వ్యాక్సిన్‌ నిల్‌

ABN , First Publish Date - 2021-04-17T05:01:04+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ నిల్వలు మళ్లీ నిండుకున్నాయి. వ్యాక్సిన్‌ పూర్తిగా అయిపోవడంతో శుక్రవారం ఒకటి, రెండుచోట్ల మినహా మిగిలినచోట్ల వ్యాక్సినేషన్‌ నిలిచిపోయింది.

వ్యాక్సిన్‌ నిల్‌

పూర్తిగా నిండుకున్న నిల్వలు

ఒకటి, రెండుచోట్ల మినహా మిగిలినచోట్ల నిలిచిపోయిన వ్యాక్సినేషన్‌

కేంద్రాల వద్ద సిబ్బందితో జనం వాగ్వాదం

రెండో డోసు తీసుకోవాల్సిన వారిలో ఆందోళన

ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు

నేడో రేపో వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ నిల్వలు మళ్లీ నిండుకున్నాయి. వ్యాక్సిన్‌ పూర్తిగా అయిపోవడంతో శుక్రవారం ఒకటి, రెండుచోట్ల మినహా మిగిలినచోట్ల వ్యాక్సినేషన్‌ నిలిచిపోయింది. వారం కిందట ఒకసారి ఇదే పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో నాలుగు రోజుల కిందట జిల్లాకు 55 వేల డోసుల వ్యాక్సిన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అయితే, ఆ మరుసటిరోజు సుమారు 52 వేల డోసులు వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించారు. మిగిలిన కొద్దిపాటి వ్యాక్సిన్‌ను గురువారం అందించిన అధికారులు...శుక్రవారం పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో అనేక కేంద్రాల వద్ద సిబ్బందితో, వ్యాక్సిన్‌ తీసుకునేందుకు వచ్చినవారు వాగ్వాదానికి దిగారు. రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వచ్చిన వారితో నగరంలోని విమ్స్‌ పాంగణం కిక్కిరిసింది. అయితే, అతికొద్దిమందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చారు. మిగిలినవారు తరువాత రావాలని అక్కడి సిబ్బంది చెప్పడంతో..వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 


వారిలో ఆందోళన..


మొదటి డోసు తీసుకోవాలనుకునే వారితో పోలిస్తే...రెండో డోసు తీసుకోవలసిన వారు వ్యాక్సిన్‌ నిల్వలు అయిపోయాయని తెలిసి ఆందోళన చెందుతున్నారు.  సకాలంలో రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయోనంటూ వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే, రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవడం ఒకటి, రెండు రోజులు అటుఇటు అయినా ఇబ్బంది లేదని అఽధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారు మొదటి డోసు తీసుకున్న తరువాత నాలుగు నుంచి ఎనిమిది వారాల మధ్య ఎప్పుడైనా రెండో డోసు తీసుకోవచ్చునని, సరిగ్గా నాలుగు వారాలు ముగిసిన వెంటనే తీసుకోవాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సూర్యనారాయణ తెలిపారు. అలాగే కొవాగ్జిన్‌ తీసుకున్నవారు..నాలుగు వారాల తరువాత ఎప్పుడైనా తీసుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. 


నేడు వచ్చే అవకాశం 


జిల్లాలో వ్యాక్సిన్‌ కొరత వల్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిన విషయాన్ని శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాకు అవసరమైన వ్యాక్సిన్‌ను అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించిన నేపథ్యంలో..శుక్రవారం రాత్రికి గానీ, శనివారం ఉదయానికి గానీ రెండు నుంచి మూడు లక్షల డోసుల వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం వున్నదని అధికారులు పేర్కొంటున్నారు. వచ్చిన వెంటనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను యథావిధిగా కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. 


కొనసాగుతున్న కరోనా ఉధృతి

మరో 489 నమోదు...ఇద్దరి మృతి


విశాఖపట్నం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. నగరం, గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతిరోజూ వందలాది కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం మరో 489 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 67,426కు చేరింది. ఇందులో 63,219 మంది కోలుకోగా, మరో 3,641 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం మరో ఇద్దరు మృతిచెందారు. వీటితో కొవిడ్‌ మరణాలు 566కు చేరాయి.

Updated Date - 2021-04-17T05:01:04+05:30 IST