వ్యాక్సిన కష్టాలు..!

ABN , First Publish Date - 2021-05-11T06:28:01+05:30 IST

తొలి విడత టీకా వేయించుకునే వారికి ఇప్పట్లో ఆ ఆశ తీరేలా కన్పించడంలేదు. ఈనెల 31 వరకు ఎదురు చూడాల్సిందే. ప్రభుత్వం వ్యాక్సిన కొరతతో కొత్త నిబంధనలను తెరపైకి తీసుకొచ్చింది. తొలి విడత వేయించుకుని, రెండో విడత డోసు కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రమే కరోనా టీకా వేయాలని నిర్ణయం తీసుకుంది.

వ్యాక్సిన కష్టాలు..!

తొలి విడత టీకా అంతే..!

రెండో డోసుకు మాత్రం ఓకే

జిల్లాలో రెండో డోసుకు 

1.30 లక్షల మంది ఎదురుచూపులు

అందుబాటులో 14 వేల డోసులు

నేడు 58 కేంద్రాల్లోనే టీకా

అనంతపురం వైద్యం, మే10: తొలి విడత టీకా వేయించుకునే వారికి ఇప్పట్లో ఆ ఆశ తీరేలా కన్పించడంలేదు. ఈనెల 31 వరకు ఎదురు చూడాల్సిందే. ప్రభుత్వం వ్యాక్సిన కొరతతో కొత్త నిబంధనలను తెరపైకి తీసుకొచ్చింది. తొలి విడత వేయించుకుని, రెండో విడత డోసు కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రమే కరోనా టీకా వేయాలని నిర్ణయం తీసుకుంది. అది కూడా కోవాగ్జిన వేయించుకున్న వారు 4 వారాల నుంచి 6 వారాల లోపు ఉంటేనే వ్యాక్సిన వేస్తారు. కొవిషీల్డ్‌ వేయించుకున్న వారికి 6 వారాల నుంచి 8 వారాలలోపు ఉంటేనే టీకా ఇస్తారు. ఇప్పటి వరకు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 1.30 లక్షల మంది తొలి డోసు వేయించుకుని, రెండో డోసు కోసం ఎదురుచూస్తున్నారు. వీరందరికీ మంగళవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు రెండో డోసు టీకా వేయనున్నారు. అది కూడా నిబంధనలకు అనుగుణంగా సమయం ఆధారంగా వారి ఫోన్లకు మెసేజ్‌లు పంపనున్నారు. స్లిప్‌లు కూడా తయారు చేసి, వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎనఎంల ద్వారా వారికి అందజేయనున్నారు. అవసరమైతే ఫోన్లు కూడా చేసి, సమాచారం తెలియజేయనున్నారు. అప్పుడే ఎవరు ఏ రోజు ఏ కేంద్రానికి వెళితే రెండో డోసు వ్యాక్సిన వేస్తారో తెలియజేస్తారు. వారు అక్కడికి మాత్రమే వెళ్లి, రెండో డోసు వ్యాక్సిన వేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 14 వేల డోసుల వ్యాక్సిన అందుబాటులో ఉంది. మంగళవారం జిల్లాలో వ్యాక్సిన పంపిణీకి యంత్రాంగం సిద్ధమైంది. దీనిని బట్టి తొలి విడత టీకా కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి నిరాశ తప్పడం లేదు. 60 ఏళ్లు పైబడిన వారు అనేక మంది టీకా తొలి విడత వేయించుకోని వారున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ విజృంభిస్తోంది. దీంతో వ్యాక్సిన వేయించుకోవడానికి ఈ వృద్ధులు ఆరాట పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనతో మరో 20 రోజుల పాటు వీరు ఎదురు చూడక తప్పదు. అప్పటి వరకు కరోనా బారిన పడకుండా ఉంటామా, ప్రాణాలతో ఉంటామా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన వారికైనా తొలి విడత టీకా వేసేలా ఆలోచించాలని వారు కోరుతున్నారు.


నేడు 58 కేంద్రాల్లో రెండో డోసు

జిల్లాలో మంగళవారం 58 కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సిన వేయనున్నట్లు డీఎంహెచఓ డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌, డీఐఓ డాక్టర్‌ గంగాధర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 31వ తేదీ వరకు రెండో విడత టీకా మాత్రమే వేస్తామనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ తొలి డోసు వ్యాక్సిన ఇవ్వమని స్పష్టం చేస్తున్నారు. రెండో డోసు లబ్దిదారులకు ఫోన ద్వారా, ఆశా కార్యకర్తల ద్వారా సమాచారం అందించి, ఎంపిక చేశామన్నారు. వారికి మాత్రమే మంగళవారం టీకా వేస్తామన్నారు. జిల్లాలో అగళి, ఆమడగూరు, అమరాపురం, అనంతపురం జీజీహెచ, ఆత్మకూరు, బత్తలపల్లి, గార్లదిన్నె, గుత్తి, గోరంట్ల, గుదిబండ, హేమావతి, హిందూపురం ఆస్పత్రి, లక్ష్మీపురం(హిందూపురం), కదిరేపల్లి, కదిరి, నిజాంవలి కాలనీ (కదిరి), కళ్ళుమర్రి, కొండాపురం, కొర్రపాడు, కృష్ణాపురం, క్రిష్టిపాడు, కురుగుంట, లేపాక్షి, మలకవేముల, ఎనపికుంట, నాగసముద్రం, నార్పల, నీలకంఠాపురం, ఓడీసీ, పీ.కొత్తపల్లి, పాల్తూరు, పట్నం, పెద్దవడగూరు, పెనుకొండ, పుట్టపర్తి, రాకెట్ల, రాయదుర్గం, రాయంపల్లి, తలుపుల, తాడిపత్రి, తరిమెల, తిమ్మంపల్లి, ఉరవకొండ, వజ్రకరూరు, గుంతకల్లు ఆస్పత్రి, అంబేడ్కర్‌నగర్‌ (గుంతకల్లు), అనంతపురం వైద్య కళాశాల, ఇందిరాగాంధీ నగర్‌ (అనంతపురం), బోయపేట (అనంతపురం), చౌలూరు, ఎల్‌ఎ్‌సకేపురం, శ్రీనివాసనగర్‌, టైలర్స్‌ కాలనీ, పెద్దపప్పూరు, కలెక్టరేట్‌ కేంద్రాల్లో రెండో విడత కరోనా వ్యాక్సిన వేయనున్నట్లు డీఎంహెచఓ వెల్లడించారు. కేటాయించిన కేంద్రాల్లో టీకా వేయించుకోవాలని ఆయన కోరారు.


Updated Date - 2021-05-11T06:28:01+05:30 IST