మోదీకి ధన్యవాదాలు చెప్పిన వ్యాక్సిన్ తయారీదారులు

ABN , First Publish Date - 2021-10-24T01:30:19+05:30 IST

రికార్డు సమయంలో వ్యాక్సిన్లను సిద్ధం చేయడానికి

మోదీకి ధన్యవాదాలు చెప్పిన వ్యాక్సిన్ తయారీదారులు

న్యూఢిల్లీ : రికార్డు సమయంలో వ్యాక్సిన్లను సిద్ధం చేయడానికి, వాటిని ల్యాబొరేటరీల నుంచి ప్రజలకు చేరువ చేయడానికి నిరంతరం సహకరించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యాక్సిన్ తయారీదారులు ధన్యవాదాలు తెలిపారు. ఏడు భారతీయ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ సంస్థల ప్రతినిధులతో మోదీ శనివారం సమావేశమయ్యారు. 


సీరం ఇన్‌స్టిట్యూట్‌ మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ పూనావాలా ఈ సమావేశం అనంతరం మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశిత పరిధికి మించి పని చేశారని చెప్పారు. ప్రతి ఒక్కరూ వేగంగా పని చేసేలా ప్రోత్సహించారని చెప్పారు. ఆయన, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కృషి చేసి ఉండకపోతే, నేడు మన దేశం 100 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల పంపిణీ రికార్డును సాధించి ఉండేది కాదన్నారు. 


జైడస్ క్యాడిలా సీఎండీ పంకజ్ పటేల్ మాట్లాడుతూ, తమ డీఎన్ఏ వ్యాక్సిన్‌ను తమ శాస్త్రవేత్తల కృషితో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారం చాలా ఉందని చెప్పారు. ఆయన మొదటి నుంచీ తమను ప్రోత్సహిస్తున్నారన్నారు. ‘‘ముందడుగు వేయండి, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’’ అని చెప్పారన్నారు. ఐక్య రాజ్య సమితిలో తమ వ్యాక్సిన్ గురించి మోదీ మాట్లాడారని, ఇది తమకు ఎంతో గర్వకారణమని చెప్పారు. ఈ సరికొత్త నవ కల్పన (ఇన్నోవేషన్) అధ్యాయంలో భారత దేశం వేగంగా ప్రగతి సాధిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 


ఈ ఏడాది జనవరి 16 నుంచి అక్టోబరు 21 ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు పంపిణీ చేయడం ద్వారా భారత దేశం రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 



Updated Date - 2021-10-24T01:30:19+05:30 IST