పెద్దాసుపత్రిలో వ్యాక్సిన్‌ రద్దీ

ABN , First Publish Date - 2021-04-11T05:51:46+05:30 IST

పెద్దాసుపత్రిలో వ్యాక్సిన్‌ రద్దీ

పెద్దాసుపత్రిలో వ్యాక్సిన్‌ రద్దీ

కరోనా వ్యాక్సినేషన్‌లో సమన్వయలోపం

ఆర్‌టీసీ, మున్సిపల్‌, సాధారణ ప్రజలు ఒకేసారి

కిక్కిరిసిన కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాలు

ఖమ్మం జిల్లాలో 4,238డోసుల పంపిణీ

అమలుకాని కొవిడ్‌ నిబంధనలు

 ఖమ్మంసం క్షేమవిభాగం, ఏప్రిల్‌ 10: ఖమ్మం జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా ప్రధాన ఆసుపత్రి అధికారుల మధ్య సమన్వయలోపం కరోనా వ్యాక్సినేషన్‌కోసం వచ్చిన వారికి శాపంగా మారుతుందన్న విమర్శలు వెలువడుతున్నాయి. ఏ ప్రభుత్వశాఖలు ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ కావాలని అడిగినా ‘జిల్లా ఆసుపత్రికి పోండి’ అని సలహాలు ఇవ్వటంతోనే సమన్వయ సమస్యలు ఎదురవుతున్నట్లు వైద్యశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గత పక్షం రోజులుగా పెరగటంతో పాటుగా పత్రికల్లో పాజిటివ్‌ వివరాలు నామమాత్రంగానే వస్తున్నాయి. అయినా వ్యాక్సినేషన్‌కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, వ్యాపారులు స్వచ్చందంగా ముందుకు వచ్చి వ్యాక్సినేషన్‌ తీసుకుంటుండడంతో జిల్లా ఆసుపత్రిలోని ఎన్‌ఆర్‌సీ, ఆయుష్‌, ఏఎన్‌ఎం శిక్షణ కేంద్రం, లెప్రసీ వార్డులోని వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు తాకిడి పెరిగింది.

కార్యచరణ లేని వ్యాక్సినేషన్‌

జిల్లా ఆసుపత్రికి వ్యాక్సినేషన్‌కు వచ్చేవారి సంఖ్యను పరిగణించకుండానే అధికారులు శనివారం ఇటు ఆర్‌టీసీ ఉద్యోగులు, ఆటు ఖమ్మంనగరపాలక సంస్థలోని ఉద్యోగులను కలిపి వ్యాక్సినేషన్‌కు పిలుపునిచ్చారు. వీరితో పాటుగా సాధారణ ప్రజలు వ్యాక్సినేషన్‌కు రావటంతో జిల్లా ఆసుపత్రిలోని  నాలుగు వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ సంఖ్యలో ప్రజలు ఎదురు చూశారు. ఒకరినొకరు నెట్టుకుంటూ కనీసం కొవిడ్‌ నిబందనలు పాటించకపోవటంతో వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంది. జనాన్ని తట్టుకోలేక వ్యాక్సిన్‌కోసం వచ్చిన వృద్ధులు వెనుదిరిగారు.

రికార్డు స్థాయిలో 4,238 డోసుల పంపిణీ

సాధారణ ప్రజలతో పాటుగా ఆర్‌టీసీ, మున్సిపాలిటీ ఉద్యోగులు కరోనా వ్యాక్సినేషన్‌కు రావటంతో జిల్లాలో రికార్డు స్థాయిలో శనివారం వ్యాక్సినేషన్‌ జరిగింది. కొవిన్‌యాప్‌లో నమోదు చేసుకున్న 3,665మందితో పాటుగా హెల్త్‌కేర్‌ వర్కర్లు 66మంది, ప్రంట్‌లైన్‌ వర్కర్లు 507మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవటంతో మొత్తం 4,238డోసుల వ్యాక్సినేషన్‌ ఇచ్చినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.


Updated Date - 2021-04-11T05:51:46+05:30 IST