‌ కేర్‌సెంటర్‌ పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.


రాజాం సీహెచ్‌సీలో కూడా.. 

రాజాం : రాజాంలోని సామాజిక ఆస్పత్రిలో కూడా కరోనా బాధితులకు సేవలు అందించనున్నారు. ఈ మేరకు జేసీ సుమిత్‌కుమార్‌ ఆదివారం సామాజిక ఆస్పత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజాంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతున్నాయని, ప్రస్తుతం 100 కుపైగా కేసులు దాటాయని పేర్కొన్నారు. అందువల్ల కరోనా బాధితులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాజాం సీహెచ్‌సీలో కొవిడ్‌ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పాజిటివ్‌ కేసు నమోదైన వెంటనే వారికి పూర్తిస్థాయిలో పరీక్షలు చేసి వారిని ఐసోలేషన్‌కు పంపించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కొవిడ్‌ వార్డు బాధ్యతలను సిబ్బందికి అప్పగించి వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రమేష్‌, ఆసుపత్రి వైద్యుడు ఎం.చంద్రశేఖర్‌ నాయుడు, సీఎస్‌డీటీ రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.


సరిహద్దు దాటాలంటే.. రిపోర్టు చూపించాల్సిందే..

గజపతి జిల్లా కలెక్టర్‌ ప్రకటన 

మెళియాపుట్టి, ఏప్రిల్‌ 11: మెళియాపుట్టి మండల వాసులు ఏ చిన్న వస్తువు కావాలన్నా ఒడిశాలోని పర్లాకిమిడికి వెళ్లాల్సిందే. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశాలో రాకపోకలపై గజపతి జిల్లా కలెక్టర్‌ అనుపయ్‌ సాహు ఆంక్షలు విధించారు. సోమవారం నుంచి ఒడిశాలో అడుగు పెట్టాలంటే 72 గంటల్లోగా చేసిన ఆర్‌టీపీసీఆర్‌ నెగిటివ్‌ ధ్రువపత్రం చూపించాలని ప్రకటించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర అధికారులు దవిడిగాం వద్ద చెక్‌ పాయింట్‌ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ వాహనదారులను తనిఖీ చేసి.. నెగిటివ్‌ రిపోర్టు ఉంటేనే ఒడిశాలోకి విడిచిపెట్టనున్నారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేసుకోవడం సాధ్యం కాదని వాపోతున్నారు.

Updated Date - 2021-04-12T04:49:41+05:30 IST