కొందరికి వ్యాక్సినే ఇవ్వకుండా.. మరికొందరు బూస్టర్‌ వేసుకున్నా వేస్ట్‌

ABN , First Publish Date - 2021-12-04T06:39:42+05:30 IST

జనాభా మొత్తంలో కొందరికి కొవిడ్‌ టీకాలే అందకుండా.. మరికొందరికి బూస్టర్‌ డోసులు ఇవ్వడం వల్ల ఉపయోగం....

కొందరికి వ్యాక్సినే ఇవ్వకుండా.. మరికొందరు బూస్టర్‌ వేసుకున్నా వేస్ట్‌

ఒమైక్రాన్‌ తీవ్రత, మరణాలు తక్కువే

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో..

   సీసీఎంబీ మాజీ సారథి డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా


జనాభా మొత్తంలో కొందరికి కొవిడ్‌ టీకాలే అందకుండా.. మరికొందరికి బూస్టర్‌ డోసులు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదని సీసీఎంబీ మాజీ సారథి డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అన్నారు. దానివల్ల వైరస్‌ కొత్త రూపంలో విజృంభించే ప్రమాదం ఉందన్నారు. దేశ ప్రజలందరికీ రెండో డోసు ఇవ్వగలిగితే భారత్‌లో థర్డ్‌వేవ్‌ వచ్చే ప్రమాదం ఉండదన్నారు. పౌరులంతా రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుంటే మహమ్మారిగా విజృంభించే వైరస్‌ కూడా సాధారణ వైర్‌సగా మారుతుందని ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ.. బూస్టర్‌డో్‌సపై చర్చ.. థర్డ్‌వేవ్‌ ముప్పు వంటి అంశాలపై రాకేశ్‌మిశ్రా మాట్లాడారు.


డెల్టా వేరియంట్‌ మాదిరిగానే ఒమైక్రాన్‌ కల్లోలం ఉంటుందా?

డెల్టా వేరియంట్‌ కంటే ఒమైక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వేరియంట్‌లో ఎక్కువ మ్యూటేషన్లు ఉన్నాయి. అయితే.. ఒమైక్రాన్‌తో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు చాలా తక్కువ. ఇది ఊరట కలిగిం చే అంశం. ఒమైక్రాన్‌ వార్తలు రాగానే మన దేశ ప్రజలు అప్రమత్తమై జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఇలాంటి జాగ్రత్తలతోనే ఒమైక్రాన్‌ ప్రభావం నుంచి తేలిగ్గా బయటపడొచ్చు.


మన దేశంలో ఒమైక్రాన్‌పై పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి?

ఇన్సాకాగ్‌ సారథ్యంలో సీసీఎంబీతో పాటు ఢిల్లీ, బెంగళూరు, పుణేల్లోని పరిశోధన సంస్థల్లో నమూనాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి. 


ఒమైక్రాన్‌ ప్రభావం యువతపై ఎక్కువ అంటున్నారు కదా?

అందుకు శాస్త్రీయ ఆధారాల్లేవు. యువత బయట ఎక్కువగా తిరుగుతారు. కాబట్టి వైరస్‌ సోకినవారిలో వారే ఎక్కువగా ఉండి ఉంటారు.


మన దే శంలో ఒమైక్రాన్‌ ప్రభావం ఎలా ఉండనుంది?

మన దేశంలో అధిక శాతం మందిలో యాంటీ బాడీలు వృద్ధి చెందాయి. ప్రతి ఒక్కరూ వేగంగా రెండు టీకాలు తీసుకోవడంతో పాటు అన్ని జాగ్రత్తలు పాటిస్తే.. ఒమైక్రాన్‌ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.


బూస్టర్‌ డోస్‌ వేసుకోవాల్సిందేనా?

మన దేశ ప్రజల్లో ఇంకా చాలా మంది ఒక డోస్‌ వ్యాక్సిన్‌ కూడా తీసుకోలేదు. ప్రతి ఒక్కరూ సత్వరం రెండు డోస్‌ల టీకాలు తీసుకోవాలి. కొందరు అసలు టీకాలే తీసుకోకుండా, కొద్దిమంది బూస్టర్‌ డోస్‌ ఇచ్చినా ఫలితం ఉండదు. దీనివల్ల వైరస్‌ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉంటుంది.


కొన్ని దేశాల్లో బూస్టర్‌ డోస్‌లు ఇస్తున్నారు కదా?

రెండు డోస్‌లు ఇవ్వడం పూర్తయ్యాక మూడో డోస్‌ గురించి ఆలోచన చేయడంలో తప్పు లేదు. హెల్త్‌ వర్కర్ల వంటి వారిలో ఆత్మ విశ్వాసం నింపేందుకు, వారికి మరింత రక్షణ కల్పించేందుకు అవసరమైతే బూస్టర్‌ డోస్‌లు ఇవ్వవచ్చు.


రెండు డోసుల వేర్వేరు టీకాలతో ప్రయోజనం ఉంటుందా?

దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే.. ఇప్పటి వరకు అందబాటులో ఉన్న వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయి.


మన దేశంలో థర్డ్‌వేవ్‌ చాన్స్‌ ఉంటుందా?

పలు దేశాల్లో 4, 5 వేవ్‌లు కూడా వచ్చాయి. ఒమైక్రాన్‌తో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. ఇది మరిం త వ్యాప్తి చెందే లోపు జాగ్రత్తలు తీసుకుంటే థర్డ్‌ వేవ్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వైరస్‌ దాడి చేయవచ్చు. ఇది త్వరలో ఫ్లూ వంటి సాధారణ వైర్‌సగా మారే అవకాశముంది.        

                                                                                                  - స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2021-12-04T06:39:42+05:30 IST